“ఇయ్యాల తెలంగాణ పల్లెలకు భారత దేశంలో ఉన్న ఏ పల్లె సాటిరాదు”

నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారంనాడు బిఆర్ఎస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని, జిల్లా ఎస్పీ నూతన కార్యాలయాన్ని, సమీకృత కలెక్టరేట్ నూతన కార్యాలయ సముదాయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ప్రారంభించారు.

బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు

నాగర్ కర్నూల్ జిల్లాకు చేరుకున్న సీఎం కేసీఆర్ గారికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుండి బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ గారు మొదట కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించిన అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ను సీట్లో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి గువ్వల బాలరాజు ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్

బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించేందకు సీఎం కేసీఆర్ బయలుదేరారు. పోలీస్ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ గారికి హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, డీజీపీ అంజనీకుమార్‌, ఎస్పీ మనోహర్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఎస్పీ ఛాంబర్ లోని కుర్చీలో ఎస్పీ మనోహర్ ను కూర్చోబెట్టి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మనోహర్ సీఎం కేసీఆర్ గారిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అక్కడి నుంచి నాగర్ కర్నూల్ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ బయలుదేరారు.

నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

నూతన కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ గారికి అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం నూతన కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యాక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం చాంబర్‌లోని కుర్చీలో కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌ను కూర్చోబెట్టి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉదయ కుమార్ సీఎం కేసీఆర్ గారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందించారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, మద్దిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం, చిట్టెం రామోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజీపి అంజనీకుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఇఎన్సీ గణపతిరెడ్డి, కలెక్టర్ ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పీ మనోహర్, అడీషినల్ కలెక్టర్ మాధవస్వామి, చైర్మన్లు, డా. ఆంజనేయగౌడ్, సాయిచంద్, రాజవరప్రసాద్, ఇంతియాజ్, వల్యానాయక్, కొలేటి దామోదర్ గుప్తజడ్పి చైర్ పర్సన్ శాంతికుమారి, డిసిసిబి చైర్మన్ జక్కారఘునందన్, తదితరులు పాల్గొన్నారు.

నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం ఉద్యోగులనుద్దేశించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగం – ముఖ్యాంశాలు

•గౌరవనీయ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జిల్లా అన్ని విభాగాల ముఖ్య అధికారులు, నా రాష్ట్రస్థాయి అధికారులందరికీ నమస్కారాలు.
•చాలా చక్కటి సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనం, పోలీస్ భవనాలను మంజూరు, నిర్మాణం పూర్తి చేసుకుని నా చేతులమీదుగా ప్రారంభించుకున్న నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.. అభినందనలు.
•రహదారులు & భవనాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి, చీఫ్ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఆర్ అండ్ బి సెక్రటరీ రాజు తదితరులందరి ఆధ్వర్యంలో.. మన తెలంగాణ బిడ్డ, ఆర్కిటెక్ట్ ఉషా రెడ్డి వాస్తు కౌశల్యంతో బ్రహ్మాండంగా 19వ కలెక్టరేట్ ను ప్రారంభించుకున్నాం. త్వరలోనే గద్వాల, మంచిర్యాల కలెక్టరేట్లను ప్రారంభించుకోబోతున్నాం.
•ఈరోజు తెలంగాణ అనేక రంగాలలో అగ్ర భాగాన ఉండటం చాలా సంతోషం.
•సహజ కవి, ఉద్వేగంతోని దు:ఖం కలిగినా, సంతోషం కలిగినా చాలా గొప్పగా పాటలు రాసే వ్యక్తి మన గోరటి వెంకన్న. ‘వాగు ఎండి పాయెరా..పెద్ద వాగు ఎండిపాయెరా..’ అని ఈ జిల్లాలో ఉన్నటువంటి కరువు మీద, గోస మీద.. దుందుభి నదీ ఏ విధంగా దుమ్ముకొట్టుకపోయిందో చెప్పడం జరిగింది.
•ఈరోజు నేను హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మా కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇతర మిత్రులు వస్తున్నప్పుడు, ఆ వాగు మీద కట్టినటువంటి చెక్ డ్యాంలు, వాటిలో నిలిచివున్నటువంటి నీళ్లను చూసి ఆర్ అండ్ బి మంత్రి చాలా ఆనందపరవశులైండ్రు. నేను చాలా చాలా సంతోషపడ్డాను.
•ప్రొఫెసర్ జయశంకర్, నేను ఉద్యమ సందర్భంలో తిరుగుతా వుంటే లక్ష్మారెడ్డి నియోజకవర్గంలోని నవాబ్ పేట మండల ప్రాంతంలో.. నారాయణ పేట వెళ్లి మేం వస్తా వుంటే ఆ లైట్స్ వెలుతురులో చెట్లు కూడా సన్నసన్నగా ఇంతింతే వున్నయ్. ఈ పాలమూరు కరువేమో గానీ అడవి కూడా బక్కగై పోయిందని మాట్లాడుకున్నం. అంత బాధ పడ్డం.
•ఒక సందర్భంలో సూర్యాపేట నుంచి కల్వకుర్తి సభకి హెలికాప్టర్ లో మేం వస్తే.. ఆ దారి అంతా కూడా ఒక దరిద్రం తాండవిస్తున్నట్టుగా, ఎడారి లాగా ఎండిపోయిన చెట్లు.. చాలా భయంకరమైనటువంటి కల్వకుర్తి నియోజకవర్గ పరిస్థితి కండ్లారా చూసినం.
•అటువంటి చోట ఇయ్యాల కల్వకుర్తి నియోజకవర్గంలోనే దాదాపు 75 వేలు, లక్ష ఎకరాలకు నీళ్లు వస్తా ఉన్నయ్.. పారుతా ఉన్నయ్.. ఇటువంటి ఎన్నో ఉన్నయ్.
•మంచినీటి పథకం కావొచ్చు.. కరెంటు కావొచ్చు. మన పర్ క్యాపిటా ఇన్ కమ్ కావొచ్చు.. అనేక రంగాల్లో మనం విజయం సాధించినం. అనేక అవార్డులు, రివార్డులు, చాలా చాలా ప్రశంసలు, పొగడ్తలు వస్తా ఉన్నయ్.
•నిన్నకు నిన్న ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి గురించి నాస్కామ్ వాళ్లు రిపోర్టు విడుదల చేస్తే ఎంత అద్భుతం.. భారత దేశంలో ఐటీ సెక్టార్ లో రెండు ఉద్యోగాలు దొరుకుతున్నయ్ అంటే ఒక ఉద్యోగం ఖచ్ఛితంగా తెలంగాణలోనే దొరుకుతున్నది.
•భారత దేశంలో ఒక ఇరవైదు వేలు, ముప్ఫై వేలు ఉద్యోగాలు గనుక ఐటీ సెక్టార్ లో వస్తే అందులో 15 వేలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఐటీ జాబ్స్.. ఓన్లీ హైదరాబాద్ లోనే వస్తా ఉన్నయ్.
•మనం తొమ్మిదో యేటు దాటి పదో ఏటిలోకి అడుగుపెట్టినం. ఓ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నం. అందులో ఒకటీ ఒకటింబావు సంవత్సరం కరోనా దెబ్బతీసింది. దాదాపు ఒక సంవత్సరం డీమానిటైజేషన్.. నోట్ల రద్దు కూడా బాగా కుదిపేసింది మనల్ని. కేవలం ఆరున్నర, ఏడు సంవత్సరాల కాలంలో ఎవ్వరి ఊహలకు అందకుండా అనేక కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగడానికి బాధ్యులైనటువంటి మా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా.
•ఇది ఒక వ్యక్తితోని సాధ్యమయ్యే పని కాదు. ఒక కలెక్టరో, ఒక చీఫ్ సెక్రటరియో, ఒక ముఖ్యమంత్రో అనుకుంటే కాదు. మన సెక్రటరీల స్థాయి నుంచి సీఎస్ వరకూ.. లా అండ్ ఆర్డర్ లో మన డీజీ నుంచి కింద ఉన్నటువంటి మన పోలీస్ సిబ్బంది.. అన్ని రంగాలు సింక్రనైజ్డ్ చేస్తేనే, అన్ని కలిస్తేనే అన్ని సమకూరితేనే ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఇందులో భాగస్వాములైనటువంటి మా తెలంగాణ ఉద్యోగులకు నేను శాల్యూట్ చేస్తా ఉన్నా.
•మీ అందరినీ కోరేది వలసలకూ, కరువులకూ, వలవల వలిపించే దు:ఖాలకు, బొంబాయి బస్సులకు అలవాలంగా ఉన్న పాలమూరులో.. బ్రహ్మాండమంటే బ్రహ్మాండం అసలు.. చాలా అద్భుతాలు జరుగుతావున్నయ్.
•ఓ సందర్భంలో నేను గద్వాలకి, కృష్ణ మోహన్ రెడ్డి గారింటికి ఫంక్షన్ కి హెలికాప్టర్ లో వెళదామంటే లేదని చెప్పి, మహబూబ్ నగర్ మార్పును చూద్ధామని జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి 200 కి.మీ. బస్సులో ప్రయాణం చేసి చర్చించుకుంటూ పోయినం. కనుల పండుగగా బ్రహ్మాండమైన పంటలూ, హార్వెస్టర్లూ, వరికోతలూ, కళ్లాలూ.. చాలా అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. దానికి మేజర్ కారకులు మీరే. ప్రభుత్వం ఏ పిలుపునిచ్చినా ఒక యజ్ఞంలా.. ఒక ధర్మ కార్యంలాగా మీరందరూ కూడా మీమీ స్థాయిలో పనిచేసినారు.
•ఇయ్యాల తెలంగాణ పల్లెలకు భారత దేశంలో ఉన్న ఏ పల్లె సాటిరాదు. అందుకు పంచాయతీరాజ్ ఉద్యోగులకు, మన సర్పంచ్ లకు, అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా.
•మిషన్ కాకతీయ అంటే ఇరిగేషన్ అధికారులు రాత్రి పగలూ అద్భుతమైనటువంటి పని..చాలా బ్రహ్మాండంగా చేసినారు. ఒకటే ఒకటి మనకు పెద్ద టాస్క్ ఉన్నది. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలె. హండ్రెడ్ పర్సెంట్ దానిని త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాం. ధర్మం ఎప్పుడైనా జయిస్తది.. ఆ రకంగా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించుకున్నం.
•నేను మీ అందరిని కూడా కోరేది ఒక్కటే..ఇంత తక్కువ సమయంలో ఏడు ఏడున్నర సంవత్సరాలలో దేశంలో మెనీ మెనీ మెనీ యాస్పెక్ట్స్ ఒకట్రెండు కాదు. అనేక యాస్పెక్ట్స్ లో దేశం కాదు, దేశంను తలదన్ని.. మనకంటే ముందు డెబ్బై సంవత్సరాలుగా రాష్ట్రంగా పొందికగా ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర కావొచ్చు.. ఎన్నో మనకంటే పెద్ద పెద్ద రాష్ట్రాలు మనకంటే ఈరోజు పర్ క్యాపిటా ఇన్ కమ్ లో తక్కువగా ఉన్నవి. పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్ లో తక్కువగా ఉన్నవి.
•ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో చూసేటటువంటివి ప్రధానమైనవి మూడు నాలుగుంటయ్.. అందులో పర్ క్యాపిటా ఇన్ కమ్ ఎంత అని చూస్తరు.
•వాకిలి సూస్తనే ఇల్లు సంగతి తెలుస్తదన్న సామెత మనకు తెలుసు.. పర్ క్యాపిటా ఇన్ కమ్ ఏది?.. డంభాచారం కొడితే రాదు. గ్యాస్ ప్రచారం కొడితే ఎవడూ నమ్మడు. ఆ రోజులు పోయినయ్ ఎన్నడో..
•కాబట్టి పర్ క్యాపిటా ఎంత?..పర్ క్యాపిటా పవర్ యుటిలైజేషన్ ఎంత?.. మీ లిటరసీ రేట్ ఎంత?.. మీ ఐఎంఆర్ అంటే ఇన్ ఫాంట్ మోర్టాలిటీ రేట్ (శిశు మరణాల రేటు) ఎన్ని? మీ ఎంఎంఆర్ అంటే (మదర్ మోర్టీలిటీ రేట్) ప్రసవ సమయాలలో మరణించే తల్లుల సంఖ్య ఎంత?, వీటన్నింటిలో కూడా మనం చాలా రికార్డు హైట్స్ ను సాధించినం.
•ఒక రంగం పనిచేసింది..ఒక రంగం పనిచేయలేదని కాదు. అన్ని రంగాల కృషి యొక్క సమాహారంగా, అందరి అధికారుల చెమట బిందువుల పరంగా మనం ఈరోజు చాలాచాలా అద్భుతాలు చేసినం.
•ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం ఆలోచించి.. పేదలను ఆదుకోవాలని ‘కంటి వెలుగు’ అనే పథకం పెట్టి ఊరూరికి పంపించి.. మీ కండ్లెట్లున్నయ్ తాతా?.. నీ కండ్లెంట్ల ఉన్నయ్ తల్లీ?.. అని అడిగిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడన్నా ఉందా?. దట్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఐ స్క్రీనింగ్ టెస్ట్.
•ఆ రోజు పథకం ప్రారంభించే రోజు మన ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి హెల్త్ సెక్రటరీ గా ఉండి అహోరాత్రులు కష్టపడి అద్భుతంగా విజయవంతం చేశారు.
•ప్రపంచం ఆరోగ్య రంగంలో నేత్ర వైద్య విభాగ నిపుణులెవరైతే ఉన్నరో..వాళ్లంతా ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపడుతున్నరు. ఎల్వీ ప్రసాద్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ కూడా ఒక కార్యక్రమంలో నాకు తారసపడి.. ప్రపంచవ్యాప్తంగా నేను దాదాపు డెబ్భై వరకూ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు అటెండ్ అయినా గానీ.. ఎక్కడకూడా మాకు ఫైనల్ సొల్యూషన్, కంప్లీట్ సొల్యూషన్ రాలేదు. బట్, దిస్ మ్యాన్.. దిస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ హాజ్ షోన్ ద వే.. అని చెప్పినారు.
•నేను హైదరాబా లో కూర్చుండి కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన. క్షణక్షణం కూడా దాన్ని కంటికి రెప్పలా తీసుకపోయి దాన్ని విజయవంతం చేసినవాళ్లు మీరు.. ఈ కీర్తి ఆ కీర్తి మా ఉద్యోగులకే దక్కుతది. అందులో ఎటువంటి సందేహం లేదు.
•ఒక పెద్ద ఛాలెంజ్ అయినటువంటి ‘మిషన్ భగీరథ’.. లాంటి అన్ని విషయాలలో చాలా గొప్ప అద్భుతాలు మనం సృష్టించగలిగాం.
•మన వ్యాఖ్యాత దక్షిణమూర్తి చెప్పినట్లుగా ‘మైల్స్ అండ్ మైల్స్ టు గో..స్మైల్స్ అండ్ స్మైల్స్ టు ఫ్లో..’ చిరునవ్వులు చిందించే అటువంటి ఒక ఆహ్లాదకరమైన, సంతోషకరమైనటువంటి తెలంగాణకై ఇంకా కొన్ని ఉన్నత శిఖరాలకు మనం తీసుకపోవాల్సి ఉన్నది.
•మన కృషి పట్టుదలలో ఎటువంటి సడలింపులకు పోవద్దు. ఇదేవిధంగా ఇంకా ముందుకు పోదాం. ఇంకా మనం ఆస్తి పెంచుదాం.. ప్రజలకు పంచుదాం.. మనం కూడా పంచుకుందాం..బ్రహ్మాండంగా మన జీతాలు కూడా పెంచుకుంటూ అద్భుతంగా ముందుకు పోదాం.
•మీరంతా ఎల్లవేళలా..ఈ తొమ్మిదేండ్లలో చూపినటువంటి స్పిరిట్ నే ముందు కూడా చూపెట్టాలని కోరుకుంటూ, ఇంత చక్కటి పోలీస్ కాంప్లెక్స్, కలెక్టరేట్ లను నిర్మించుకున్నందుకు జిల్లా ప్రజలు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జై తెలంగాణ!

నాగర్ కర్నూల్ జిల్లా భారీ బహిరంగ సభలో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగం:

•తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం దాని ఫలితంగా నాగర్ కర్నూల్ జిల్లా ఏర్పడడం, పరిపాలన కోసం చక్కటి కలెక్టరేట్, చక్కటి పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను నా చేతుల మీదుగా ప్రారంభింపచేసుకున్నటువంటి నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను
•తెలంగాణ ఏర్పడకపోయుంటే నాగర్ కర్నూల్ జిల్లా అయ్యేది కాదు. నాగర్ కర్నూల్ జిల్లా ఏర్పడకపోయుంటే కొత్త కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ ఏర్పడేవి కావు.
•ఎస్పీ ఆఫీస్ దగ్గర లైట్ల అలంకరణలో ప్రజలు వెళ్ళి సెల్ఫీలు దిగుతున్నారని హైదరాబాద్ కు వార్తలు వస్తున్నాయి. అంత అద్భుతంగా ఈ భవనాలు రూపుదిద్దుకున్నాయి.
•తెలంగాణ ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది. తెలంగాణ సాధనకు ఒక చరిత్ర ఉంది.
•ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా వెనుకబాటుతనం ఉంది. చాలా ఇబ్బందులున్నాయి. మంచినీళ్ళకు, సాగునీళ్ళకు ప్రజలు అరిగోస పడుతున్నారు. ఇది పూర్తిగా, క్షుణ్ణంగా నాకు అర్థం కావాలనుకుంటే, నేను పాలమూరు ఎంపిగా ఉంటే ఎట్లుంటదని చెప్పి ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారిని అడిగాను. అప్పుడు ఆయన ఒక్కటే మాట చెప్పారు. తెలంగాణలో మీరు ఎక్కడ నిలబడ్డా మిమ్మల్ని ప్రజలు గెలిపించుకుంటరు. మీరు పోటీ చేయండి. మీరు అక్కడ పోటీ చేస్తేనే కష్టనష్టాలు తెలుస్తయి అని చెప్పారు.
•ఆ సందర్భంలో నేను ఎంపిగా పోటీ చేశాను. ఆ రోజుల్లో పాలమూరు జిల్లాలో ఉద్యమం అంత ఉధృతంగా లేకుండేది. కానీ మీరు అద్భుతమైన ప్రేమతో నన్ను ఆదరించి పార్లమెంటు మెంబరుగా ఇదే జిల్లా నుండి గెలిపించారు.
•తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాలమూరు జిల్లా పేరు శాశ్వతంగా ఉంటుంది. నేను పాలమూరు జిల్లా ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అది పాలమూరు జిల్లా కీర్తి కిరీటంలో శాశ్వతంగా నిలిచి ఉంటుందని సవినయంగా నేను మీకు తెలియజేస్తున్నాను.
•సాధించుకున్నటువంటి రాష్ట్రంలో 9 సంవత్సరాలు గడిచిపోయి పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అందులో ఒకటిన్నర సంవత్సర కాలం కరోనాతో గడిచిపోయింది. ఇంకో సంవత్సరం నోట్ల రద్దుతో సతమతమైపోయాం. మిగిలిన ఆరు, ఆరున్నర సంవత్సరాల కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టి, నేడు భారతదేశంలోనే అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్నాం.
•తలసరి ఆదాయంలో ఇండియాలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నెంబన్ వన్, కరెంటు వస్తదో రాదో అన్న దుర్దశ నుండి తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్, సంక్షేమరంగంలో కనీవినీ ఎరుగని విధంగా సంవత్సరానికి 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ దేశంలో మనం నెంబర్ వన్ గా ఉన్నాం.
•ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మ/షాదీ ముబారక్ వంటి ఎన్నో పథకాలు నేడు మీ అనుభవంలో ఉన్నాయి.
•అణగారిపోయిన మన దళితజాతి ప్రజానీకాన్ని ఉద్దరించాలనే లక్ష్యంతో, సదుద్దేశంతో దేశంలో, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చి ఆదుకునే విధంగా దళితబంధు అనే పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్రమే అని మనవి చేస్తున్నాను.
•ఒకనాడు బొంబాయి బస్సులకు ఆలవాలం పాలమూరు జిల్లా. పాలమూరు జిల్లాలో కరువు అని చెప్పి పార్టీలు పోటీలు పడి గంజి కేంద్రాలు పెట్టేవి. ఈ వార్తలు పేపర్లలో చదివితే కంటి వెంట రక్తం కారేది. ఈ గంజి కేంద్రాలు ఏంది, ఈ దురవస్థ ఏంది, దేవుడా ఈ బాధ ఎప్పుడు తప్పుతదని ఏడ్చేవాళ్ళం.
•గంజి కేంద్రాల పాలమూరు జిల్లాలలో నేడు మారిన పరిస్థితి ఏంది ? గంజి కేంద్రాలు మాయమైపోయినయ్. ఏ ఊరికావూరిలో పంట కొనుగోలు కేంద్రాలే వచ్చినయి. ఇదంత కూడా మీ అందరికి తెలుసు. ఏం చేసిన్లు, ఏం సాధించిన్లు అంటే బిఆర్ఎస్ పార్టీ సాధించింది ఇది. కేసీఆర్ రాకముందు ఇక్కడి నుండి కేసీఆర్ కంటే దొడ్డుగా, పొడుగ్గా ఉన్న ఎందరో మంత్రులుగా పనిచేశారు. ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. ఏ ఒక్కరు కూడా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఇంతకుముందు రెండు పార్టీలు పాలించినయ్. కాంగ్రెస్ పార్టీ యాభై అరవై ఏండ్లు పరిపాలించింది. అదే విధంగా తెలుగుదేశం, బిజెపి కంబైన్డ్ గవర్నమెంటు ఎన్నో పాలించారు. కానీ కనీసం మంచినీళ్ళు కూడా అందించలేకపోయారు. మంచినీళ్ళ కోసం బిందెలు పట్టుకొని మన ఆడబిడ్డలు అవస్థలు పడేవారు. ఈ రోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటిలో కృష్ణమ్మ నీళ్ళు దుంకుతా ఉంటే ప్రజలంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు.
•మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో, వనపర్తి, నారాయణ పేట, గద్వాలలో మెడికల్ కాలేజీలను వరుసగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎప్పుడు అనుకున్నామా ఇదంతా సాధ్యమైతదని ?
•మీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి నాగర్ కర్నూల్ లో మెడికల్ కాలేజీ పెట్టాలని ఒత్తిడి తెచ్చి సాధించుకున్నాడు. మీ కండ్ల ముందు అన్నీ జరుగుతున్నాయి.
•ఐదు మెడికల్ కాలేజీలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వస్తాయని అనుకున్నామా ?
•ఇప్పుడు వాడొకడు వీడుకొడు సభలు పెట్టి అడ్డం పొడుగు మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కడు కూడా తెలంగాణ రాకముందు ఒక్క మెడికల్ కాలేజీ ఎందుకు తేలేదండి ? దేశాన్ని పాలించినోళ్ళు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినోళ్ళు, దత్తత తీసుకున్నవాళ్ళు మనల్ని మత్తు గొలిపిన్లు తప్ప అవసరమున్నంత కరెంటు ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. మళ్ళా ఇయ్యాల వచ్చి ఏం మాట్లాడుతున్నరో ముందు ముందు చెప్తా.
•అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం.
•పాలమూరు అనగానే బిల్ క్లింట్ ను తీసుకొచ్చి కల్వకుర్తి తండాను చూపించుడు. విదేశీయులను, ప్రపంచ బ్యాంక్ వాళ్ళను తీసుకొచ్చి చూపించుడు. భయంకరమైన పరిస్థితి ఉండేది.
•నాటి కాకతీయ రాజులు 75 వేల చెరువులు, కుంటలు మన జీవనం కోసం తవ్వించారు. వాటిని నాటి సమైక్య రాష్ట్రంలో మాయం చేశారు.
•మిషన్ కాకతీయ పథకం ద్వారా ఈ జిల్లాలో సప్త సముద్రాలు కానీ, ఇంకా చాలా చెరువులు నాశనం చేశారు. మిషన్ కాకతీయ రాకముందు నాగర్ కర్నూల్ పాలెం, బిజ్నెపల్లి వడ్డెమాన్ చెరువు మురికి తుమ్మలతో, లొట్టపీసు చెట్లతో ఉండేవి. మిషన్ కాకతీయ ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసనసభ్యులు బ్రహ్మాండంగా ఒక యుద్ధంలాగా చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నారు. గతంలో కేసరి సముద్రం ఇంకిపోయి చెట్లతోని గందరగోళంగా ఉంటే బిఆర్ఎస్ పాలనలో చాలా సుందరంగా కేసిర సముద్రం తయారైంది. అక్కడ గౌతమబుద్దుడు కూడా వెలిసిండు. నేడు కేసరి సముద్రం ఒక పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్నదంటే అది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత అని నేను మనవి చేస్తున్నాను.
•దుందుభి వాగు మీద నాడు మన గోరటి వెంకన్న పాట రాసిండు. వాగు ఎండిపాయెరా.. పెద్ద వాగు ఎండిపాయెరా.. పేగు ఎండిపాయెరా అని బాధపడ్డడు.
•వెంకన్న ఇప్పుడు ఎట్లున్నదంటే వాగు నిండిపాయెరా అని కడుపు నిండా నిండున్నదని సార్ చెప్తున్నాడు.
•చెక్ డ్యాములు కట్టుకున్నాం. దుందుభి వాగు మీదనే దాదాపు పది పన్నెండు చెక్ డ్యాములు కడితే అన్ని చెక్ డ్యాములలో కూడా వర్షాలు పడకముందే నీళ్ళతో నిండి ఉండడాన్ని చూసి నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినయ్.
•ఈ విధంగా ఉన్నంతలో, తోచినంతలో ప్రజల బాగు కోసం తండ్లాడినం, పోరాడినం, చాలా బాగా చేసుకున్నాం.
•కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండేవి. తెలంగాణ రాకపోతే అవి ఇవ్వాల్టికి కూడా ముందు పడకపోతుండేది. స్థానిక నాయకులు, ప్రభుత్వ చొరవతో వాటిలో కదలిక వచ్చి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకునే దిశగా పయనాన్ని సాగిస్తున్నాం.
•అచ్చంపేట ప్రాంతానికి కూడా 2 వేల కోట్ల రూపాయలతో ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకుంటున్నాం. అచ్చంపేట ఎత్తిపోతల పథకాలతోని ఎగువ ప్రాంతాలకు కూడా నీటిని అందించే దిశగా ఏర్పాట్లు చేసుకున్నాం.
•చెక్ డ్యాములు కట్టుకొని, మిషన్ కాకతీయ చెరువులు బాగుచేసుకొని, ప్రాజెక్టు నీళ్లతోని నింపుకొని బోరు బావులన్నీ ఎండిపోకుండా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. లక్షలాది ఎకరాల పంటలు పండుతున్నాయి. ఇదే జిల్లాకు చెందిన కళాకారుడు, తమ్ముడు సాయిచంద్ ను ఇప్పుడు మార్పు ఎట్లుందని అడిగితే చెరువులల్ల బ్రహ్మాండంగా నీళ్ళున్నాయి, అద్భుతంగా ఉన్నాయన్నాడు.
•దళితబంధు గురించి పాటలు రాస్తున్న సందర్భంలో నేనే స్వయంగా ఒక పాట రాసిన …

“వలసలతో వలవల విలపించు కరువు జిల్లా..
పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి…
చెరువులన్ని నింపి పన్నీటి జలకమాడి
పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది”

అని చెప్పి నేనే నా కలంతో రాసిన.

•గద్వాల కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు హెలికాప్టర్ లో పోకుండా, పాలమూరును కళ్ళారా చూసేందుకు మంత్రులను, ఎమ్మెల్యేలను పిలిపించుకొని బస్సులో కూర్చోబెట్టుకొని వారితో ముచ్చటిస్తూ వడ్ల రాశులు, కళ్ళాలు, వరికోత యంత్రాలను చూసి గుండెలు పొంగిపోయి సంతోషపడ్డాను. ఈ మార్పు కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైందనే విషయం మీ అందరికి కూడా తెలుసు.
•వలస పోయినోళ్ళందరూ కూడా తిరిగి ఉమ్మడి మహబూబ్ నగర్ కు వచ్చారు. నేడు ఇదే జిల్లాకు ఒడిసా, జార్ఘండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ నుండి నాట్లు వేయడానికి అక్కడి ప్రజలు వలస వస్తున్నారు. ఇది నిజంగా మనందరికీ గర్వకారణం.
•నాడు ఎకరం పదివేలు, పదిహేను వేలకు అమ్ముకున్న పాలమూరు భూములు నేడు లక్షలు, కోట్లు పలుకుతున్నాయి. భూముల ధరలు బాగా పెరిగినయ్.
•నేడు పాలమూరు గ్రామాలలో లక్షలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగలు చేసుకునే వార్తలు చూసి గుండెల నిండా సంతోష పడుతున్నాం. ఇటువంటి పాలమూరే కోరుకున్నాం.
•ఆనాడు ఉద్యమంలో నాలుగైదు చోట్ల నేను ఏడ్చాను. కండ్లకు నీళ్ళు తీసుకున్నాను. నడిగడ్డ ఊరిలో రెడ్డిగారు భోజనం పెడితే జిల్లా దుస్థితిని చూసి ప్రజలంతా వలవలవల ఏడ్చారు. అట్ల నేను కన్నీళ్ళు విడిచిన పాలమూరులో ఇంత అభివృద్ధి జరగడం గొప్ప సంతృప్తినిస్తున్నది.
•ఇదివరకు తెలంగాణను ఆగం చేసినోళ్ళే కొత్త ముసుగులు వేసుకొని, కొత్త వేషాలు వేసుకొని బయలుదేరారు.
•ఒక ప్రబుద్ధుడు ఇదే జిల్లాలో జడ్చర్లలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ ను తొలగించి బంగాళాఖాతంలో వేస్తాం అంటున్నాడు. ఇంతకుముందు రికార్డు అసిస్టెంట్లు, వీఆర్వోలు, గిర్దావర్లు, ఎమ్మార్వోల చేతిలో మన బతుకు ఉండేది. వారు రాసిందే రాత, గీసిందే గీత. మన రికార్డు ఉన్నదో లేదో, మన భూమి మనకే ఉన్నదో లేదో తెల్వదు. పహాణీ నకల్ కావాలన్నా పైసలు కట్టాల్సిందే.
•కానీ ఇవ్వాల ఏం జరిగింది ?
•నేను మీకు కొన్ని విషయాలు విన్నవించుకోవాలనుకుంటున్నాను.
•తెలంగాణ రాకముందుకు తెలంగాణలో 459 మండలాలుంటే ఇవ్వాల 612 మండలాలకు పెంచుకున్నాం.
•మహబూబ్ నగర్ లో గతంలో 64 మండలాలుంటే నేడు 76 మండలాలకు పెంచుకున్నాం.
•నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 15 రిజిస్ట్రేషన్ ఆఫీసులుంటే నేడు అదే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 88 రిజిస్ట్రేషన్ ఆఫీసులున్నాయి.
•నేడు ధరణితో అవినీతి తొలిగిపోయి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరంగా, పారదర్శకంగా జరుగుతున్నది. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మరో పది నిమిషాల్లో పట్టా తయారై పాసుబుక్కు చేతికిస్తారు. అంతకుముందు ఎన్ని దఫ్తర్ లు తిరగేది, ఎంత మందికి సలామ్ కొట్టాల్సి ఉండేది. ఎంతమంది లీడర్ల పైరవి చేయమనేది. ఆ గతిపోయి నేడు నిశ్చింతగా రైతు గుండె మీద చేయి వేసుకొని ఉన్నాడు.
•నేడు భూముల అమ్మకాలు, కొనుగోళ్ళలో యాజమాన్యాన్ని మార్చే అధికారం రైతుకే ఇచ్చినం. ఆయన బొటనవేలుతో నొక్కితే తప్ప రికార్డు మార్చే శక్తి ముఖ్యమంత్రికి కూడా లేదు.
•ధరణి బంగాళాఖాతంలో విసిరేస్తే రైతుబంధు ఈ పద్ధతిలో వస్తుందా ? ధరణిని బంగాళాఖాతంలో వేసుడు కాదు రైతును బంగాళాఖాతంలో వేసుడు అయితది. పైరవికార్లు, లంచగొండులు ఎవరైతే రైతుల రక్తం తాగిన్రో వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు.
•కాంగ్రెస్ రాజ్యంలో రైతు చచ్చిపోతే ఆపద్బంధు అని ఉండేది. 50 వేల రూపాయలు ఇస్తామని చెప్పేది. నడిమధ్యల ఎందరో తిన్నంక, చెప్పులు అరిగితే పదో ఇరవయ్యో చేతుల పెట్టి ఇంటికి పంపించేది. ఇది మీరందరు యాదికి చేసుకొనండి.
•నేడు రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమైతయ్. ధరణి ఉంది కాబట్టే ఇది సాధ్యమైతున్నది
•ధరణి ఉండబట్టే కంప్యూటర్లో ఉన్న రికార్డులను బట్టి మీ వడ్లు కొన్నంక వారం రోజుల్లో పైసలు అకౌంట్లలో పడుతున్నాయి. ధరణి ఆగమైతే వస్తాయా ?
•ధరణి ఉండాలా .. తీసెయ్యాలా .. మీరే చెప్పండి ?
(ధరణి ఉండాలని ప్రజల నుంచి సమాధానం)
•ఈ దుర్మార్గులు, ప్రబుద్ధులు ఒక్కనాడైనా ప్రజల గురించి ఆలోచించలేదు.
•ధరణితోని 99 శాతం సమస్యలు పరిష్కారమైనవి. ఒకటో రెండో ఉంటే అవి కూడా పరిష్కారమైతయి.
•రైతు వేలి ముద్ర తప్ప ఇతర ఏ శక్తి రైతు యాజమాన్య హక్కును మార్చలేదు.
•మీరు ఈ మాటలు ఇక్కడే విని ఇక్కడే మర్చిపోవద్దు. మీతోటి వాళ్ళతో చర్చించండి. వాస్తవాలు తేలాలి. ఆగమాగం కావద్దు. ఆగమాగమైతే తెలంగాణే వచ్చేది కాదు.
•ధరణి తీసేస్తే దోపిడే మళ్ళా ప్రారంభమైతుంది.
•కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం, పైరవీకారుదలదే భోజ్యం. లంచాల పీడ లేకుండా చేసిన ధరణిని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. బాధకు గురికావద్దు.
•కాంగ్రెస్ ప్రభుత్వానికి, నేటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా.
•నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 20 సంవత్సరాలు ఒకటే జూనియర్ కాలేజీ ఉండేది.
•తెలంగాణ వచ్చినంక 1001 పాఠశాలలు, జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చినయ్.
•దుర్మార్గులు మన కండ్లు మన వేలితోనే పొడిపించే ప్రయత్నం చేస్తారు.
•కాబట్టీ నా రాత అద్భుతంగా ఉందని ఇవ్వాల రైతు నిశ్చింతగా ఉన్నాడు
•అద్భుతంగా ఉన్న ఈ సదుపాయాన్ని తొలగించి పైరవికారులు అప్పజెప్తామని పనిలో వీరంతా ఉన్నారు.
•నేను మహారాష్ట్రకు పోతే తెలంగాణ మోడల్ కావాలి. ధరణి కావాలి అని కోరుతున్నారు.
•యావత్ తెలంగాణ రైతాంగానికి నేను విన్నపం చేస్తున్నాను. మీరు ఆలోచించండి ఏది మంచిదో, ఏది చెడ్డదో.
•ఇవ్వాల ధరణి లేకపోతే పెరిగిన భూముల ధరలతో ఎన్ని పంచాయతీలు అయితుండేవి.
•వడ్లు అమ్మంగానే పైసలు వచ్చి బ్యాంకులు పడుతున్నాయి. రైతుబంధు పైసలు పడుతున్నాయి. రైతు తన అవసరాలు తీర్చుకుంటున్నాడు.
•ధరణి లేకపోతే రైతులు పంచాయతీలు పెట్టుకుంట కోట్ల చుట్టూ తిరగాలి
•రైతులను కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, వకీళ్ళ చుట్టూ తిరిగే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇది నిజమా కాదా మీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి
•రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, ధరణి వంటి కార్యక్రమాలు రైతును కంటికి రెప్పలా కాపాడుకునేందుకే తెచ్చినం.
•మోసపోతే గోసపడతాం. రైతులు కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి.
•ఆంధ్రోళ్ళు తెలంగాణ వస్తే మీ రాష్ట్రంలో కారుచీకట్లు కమ్ముకుంటాయని అన్నారు. కానీ నేడు మన రాష్ట్రం వెలుగు జిలుగులతో అలరారుతున్నది.
•గిరిజనులకు పోడు భూములు పంచుతున్నాం.
•సొంత జాగా ఉన్నవారికి గృహలక్ష్మి పథకం ద్వారా నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు మంజూరు చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు నియోజకవర్గానికి 4 వేల ఇండ్లు మంజూరు చేస్తున్నాను.
•పూసల కులస్తులు, జంగం, బుడగజంగాళవాళ్ళు, కంసాలులు, కమ్మర్లు మొదలైన అణగారిని బిసి కులాల వృత్తిపనివారికి కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున ఇచ్చే పథకాన్ని ఈ నెల 9 వ తేదీ నుండి ప్రారంభిస్తున్నాం. దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.
•ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చాంతాడంతా సంఖ్యలో పథకాలను అమలుచేస్తున్నది.
•కంటి వెలుగు ద్వారా ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు ఉచితంగా అందిస్తున్నది.
•ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు… ఇలా బాధల్లో ఉన్నవారి బాగుకోసం బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది.
•ఇది మీ ప్రభుత్వం.రైతుల ప్రభుత్వం. బీదల ప్రభుత్వం. దళితుల ప్రభుత్వం. గిరిజనుల ప్రభుత్వం.
•ఇంతకుముందు ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసం ఇంతలా ఆలోచించిందా..
•నా జీవితంలో తెలంగాణ సాధించిన తర్వాత అత్యంత సంతృప్తినిచ్చిన విషయం… పాలమూరు జిల్లా కన్నీటిని తుడిచి… బ్రహ్మాండమైన పంటల భూమిగా తీర్చిదిద్దిన. ఈ సంతోషం నా గుండెల నిండా ఉన్నది.
•నేను ఏం తలపెట్టినా భగంతుడు నన్ను గెలిపించిండు.
•పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెణ, ఉద్దండాపూర్ లలో 75 -80 టిఎంసిల కెపాసిటీతో నీళ్ళు నింపుకుంటున్నాం. ఇవన్నీ నీళ్ళతో నిండితే నా పాలమూరు జిల్లా బంగారు తునక అవుతుంది. వచ్చే ఆగష్టులో ఇవన్నీ నీళ్ళతో నిండబోతున్నాయ్. మీరే కళ్ళారా చూస్తారు.
•ఇవాళ తెలంగాణ మోడల్ మాకు కావాలని దేశమంతా కోరుతున్నది
•తెలంగాణ ప్రజలే నా బలగం…నా బంధువులు.
•మీ మద్దతుతోనే నిర్ణయాలు తీసుకొని దేశానికి నాయకత్వం వహించే దిశగా ముందుకు పోతున్నా.
•మళ్ళొక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా… ధరణి పోర్టల్ ఉండాలా .. .తీసేయాలా ?
(ధరణి పోర్టల్ ఉండాలని నినదించిన ప్రజలు)
•ధరణిలో ఏమైనా సమస్యలుంటే మీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అధికారులకు చెప్పండి. నిమిషాల్లో అవి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటారు. దాని గురించి ఇబ్బంది లేదు.
•ఇంతటి ఎండలోనూ నన్ను దీవించేందుకు అశేషంగా తరలివచ్చిన ప్రజలకు నా వందనాలు
•జై తెలంగాణ – జై భారత్
•ధన్యావాదాలు.

సీఎం కేసీఆర్ సభలో హైలెట్స్

• సిఎం కేసిఆర్ ప్రసంగం మొదలు పెట్టగానే సభాప్రాంగణంలో ప్రజల హర్షధ్వానాలు, చప్పట్లతో సభ దద్దరిల్లింది. ధరణి రద్దు చేస్తామని కాంగ్రేస్ పార్టీ చేస్తున్న ప్రకటనను సిఎం ఉటంకిస్తూ ధరణి వుండలా వద్దా అని నేరుగా సభలోని ప్రజలను అడుగగా… వారు ధరణి వుండాలి వుండాలి అని గట్టిగా సమాధానం ఇస్తూ.. చప్పట్లు చరిచి, కేకలు వేసి వారి స్పందనను కేసిఆర్ గారికి తెలిపారు.

• సహజ కవి గోరేటి వెంకన్నరాసిన పాట వాగు ఎండిపాయెరా పెద్ద వాగు ఎండిపాయేరా అని నీరు లేక ఎండిపోయిన దుందుబి వాగుమీద రాసిన పాటను గుర్తు చేసుకుంటూ.. తాను హెలికాప్టర్ లో వస్తున్నప్పుడు దుందిబి వాగును పైనుండి చూసినప్పుడు, నేడు నిండు జలాలతో కళకళాడుతున్నదని ఆ దృష్యాన్ని చూసి నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయని అన్నప్పుడు సభలోని ప్రజలు గట్టిగా చప్పట్లు కొట్టారు.

• పాలమూరు ఒకనాడు గంజికేంద్రాలకు నిలయమైన పాలమూరులో ధాన్యం కొనుగోలు కేంద్ర్రాలు ఏర్పాటు చేయటం వెనుక ప్రభుత్వం చేసిన కృషిని వివరిస్తూ… వ్యవసాయం, సాగునీరు తదితర రంగాల్లో పాలమూరు మీద ప్రత్యేక శ్రద్దతో పెండింగు ప్రాజేక్టులను పూర్తి చేసుకుంటూ చేసిన కృషిని సిఎం క్షుణ్ణంగా వివరించారు.

• తాను ఒక కవిగా పాట పాలమూరు పచ్చదనాన్ని వివరిస్తూ పాలమూరు పచ్చని పైరు కప్పుకున్నదని పాట రాసానని… ఆ పాట నేడు గుర్తుకు వచ్చిందని సిఎం కేసిఆర్ అన్నారు.
• సిఎం ప్రసంగం దాదాపు 45 నిమిషాల సేపు కొనసాగింది. సిఎం ప్రసంగమంతా కాంగ్రేస్ పార్టీని విమర్షిస్తూ.. మోసపోతే గోస పడుతాం…. మంది మాటలు వింటె చెడిపోతాం… అంటూ కొన్ని సామెతలతో కాంగ్రేస్ ను నమ్మితే.. నష్టం కలుగుతుందని వివరిస్తూ.. చేసిన ప్రసంగం ప్రజలను ఆలోచింప జేసింది.

• రైతుబంధు వచ్చినప్పటినుండి ధరణి వల్ల తీరిన భూ సమస్యలను సిఎం వివరిస్తూ చేసిన ప్రసంగాన్ని విన్న ప్రజలు సానుకూలంగా స్పందించారు.

• ఉద్యోగులను ఉద్దేశించి సిఎం ప్రసంగించారు. తెలంగాణ పేరుకు తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నా.. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవడం వెనుక వున్నది ఉద్యోగుల పాత్రేనని కొనియాడారు.

• మైల్స్ టు గో అంటూ ఇప్పటికి సాగిన ప్రయాణాన్ని నెమరువేసుకుంటూ,, గుర్తు చేసుకుంటూ… ఇంకా కొనసాగాల్సిన ప్రగతి ప్రస్థానం.. తద్వారా ప్రజలలో సాధించాల్సిన అభివృద్దిని గురించి మైల్స్ టూ గో మైల్స్ టు గో అంటూ సిఎం కేసిఆర్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X