హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రభుత్వ రాబడి కోసం ప్రజలను తాగుబోతులుగా మారుస్తున్నారని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. అర్థరాత్రి వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ప్రభుత్వం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్ పాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
శుక్రవారం గాంధీభవన్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి బయల్దేరిన మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రానికి 45 వేల కోట్లు ఆదాయం వస్తుంది అంటే రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతుందన్నారు.
డిసెంబర్ 31st రాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరచి ప్రజలను లూటీ చేయాలని చూస్తుందన్నారు. హైకోర్టు రాత్రి 10గంటలకు మద్యం షాపులు మూసేయాలని చెప్పినా చీఫ్ సెక్రటరీ కొత్త జీవో విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత తండ్రిబాటలో నడుస్తుంది కాబట్టే… లిక్కర్ స్కాంలో ఉన్నారని ఆరోపించారు.
తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సునీతారావు ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్లపై అత్యాచారాలు జరుగుతుంటే అర్థరాత్రి వరకు మద్యం షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తారా అని ప్రశ్నించారు. డ్రగ్స్ ఎక్కడ అమ్ముతున్నారో తమకు సమాచారం ఉందని.. వాటి మీద దాడులు చేసి అడ్డుకుంటామన్నారు. బెల్ట్ షాపులు డిసెంబర్ 31న పూర్తిగా ముసేయాలనీ సునీతారావు డిమాండ్ చేశారు. (Agencies)