హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పుకోసం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో తెలంగాణ వేదికగా బయలు దేరిన భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత సిఎం కేసీఆర్ ప్రకటించిన విధి విధానాలు పలువురుని ఆకర్షిస్తున్నాయి. దాంతో బిఆర్ఎస్ లో చేరడానికి దేశ వ్యాప్తంగా పలువురు సామాజిక వేత్తలు, బిసీ ఎస్సీ ఎస్టీ కులాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఉత్సాహంగా వున్నారు. ఈ దిశగా ఇప్పటికే, పలు రాష్ట్రాలనుంచి వ్యక్తిగతంగా ఫోన్ల ద్వారా బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో అధినేత సూచనలు సలహాలతో బిఆర్ఎస్ లో పెద్ద సంఖ్యలో చేరేందుకు తమ తమ రాష్ట్రాల్లోకి తిరిగివెల్లి, క్షేత్రస్థాయిలో తమ అనుచరులు శ్రేయోభిలాషులతో సమాలోచనలు జరిపి చేరికలకు పూర్వరంగాన్ని సిద్దం చేసుకుంటున్నారు. అధినేత కేసీఆర్ ఆదేశానుసారం బిఆర్ఎస్ పార్టీ జెండాను, ఎజెండాను వారి వారి రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర్గాల్లో తమ ప్రజల్లోకి తీసుకెల్లడానికి కార్యాచరణ ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో…గురువారం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు బిసీ కులాల నేతలు, రాజకీయ నాయకులు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. కృష్ణా జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల మాజీ చైర్మన్, బిసిఎఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గురిపర్తి రామకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు బీసీ కుల సంఘాల నాయకులు బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ తో సమావేశమై పలు అంశాల పై చర్చించారు. తాము బిఆర్ఎస్ లో చేరడానికి అవకాశమివ్వాలని తమ సంసిద్దతను అధినేత ముందు వ్యక్తం చేశారు.
సిఎం కేసఆర్ దార్శనికతతో తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తున్న తీరు, ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం వారు అమలు చేస్తున్న పథకాలు, అవి సాధిస్తున్న ఘన విజయాలు, ఆంధ్రా ప్రజలనే కాకుండా యావత్ దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ మాదిరి ఆంధ్ర ప్రదేశ్ ను కూడా ప్రగతి పథంలో నడిపించగల సత్తా సిఎం కేసఆర్ కు వున్నదని తాము భావిస్తున్నామన్నారు.
తెలంగాణలోని కేసీఆర్ పాలన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బడుగు బలహీన వర్గాల్లో వొక కొత్త ఆశను రేకిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తమకూ అవకాశమిస్తే ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాలు, నియోజక వర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తమ భేటీలో వారు అధినేత కు వివరించారు. కాగా వారి ప్రతిపాదనకు బి ఆర్ ఎస్ అధినేత సీఎం కేసిఆర్ సానుకూలంగా స్పందించారు.