మహిళల భద్రత బాధ్యత సీఎం కేసీఆర్ దే
అడబిడ్డల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం
తెలంగాణ స్పూర్తితో 18 రాష్ట్రాల్లో షీ టీమ్స్
రాష్ట్రం సురక్షితంగా ఉండడంతో పెట్టబడులు వరద
మహిళా భద్రత సంబరాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆడబిడ్డల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలోని మహిళల భద్రత బాధ్యతను సీఎం కేసీఆర్ తీసుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాష్ట్రంలో మనకు కనిపిస్తున్న పోలీసులు మూడు సింహాలైతే కనపడకుండా వాళ్ల వెనుక ఉండి నడిపించే నాలుగో సింహం సీఎం కేసీఆర్ అని అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో హోం శాఖ నిర్వహించిన మహిళా సురక్ష సంబరాల్లో కవిత పాల్గొని మాట్లాడుతూ… తెలంగాణలో ఆడబిడ్డలకు ప్రాధాన్యత ఇచ్చే మంచి సంస్కృతి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ఆడపిల్లల భద్రత, సంక్షేమ బాధ్యతలను సీఎం కేసీఆర్ తీసుకున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే షీ టీమ్స్ ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఆడపిల్లలపై కన్నెత్తి చూస్తే తాటీస్తామన్న సందేశాన్ని ఇచ్చి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు. తెలంగాణను స్పూర్తిగా తీసుకొని 18 రాష్ట్రాలు షీ టీమ్స్ ను ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో మనకు కనిపిస్తున్న పోలీసులు మూడు సింహాలైతే కనపడకుండా వాళ్ల వెనుక ఉండి నడిపించే నాలుగో సింహం సీఎం కేసీఆర్ అని అన్నారు.
తెలంగాణ ఏర్పడితే ఇది నక్సలైట్ల రాజ్యం అవుతుందని, రౌడీ రాజ్యం అవుతుందని, మతకల్లోలాలు జరుగుతాయని కొందరు అవహేళనగా మాట్లాడిన మాటలు పటాపంచలయ్యాయని స్పష్టం చేశారు. గత 9 ఏళ్లలో ఒక్క రోజు కూడా కర్ఫూ లేదని, ఒక్క మతకల్లోలం జరగలేదని వివరించారు. పోలీసులు అద్భుతమైన భద్రత అందిస్తున్న కారణంగా ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా అర్థరాత్రి 12 గంటలకు ఆడపిల్లలు ధైర్యంగా రోడ్లపై నడిచివెళ్లే పరిస్థితి ఉందని, మఖ్యంగా హైదరాబాద్ 100 నెంబరుకు ఫోన్ చేస్తే 7 నిమిషాల్లో పోలీసులు వస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో 14వ నిమిషంలో పోలీసులు బాధితుల వద్దకు చేరుతున్నారని వివరించారు. ఇన్ని విజయాలు సాధిస్తున్న పోలీసులకు ప్రజానికం తరఫున కవిత వందనాలు తెలియజేశారు.