హైదరాబాద్ : కామ్రేడ్ ఎల్ ఎస్ ఎన్ మూర్తి (72) గత నెలరోజులుగా గొంతు కేన్సర్ కు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ అంటే 2022 డిసెంబర్ 21 రాత్రి 8 గంటల 45 నిముషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం తెనాలిని ఆనుకుని ఉండే కఠేవరం.
కామ్రేడ్ ఎల్ఎస్ఎన్ మూర్తి హైదరాబాదులోని డిఫెన్స్ అకౌంట్స్ లో పనిచేసేవారు. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అలాగే తంతి తపాలా, ఏజీ ఆఫీసు, ఇన్కమ్ టాక్స్, ఆల్ ఇండియా రేడియో లతోపాటు డిఫెన్స్ అకౌంట్స్ లో పనిచేసే వారిని కూడా కలిపి అఖిల భారత స్థాయిలో కాన్ ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అని ఒక చురుకైన కార్మిక సంఘం ఉండేది. అందులో తను కూడా చురుకుగా పనిచేసారు.
ఆ తరవాత కా. ఎల్ఎస్ఎన్ మూర్తి నక్సల్బరీ ఉద్యమంతో ప్రేరితుడై తన ఉద్యోగాన్ని వదిలి పెట్టి పూర్తి కాలపు విప్లవకారుడిగా గత 50 ఏళ్లుగా విప్లవోద్యమానికి తన జీవితాన్ని సమర్పించిన వ్యక్తి. జన నాట్య మండలి ఏర్పాటులో రాజకీయంగా ముఖ్యమైన భూమిక నిర్వహించిన వారిలో ఆయన ఒకరు . జన నాట్య మండలి ఏర్పడిన తరువాత దానికి రాజకీయ కమిస్సార్ గా పని చేశారు . క్రాంతి పత్రిక స్థాపించిన తరువాత దానికి ఎడిటర్ గా సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించారు. ఆ బాధ్యతలలో ఉంటూనే వివిధ ఆర్గనైజేషనల్ బాధ్యతలను నిర్వహించారు.
1983లో కరీంనగర్ లో జరిగిన చారిత్రక రైతు కూలీ సంఘ సభల నిర్వహణలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. మావో సంకలిత రచనలు 6వ భాగం నుంచి 9వ భాగం అనువదించి, తెలుగులో తేవడంలో ఆయనదే ముఖ్య పాత్ర. దండకారణ్య ఉద్యమంలో ఒక దశాబ్దం పాటు పని చేసారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు పత్రికల నిర్వహణలో, రాజకీయ కార్యకర్తలకు విద్యను అందించడంలో ముఖ్య భూమిక పోషించారు. కార్యకర్తల నుంచి నాయకత్వం దాకా అందరి అభిమానాన్ని అందుకున్నారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కి సంబంధించిన పనుల నిర్వహణలో ఉండగా అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో కొన్ని ఏళ్ళ పాటు ఉండి బెయిలు పై విడుదల అయ్యారు. విడుదల అయిన తరువాత వృద్ధాప్య సమస్యల వల్ల, ముఖ్యంగా కనుచూపు దాదాపు పోయిన స్థితిలో సిఆర్ ఫౌండేషన్ హోమ్ లో గత నాలుగేళ్లుగా ఉంటున్నారు. విప్లవోద్యమానికి అంకితమై అవివాహితుడిగానే ఉండిపోయారు. అయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు. జీవితకాలం ప్రజలకోసం అర్పించిన ప్రజా మేధావి, స్నేహశీలి, కార్యకర్త, ట్రేడ్ యూనియన్ నాయకుడు, విప్లవ నాయకుడు కామ్రేడ్ ఎల్ ఎస్ ఎన్ మూర్తికి ప్రజా సంఘాలు నివాళులు అర్రింపించారు.
గురువారం ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సి ఆర్ ఫౌండేషన్, హఫీస్ పేట హైదరాబాద్ లో ఉంచుతారు. మధ్యాన్నం ఆయన భౌతిక కాయాన్ని వైద్య కళాశాలకు అప్పజెప్ప నున్నట్లు మిత్రులు, సహచరులు తెలియజేస్తున్నారు. (From Social Media)