హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ, భారతీయ జనతా పార్టీకి కొమ్ముకాస్తున్న V6 ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సదరు మీడియా సంస్థలు భారతీయ జనతా పార్టీ జేబు సంస్థగా మారి అబద్ధాలు, అసత్యాలు, కట్టుకథలతో BRS పార్టీ పైన, తెలంగాణ రాష్ట్రం పైన విషం చిమ్మడమే ఏకైక ఎజెండాగా పని చేస్తున్నవి.
ఈ నేపథ్యంలో BRS పార్టీ మీడియా సమావేశాలకు V6, వెలుగు మీడియా సంస్థలను అనుమతించకూడదని నిర్ణయించింది. దీంతోపాటు ఈ సంస్ధలు నిర్వహించే చర్చలతో సహా, ఎలాంటి కార్యక్రమాల్లోనూ పార్టీ ప్రతినిధులెవరూ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. బిజెపి గొంతుకగా మారి, విశ్వసనీయత కోల్పోయిన ఈ మీడియా సంస్ధల అసలు స్వరూపాన్ని, ఎజెండాను తెలంగాణ ప్రజలు గ్రహించాలని BRS పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.