ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్‌ కుమార్‌ లేఖ, విషయం…

గౌరవనీయులైన శ్రీ కె. చంద్రశేఖర్‌ రావు గారికి
తెలంగాణ ముఖ్యమంత్రి,
ప్రగతి భవన్‌, హైదరాబాద్‌.

నమస్కారం…

విషయం : దళితులు, గిరిజనుల భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలను ఆపాలని, వారికి ఉన్న కనీస జీవనాధారాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ…

ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్‌ చేసిన భూములకు మీ ప్రభుత్వం రక్షణ కల్పించకపోగా, వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని ప్రోత్సహించడం దుర్మార్గం. దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామన్న హామీని మీ ప్రభుత్వం వమ్ము చేయడంతో లక్షలాది మంది దళితులు, గిరిజనుల ఆశలు అడియాసలయ్యాయి. అది పోగా ఎప్పుడో గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో దళిత, గిరిజన కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటుంటే రియల్‌ వ్యాపారం కోసం ఆ భూములను లాక్కోవాలని చూడడం వారి నోటి కాడి ముద్ద లాక్కోవడమే. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తానంటూ హామీలివ్వడమే కానీ, వాటిని అమలులో చూపెట్టడం లేదు.

సిద్దిపేటలో మీరు ప్రారంభించిన వెంచర్‌ దళితుల భూముల్లోనే. శంషాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు ప్రయత్నిస్తున్నది గిరిజన భూముల్లోనే. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా దళితులకు, గిరిజనులకు కేటాయించిన అసైన్డ్‌ భూములను వారి నుంచి లాక్కుంటున్న ఉదంతాలు కోకొల్లలు. సమాజంలో అత్యంత వెనుకబడిన దళితులకు, గిరిజనులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? మీరూ మీ కుటుంబం మాత్రం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు, దళితులు, గిరిజనుల పట్ల మాత్రం తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. దళితుల సంక్షేమమంటే ఎత్తైన విగ్రహాలు, పాలనా భవంతులకు పేర్లు కాదు. వారికి జీవనోపాధి కల్పించడమే ముఖ్యం. అంతో ఇంతో ఉన్న జీవనోపాధిని సైతం కోల్పోయి మీ పాలనలో దళితులు, గిరిజనలు అన్ని విధాల తీవ్రంగా నష్టపోయారు. మీ ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది.

ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లింపులో నిర్లక్ష్యం వల్ల మీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇప్పటికే చదువుకు దూరం అవుతున్నారు. ఇప్పుడు దళితులను, గిరిజనులకు మభ్యపెట్టి, భయపెట్టి వారి భూములు లాక్కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పూనుకోవడం అత్యంత శోచనీయం. దళితులు, గిరిజనుల బతుకులు ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విడనాడాలని బిజెపి డిమాండ్‌ చేస్తున్నది. అసైన్డ్‌ భూముల్లో రియల్‌ దందాకు తెరదించాలని, దళితులకు న్యాయబద్ధంగా వచ్చిన భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం. లేకుంటే దళితులు, గిరిజనుల పక్షాన బిజెపి తెలంగాణ శాఖ పెద్దఎత్తున ఆందోళన చేపడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.

భారత్‌ మాతాకీ జై…
బండి సంజయ్‌ కుమార్‌, ఎంపీ,
అధ్యక్షులు, బీజేపీ తెలంగాణ శాఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X