అండగా ఉంటామని బరోసా కల్పించిన మంత్రి
భీంగల్: భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన కర్రోళ్ళ అనిల్ యాదవ్ కు చెందిన 48 గొర్రెలు ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. పిడుగుపాటుకు అనిల్ కూడా గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాధిత అనిల్ ను గురువారం నాడు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న అనిల్ కు అందుతున్న చికిత్స పై ఆరాతీశారు. పిడుగుపాటు ఘటన పట్ల ఇంకా షాక్ లో ఉన్న అనిల్ కు వారి కుటుంబానికి మంత్రి మనో ధైర్యం చెప్పారు.
అక్కడి నుండే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో మాట్లాడి ఘటనపై త్వరగా రిపోర్ట్ తెప్పించుకొని ఎన్డిఆర్ఎఫ్ కింద బాధితునికి సహాయం అందేలా చూడాలని అదేశించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్డిఆర్ఎఫ్ సాయం పిడుగుపాటుకు గురైన దానికి రాదని ఇతర అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా… ఆపదలో ఉన్న వారికి అక్కరకు రాని స్కీంలు పెట్టి,పైగా అన్ని మేమే చేస్తున్నామని బిల్డప్ ఇస్తారని కేంద్ర ప్రభుత్వ విధానం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అందేలా చర్యలు చేపట్టాలని,రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మొదటి లబ్దిదారుడు కర్రోళ్ల అనిల్ అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ ను ఆదేశించారు.
మంత్రి తన సొంతంగా 50వేల రూపాయలు నగదు ఆర్ధిక సహాయం చేశారు. ఆపదలో ఉన్న వారికి కేసిఆర్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని,భరోసా కల్పిస్తుందని మంత్రి గుర్తు చేశారు. సీఎం కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సహాయం చేస్తామని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.