కాంగ్రెస్ గ్యారెంటీలను కాపీ కొట్టిన కేసీఆర్
బీఆరెస్ తన ఉనికిని కోల్పోయింది
కేసీఆర్ ఆలోచన శక్తి కోల్పోయారు
బీఆరెస్ కు ఆలోచన, ఆచరణ లేదు, సంక్షేమం అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు
కేసీఆర్ పాలనకు ఎక్స్ పైరీ డేట్ వచ్చింది
కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా..
ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలి.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను కేసీఆర్ కాపీ కొట్టి బీఆరెస్ మేనిఫెస్టో ప్రకటించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మా గ్యారంటీలను కాపీ కొట్టి కేసీఆర్ పెద్ద అగాథంలో పడిపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేం ఆరు గ్యారంటీలు ఇస్తామంటే బీఆరెస్ నేతలు అదెలా సాధ్యమన్నారు కానీ ఇప్పుడు బీఆరెస్ నేతలు కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత కోల్పోయారని ఎద్దేవా చేశారు. బీఆరెస్ తన ఉనికిని కోల్పోయింది… కేసీఆర్ ఆలోచన శక్తి కోల్పోయారని సెటైర్ వేశారు. బీఆరెస్ కు ఆలోచన, ఆచరణ, సంక్షేమం అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ మేనిఫెస్టోను కాంగ్రెస్ ఒక చిత్తు కాగితంగా చూస్తోందని దానిపై చర్చ అనవసరమన్నారు రేవంత్ రెడ్డి.
“మహాలక్ష్మి పథకం కింద మేం రూ.2,500 అంటే కేసీఆర్ ఇవాళ రూ.3 వేలు అన్నారు… ఆడబిడ్డలకు మేం రూ.500 గ్యాస్ సిలిండర్ అంటే ఆయన రూ.400 అన్నాడు… పెన్షన్ల విషయంలో మేం రూ.4 వేలు అంటే ఆయన రూ.5 వేలు అన్నాడు… మేం ఇందిరమ్మ భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రూ.15 వేలు ఇస్తామంటే… ఆయన ఇప్పుడు రూ.16 వేలు ఇస్తామంటున్నాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ గతంలో సారా పాటలు నిర్వహించేవారు. అయితే, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనకుండానే కేసీఆర్ మమ్మల్ని కాపీ కొట్టి పెద్ద లోయలో పడిపోయారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే… రాష్ట్రం దివాళా తీయడమే కాదు, కేసీఆర్ బుర్ర కూడా దివాళా తీసింది. కేసీఆర్ లో ఆలోచించే శక్తి సన్నగిల్లింది” అన్నారు రేవంత్ రెడ్డి.
బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్ లో చూపించినట్లు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని.. పాత హామీలనే అమలు చేయకుండా.. ఇప్పుడు మరో సారి మోసం చేద్దామని ముందుకొచ్చినట్లు ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కేసీఆర్, బీఆర్ఎస్ ఇక ఎంతమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. కేసీఆర్, ఆయన పార్టీ పరాన్నజీవులు. పక్కవాళ్ల మీద ఆధారపడి బతికేవాడు పరాన్నజీవి. ప్రజా సంక్షేమం పట్ల ఆలోచన, చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీలో లోపించాయనడానికి వాళ్ల మేనిఫెస్టోనే నిదర్శనమని రేవంత్ రెడ్డి విమర్శించారు.
గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాగితంపై రాసుకుని ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మేం రూ.4 వేల పెన్షన్, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే… అదెలా సాధ్యమవుతుంది? అంటూ ఇన్నాళ్లు మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వారి మేనిఫెస్టో పట్ల ఏం సమాధానం చెబుతారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ లా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదని ఆరు గ్యారంటీలను అమలు చేయగలమనే నమ్మకంతోనే వాటిని ప్రకటించామని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలను కాపీ కొట్టడం ద్వారా వాటి అమలు సాధ్యమని కేసీఆర్ రాజముద్ర వేసి మరీ అంగీకరించినట్లయిందన్నారు. కాంగ్రెస్ హామీలు ఆచరణ సాధ్యమని కేసీఆర్ ప్రెస్ మీట్ తో ప్రజలకు అర్ధమైందన్నారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు పొందిన అభ్యర్థులకు రేవంత్ అభినందనలు తెలిపారు. మా అభ్యర్థులను ప్రకటించగానే.. కేసీఆర్ వారి అభ్యర్థులకు బీ-ఫామ్ లు పంచారన్నారు రేవంత్ రెడ్డి. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ బీఆరెస్ కంటే ముందు ఉందన్నారు. మేం 55 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. కేసీఆర్ 51 మందికే బీఫామ్ లు ఇచ్చారని మిగతా వాళ్లకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
అర్థంపర్ధం లేని ఆరోపణలతో బిల్లా రంగాలు కాంగ్రెస్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే ఎక్కడో డబ్బులు దొరికితే మాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దోపిడీ సొమ్ముతో జాతీయ రాజకీయాలు చేయాలని కేసీఆర్ వైఫల్యం చెందారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
“కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా..ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలి. 17 న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు నేను వస్తా…కేసీఆర్ నువ్వు అక్కడికి రా… ప్రమాణం చేద్దామని” రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
నిజంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయకపోతే…ప్రతీ నెల ఉద్యోగులకు , ఆసరా పెన్షనర్లకు ప్రతీ నెలా మొదటి తారీఖు వాళ్ళ ఖాతాలో వేయాలని కేసీఆర్ కు మరో సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. అలా అయితేనే మీరు ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తారని నమ్ముతామన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను చూసి కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందన్నారు. అవినీతికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిండర్ అన్న రేవంత్.. కేసీఆర్ కు శాశ్వతంగా విశ్రాంతి అవసరమని చెప్పారు. “ఇవాళ ప్రెస్ మీట్ లో రాబోయే ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కేసీఆర్ కనిపించారు. కాడి కిందపడేసిన కేసీఆర్ కనిపించారు. కేసీఆర్.. మీ పాలనకు ఎక్స్ పైరీ డేట్ అయిపోయింది.. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వందకు వంద శాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఆమలు చేస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
మూడు విడతలుగా బస్సు యాత్ర
రాష్ట్రంలో మూడు విడతలుగా విజయభేరీ బస్సుయాత్ర ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర దసరా తర్వాత రెండవ దశ బస్సు యాత్ర, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత బస్సు యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారు.18న రామప్ప దేవాలయంలో శివుడికి పూజ చేసి బస్సు యాత్ర ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. అదే రోజు భూపాలపల్లి లో మహిళలతో సమావేశం, 19న రామగుండంలో సింగరేణి కార్మికులతో సమావేశం, పెద్దపల్లిలో పాదయాత్ర, సభ, కరీంనగర్ లో పాదయాత్ర , సభ 20 న జగిత్యాల, బోధన్, నిజామాబాద్ లో పాదయాత్ర, సభలు ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి జాబితాలో 55 మందికి చోటు కల్పించింది. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడికి కూడా టికెట్ కన్ఫార్మ్ ఆయింది. మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన సతీమణికి కూడా టికెట్ దక్కింది. ఉత్తమ్ హుజుర్‌నగర్, పద్మావతి కోదాడ నుంచి బరిలోకి దిగుతున్నారు.
భద్రాచలం టికెట్ కమ్యూనిస్టులకు కేటాయిస్తారని ప్రచారం జరగ్గా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు టికెట్ ఖరారు చేసింది. నాగార్జునసాగర్ బరిలో ఈసారి జానారెడ్డి బదులు ఆయన తనయుడు జయవీర్ బరిలో ఉండనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, ఎంపీ కోమటిరెడ్డి నల్గొండ నుంచి, భట్టి విక్కమార్క మధిర నుంచి పోటీ చేయనున్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై తూమకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. జగిత్యాల నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇక వామపక్షాలతో పొత్తులో భాగంగా చెన్నూరు, కొత్తగూడెం సీట్లు సీపీఐకి ఖరారు చేసినట్లు తెలిసింది. సీపీఎంతోనూ చర్చలు జరిపి పొత్తు తెగిన తర్వాత మిగతా స్థానాలను కూడా ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థులు
- బెల్లంపల్లె – గడ్డం వినోద్
- మంచిర్యాల -కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
- నిర్మల్ -కూచాడి శ్రీహరి రావు
- ఆర్మూర్- ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
- బోధన్ -పి. సుదర్శన్ రెడ్డి
- బాల్కొండ- సునీల్ కుమార్ ముత్యాల
- జగిత్యాల -T. జీవన్ రెడ్డి
- ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- రామగుండం ఎం.ఎస్. రాజ్ ఠాకూర్
- మంథని- దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- పెద్దపల్లి- చింతకుంట విజయ రమణారావు
- వేములవాడ- ఆది శ్రీనివాస్
- మానకొండూర్ – డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
- మెదక్- మైనంపల్లి రోహిత్ రావు
- ఆందోల్ – సి. దామోదర్ రాజనర్సింహ
- జహీరాబాద్ – ఆగం చంద్ర శేఖర్
- సంగారెడ్డి- తురుపు జగ్గా రెడ్డి
- గజ్వేల్- తూంకుంట నర్సారెడ్డి
- మేడ్చల్- తోటకూర వజ్రేష్ యాదవ్
- మల్కాజిగిరి- మైనంపల్లి హనుమంతరావు
- కుత్బుల్లాపూర్- కొలన్ హన్మంత్ రెడ్డి
- ఉప్పల్- ఎం. పరమేశ్వర్ రెడ్డి
- చేవెళ్ల – పమేనా భీం భారత్
- పరిగి టి. రామ్మోహన్ రెడ్డి
- వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్
- ముషీరాబాద్- అంజన్ కుమార్ యాదవ్
- మలక్‌పేట్- షేక్ అక్బర్
- సనత్‌నగర్- డా. కోట నీలిమ
- నాంపల్లి- మహమ్మద్ ఫిరోజ్ ఖాన్
- కార్వాన్- ఒస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ
- గోషామహల్- మొగిలి సునీత
- చాంద్రాయణగుట్ట -బోయ నగేష్ (నరేష్)
- యాకుత్‌పురా- కె రవి రాజు
- బహదూర్‌పురా -రాజేష్ కుమార్ పులిపాటి
- సికింద్రాబాద్- ఆడమ్ సంతోష్ కుమార్
- కొడంగల్- అనుముల రేవంత్ రెడ్డి
- గద్వాల్ -సరితా తిరుపతయ్య
- అలంపూర్ – S.A. సంపత్ కుమార్
- నాగర్ కర్నూల్ – డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి
- అచ్చంపేట – డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ
- కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి
- షాద్‌నగర్- కె. శంకరయ్య
- కొల్లాపూర్ -జూపల్లి కృష్ణారావు
- నాగార్జున సాగర్- జయవీర్ కుందూరు
- హుజూర్‌నగర్- ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కోదాడ -ఎన్. పద్మావతి రెడ్డి
- నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- నకిరేకల్ – వేముల వీరేశం
- ఆలేరు – బీర్ల ఐలయ్య
- ఘన్‌పూర్ (స్టేషన్) – సింగపురం ఇందిర
- నర్సంపేట- దొంతి మాధవ రెడ్డి
- భూపాలపల్లె- గండ్ర సత్యనారాయణరావు
- ములుగు- దనసరి అనసూయ( సీతక్క)
- మధిర – భట్టి విక్రమార్క మల్లు
- భద్రాచలం- పొదెం వీరయ్య