హైదరాబాద్: మిషన్ భగీరథ ద్వారా నూటికి నూరు శాతం గృహాలకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధిచేసిన నీరు ఇవ్వలేకపోతే.. బిందెడు నీళ్ల కోసం మహిళలు పడే కడగండ్లను నివారించకుంటే, తాను ప్రజలను ఓట్లు అడగనని రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. తాను చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నట్లు చెప్పారు. ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.
స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు నమస్కరించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పాలన సాగిస్తుందన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి వేడుకల ప్రారంభానికి ముందు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమర వీరులకు సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. అక్కడ పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సచివాలయానికి చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు.
ప్రతి రంగంలో దేశం నివ్వెరపోయే ఫలితాలు సాధించి ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్నారు సీఎం. అందుకే తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను స్మరించుకోవడానికి 22 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఉద్యమ సమయంలోనే కాదు పాలన కాలంలో కూడా ప్రజలు చాలా సహకరించారన్నారు కేసీఆర్. తెలంగాణ సమాజం ఆరు దశాబ్ధాలు పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించుకుందన్నారు. తెలంగాణ వచ్చే నాటికి అన్ని రంగాల్లోనూ విధ్వంసం కనిపించిందన్నారు. వాటిన్నింటిని అదిగమించి దేశంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిందన్నారు. ధ్వంసమైన రంగాలను చక్కదిద్ది వాటిని ప్రగతి పథంలోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం నిజాయితీగా శ్రమించిందన్నారు.
సమైక్య పాలకులు అనుసరించిన వివక్షాపూరిత విధానాలను మార్చేయడానికి సిద్దమయ్యామన్నారు. తెలంగాణ పునరన్వేషణ, పునర్నిర్మించుకోవాలనే నినాదంతో ముందడుగు వేశామన్నారు. నూతన విధానాలకు రూపకల్పన చేసినట్టు పేర్కొన్నారు. ప్రజల తక్షణ అవసరాలు, వనరులు, వాస్తవాలు, అందులోబాటు ఉన్న పరిస్థితులు ఆధారంగా వివిధ చట్టాలు,ప్రణాళికలు, మార్గదర్శకాలను రూపొందించామని వివరించారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తాను చెప్పిన మాటలను సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకనే విధంగా తలమానికంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చాను. ఆ ఉక్కు సంకల్పాన్ని ఎప్పుడూ విస్మరించలేదు. ఏ మాత్రం చెదరినివ్వలేదు. ఇప్పుడు అదే నిజమైంది. దేశానికి స్ఫూర్తినిచ్చే రాష్ట్రంగా ఆవిర్భవించింది.
ఉద్యమం సమయంలో ప్రజలు వ్యక్తపరిచిన ఆకాంక్ష పట్ల బీఆర్‌ఎస్‌కు సంపూర్ణ అవగాహన ఉందన్నారు కేసీఆర్. వాటికి అనుగుణంగానే మేనిఫెస్టోను రూపొందించుకొని అమలు చేశామన్నారు. దశాబ్ధి ఉత్సవాల సందర్భఁగా నాటి పరిస్థితులు నేడు చూస్తున్న విజయాలు బేరీజు వేసుకుంటే సాధించిన ప్రగతి అర్థమవుతుందన్నారు.
9 ఏళ్ల వ్యవధిలో కరోనా కారణంగా మూడేళ్లు వృథా పోయిందన్నారు కేసీఆర్. మిగిలిన కాలంలోనే వాయువేగంతో ప్రగతి పథంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు చూస్తున్న తెలంగాణ నవీన తెలంగాణ, నవనవోన్మేష తెలంగాణ అని విశ్లేషించారు. దేశంలో ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా తెలంగాణ మోడల్ మారుమాగుతుందన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి మన్ననలు అందుకుంటోంది. ఇందులో భాగమైన ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులు, యంత్రాగాన్ని అభినందిస్తున్నాను.
తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం, ఆచరణీయమయ్యాయి. తమ రాష్ట్రాల్లో వీటిని అమలు చేస్తామని చాలా మంది నేతలు, సీఎంలు చెబుతుంటే ఆనందంగా ఉంది. తెలంగాణ స్వరాష్ట్ర పాలనలో ప్రతి పల్లె మురిసిందన్నారు సీఎం కేసీఆర్. ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపినట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో సమగ్ర ప్రణాళిలు ప్రవేశ పెట్టి అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. కేంద్రం నుంచి సాధించిన అవార్డులు రివార్డుల గురించి వివరించారు.
హైదరాబాద్ ఓ మినీయేచర్ ఆఫ్ ఇండియా అని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. విమాన ప్రయాణికుల కోసం విమానాశ్రయం వరకు మెట్రోను 6,250 కోట్ల రూపాయలతో విస్తరిస్తున్నామని తెలిపారు. దీన్ని మూడేళ్లోలనే పూర్తి చేయాలని సంకల్పించినట్టు వెల్లడించారు. ట్రాఫిక్ సమస్య తగ్గించడానికి ఎస్సార్డీపీ కింద 67 వేల 149 కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు డెవలప్ చేసినట్టు గుర్తు చేశారు. ఇలా ప్రతి రంగంలో చేపట్టిన ప్రగతిని సీఎం కేసీఆర్ ప్రజలకు తెలియజేశారు. (ఏజెన్సీలు)