హైదరాబాద్ : రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయి అని తెలంగాణ ప్రభుత్వ లోగోను మారిస్తే కొన్ని పట్టణాల పేర్లు కూడా మార్చాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణాలు, జిల్లాలో పేర్లలలో కూడా రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయి వాటిని కూడా మర్చాలన్నారు. ఈ రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి, రాచరికపు ఆనవాళ్లు ఉన్న కొన్ని జిల్లాల పేర్లను కూడా మార్చాలని డిమాండ్ చేశారు.
- ఆదిలాబాద్ (ఎదులాపురం)గా 2. నిజామాబాద్ (ఇందూరు)గా 3. జహీరాబాద్ (పెద్దెక్కిలి)గా 4. కరీంనగర్ (ఎలగందల)గా 5. సికింద్రాబాద్ (లష్కర్ లేదా ఉల్వులు) గా 6. మహబూబ్ నగర్ (పాలమూరు) గా. 7. మహబూబాబాద్ (మానుకోట)గా పేర్లు ఇంకా స్ధానికులు వాడుతున్నారు. వాటిని కాంగ్రెస్ సర్కారు అధికారికంగా పునరుద్దరించి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలు వేయాలని సూచించారు.
ఇక రాచరికపు గుర్తులను రాష్ట్ర చిహ్నంలోనే కాకుండా అసలు రాచరికపు ఆనవాళ్లను ప్రత్యేకించి తెలంగాణ హిందువుల రక్త మాంసాలతో, ఆడబిడ్డల మానాభిమానాలతో ఆటలాడుకుని, క్రూరంగా హింసించి, నిరంకుశ పాలన సాగించిన ముస్లిం పాలకుల గుర్తులను, ఆనవాళ్లను తెలంగాణ నుంచి లేకుండా చేయాలనేది బిజెపి డిమాండ్ అని తెలిపారు. మరి ముస్లిం ఓట్ల కోసం పాకులాడే రేవంత్ రెడ్డికి ముస్లిం పాలకుల గుర్తయిన చార్మినార్ ను తొలగించే దమ్ము, ధైర్యముందా అని ప్రశ్నించారు.
ఇది కూడ చదవండి-
నిజంగా రాచరికపు గుర్తులను తొలగించాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగానే ఉంటే… తెలంగాణ నుంచి దురాక్రమణ దారులైన ముస్లిం పాలకుల ఆనవాళ్లు లేకుండా చేయాలి కానీ, ప్రజల ఆదరణ పొందిన కాకతీయుల వంటి హిందూ పాలకుల గుర్తులను తొలగించడం సరికాదని తెలిపారు. ఇక ప్రభుత్వం రూపొందించిన కొత్త లోగోలో అమరవీరుల స్థూపం పెట్టడాన్ని స్వాగిస్తున్నామని చెప్పిన మహేశ్వర్ రెడ్డి… ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, వారి తల్లి లేదా తండ్రి లేదా భార్యకు ప్రతినెలా రూ. 25 వేలు అమరవీరుల గౌరవ పెన్షన్, ఇళ్ల స్థలాలు అందజేస్తామన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీనీ ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వానికి… తెలంగాణ ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన బీజేపీ నేతలను విస్మరించడం సరికాదన్నారు.
ఉద్యమ సమయంలో తెలంగాణకు సోనియా గాంధీ బలి దేవతగా మారారని ఆరోపించిన ఆనాటి టీడీపీ నేత, నేటి ముఖ్యమంత్రి ఇప్పుడు బలి దేవతకు భక్తుడిగా మారాడని ఎద్దేవా చేశారు. బీజేపీ పాత్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్మరించినా… తెలంగాణ ప్రజలకు తెలుసు బీజేపీ నేతలు ఎంత సహకరించారో…? దివంగత నేత సుష్మా స్వరాజ్ ను తెలంగాణ చిన్నమ్మగా కొనియాడారు తెలంగాణ ప్రజలు.