ముస్లిం సోదరులందరికీ CM రేవంత్ రెడ్డి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు, ట్రాఫిక్ ఆంక్షలు మరియు…

హైదరాబాద్ : ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లింలు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.

ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని అన్నారు.

ఇందులో భాగంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే పాత బస్తీలో మెట్రో రైలు లైన్ కు శంకుస్థాపన చేయటంతో పాటు మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులను పెంచిందని గుర్తు చేశారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల సొంత భవనాల నిర్మాణానికి స్థలాలను సమకూర్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా అశీర్వాదాలుండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రార్ధించారు.

రంజాన్ పండుగ శుభాకాంక్షలు.. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం ముస్లిం సోదరులు జరుపుకుంటున్న రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకల సందర్భంగా రంజాన్ పండుగ ఘనంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

రంజాన్ పండుగ సంద‌ర్బంగా రేపు (ఏప్రిల్ 11) హైదరాబాద్ న‌గ‌రంలో పోలీసు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లింపు పెద్ద ఎత్తున ప్రత్యేక పార్థనల్లో పాల్గొనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిటీ పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్‌ ఈద్గా, హాకీ గ్రౌండ్‌, మాసబ్‌ట్యాంక్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. ఆ సమయంలో అటుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.

ట్రాఫిక్ ఆంక్షలు

  • మీరాలం ఈద్గా ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను పురానాపూల్‌, కామాటిపుర, కిషన్‌బాగ్‌, బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్స్‌ నుంచి అనుమతిస్తారు. నిర్దేశిత సమయంలో సాధారణ వాహనదారులను బహదూర్‌పురా ఎక్స్‌రోడ్స్‌ నుంచి ఈద్గా వైపు అనుమతి ఉండదు. ఈ వాహనాలను బహదూర్‌పురా క్రాస్‌ రోడ్డు వద్ద కిషన్‌బాగ్‌, కామాటిపుర వైపు డైవర్ట్ చేస్తారు.
  • శివరాంపల్లి, దానమ్మ హాట్స్‌ నుంచి ఈద్గా వైపు వచ్చే వాహనాలను దానమ్మ హాట్స్‌ చౌరస్తా నుంచి అనుమతిస్తారు. ఈ సమయంలో సాధారణ వాహనదారులకు ఈద్గా వైపు అనుమతించరు. ఈ వాహనాలను దానమ్మ ఎక్స్‌రోడ్స్‌ నుంచి శాస్త్రీపురం, ఎన్‌ఎస్‌ కుంట వైపు డైవర్ట్ చేస్తారు. ఇటుగా వచ్చే వాహనాలు మోడ్రన్‌ సామిల్‌ పార్కింగ్‌ పక్కన, ఇద్గా మైదాన్‌కు ఎదురుగా మెయిన్‌ రోడ్డుపై, మీరాలం ఫిల్టర్‌ బెడ్‌, మీరాలం ఫిల్టర్‌ బెడ్‌కు పక్కన ఉన్న ఖాళీ స్థలం, దానికి ఎదురుగా ఉన్న సుఫీ కార్స్‌, యాదవ్‌ పార్కింగ్‌(కార్లు) వద్ద పార్కింగ్‌ చేసుకోవాలి.
  • కాలాపత్తార్‌ వైపు నుంచి ఈద్గాకు వెళ్లే వెహికల్స్.. కాలాపత్తార్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. సాధారణ వాహనాలు పీఎస్‌ వద్ద నుంచి మోచీ కాలనీ, బహదూర్‌పురా, శంషీర్‌గంజ్‌, ఎన్‌కే కుంట వైపు టర్న్ తీసుకోవాలి. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు పురానాపూల్‌ నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర భారీ వాహనాలను పురానాపూల్‌ దర్వాజ నుంచి జియాగూడ, సిటీ కాలేజ్‌ వైపు డైవర్ట్ చేస్తారు.
  • శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పుర వైపు వెళ్లే భారీ వాహనాలను అరాంఘర్‌ చౌరస్తా వద్ద ఆయా రూట్లలో డైవర్ట్ చేస్తారు.
  • హాకీగ్రౌండ్‌, మాసబ్‌ ట్యాంక్‌ వద్ద జరిగే ప్రార్థనలను మాసబ్‌ట్యాంక్‌ ఫ్లై ఓవర్‌ వరకు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్‌ కింద నుంచి వాహనాలను అనుమతించరు. మెహిదీపట్నం, లక్డీకాపూల్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు ఫ్లై ఓవర్‌ పైనుంచి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
  • మెహదీపట్నం నుంచి రోడ్డు నం.1 బంజారాహిల్స్‌కు వచ్చే వాహనాలను మాసబ్‌ట్యాంక్‌ మీదుగా అనుమతించరు. ఈ వాహనాలు ఫ్లై ఓవర్‌ మీదుగా అయోధ్య జంక్షన్‌, ఖైరతాబాద్‌, తాజ్‌కృష్ణ రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది.
  • లక్డీకాపూల్‌ నుంచి మాసబ్‌ట్యాంక్‌ మీదుగా 1/12 జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలను అయోధ్య జంక్షన్‌ వద్ద ఖైరతాబాద్‌ వైపు డైవర్ట్ చేస్తారు.
  • బంజారాహిల్స్‌ రోడ్డు నం.12, పంజాగుట్ట నుంచి మాసబ్‌ట్యాంక్‌ వైపు వాహనాలను పర్మిషన్ ఉండదు. అటుగా వెళ్లే వాహనాలను తాజ్ కృష్ణ మీదుగా ఖైరతాబాద్‌ వైపు మళ్లిస్తారు. వాహనదారులు డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని పోలీసు కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసరమైతే 9010203626 ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

————————————————

రంజాన్ పండుగ విశిష్టత

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింసోదరులు జరుపుకొనే  ప్రధాన పండుగల్లో ఈదుల్‌ ఫిత్ర్ (రంజాన్​). ఈ పండుగకు  అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇస్లామిక్​ కేలండరు ప్రకారం, సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెలగా ఉన్న రంజాన్‌ ముప్పయి రోజులు ఉపవాస దీక్షలు పాటించి పదవ నెల అయిన షవ్వాల్‌ మొదటి తేదీన జరుపుకునే పండుగే ఈదుల్‌ ఫిత్ర్. సాధారంగా దీన్ని రంజాన్‌ పండుగ అని వ్యవహరిస్తుంటారు.

రంజాన్​ పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయి. అన్ని మతాల పండుగల వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు చాంద్రమాన కేలండర్ ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామిక్​ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘దివ్య ఖురాన్’ ముస్లింల పవిత్ర  గ్రంథం ఈ మాసంలో అవిర్భవించిదని ముస్లిం ప్రవక్తలు చెబుతుంటారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసమని అంటారు.

 ముస్లింలు పవిత్ర ఉపవాసాలు ముగింపు రోజే రంజాన్​ పండుగ. దీనిని ఈద్-ఉల్-ఫితర్ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ముస్లింలు ఉపవాసం ఉండడానికి వీల్లేని షవ్వల్ మాసంలో మొదటి రోజు, అంతేకాక ఏకైక రోజు కూడా. ఈద్ షవ్వల్ మాసం తొలిరోజు అవుతుంది.

చాంద్రమాన హిజ్రీ నెల తేదీలు స్థానికంగా చంద్రోదయంపై ఆధారపడివుండడంతో, స్థానిక మతాధిపతులు నెలవంక కనిపించడంపై ఈ పండుగను ప్రకటిస్తారు. దాంతో ఈద్-ఉల్-ఫితర్ ప్రాంతాలవారీగా వేర్వేరు రోజుల్లో జరుపుకుంటారు. మన దేశంలో ఈ సంవత్సరం ఈద్-ఉల్-ఫితర్ ఏప్రిల్​ 11, గురువారం జరుపుకుంటున్నారు. ఈద్-ఉల్-ఫితర్ నాడు ప్రత్యేకమైన సలాత్ (ఇస్లామీయ ప్రార్థన) చేస్తారు. సాధారణంగా బహిరంగ స్థలంలో కానీ, భారీ హాలులో కానీ ఈ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనను కేవలం సమూహంగానే (జమాత్) చేస్తారు. అందరూ కలిసి అల్లా గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తారు.

ఈదుల్‌ ఫిత్ర్ పండుగ మానవుల్లో అత్యున్నత మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొదిస్తుంది. పరోపకార గుణాన్ని, సహనం, త్యాగం, కరుణ, సానుభూతి భావాలను సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని సూచిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది. అందరూ ఒకచోట గుమిగూడి  రోజూవ్రతం ఆచరించే మహాభాగ్యం కలగజేసి, మానవుల మార్గదర్శనం కోసం, సమాజంలో విలువల విస్తృతి కోసం పవిత్ర ఖురాన్‌ గ్రంథం అవతరింప జేసినందుకు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ నమాజ్‌ చేస్తారు. తరువాత ఇమామ్‌ ఖురాన్, హదీసుల వెలుగులో నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తారు. 

రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు, సంపన్నులైనవారు రంజాన్ నెలలో జకాత్ అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని జకాత్ అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30 శాతం  ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ జకాత్ ఉపయోగపడుతుంది.

జకాత్ తో పాటు ఫిత్రా దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే  ఫిత్రాదానం అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X