రాయితీని ‘ఆదాయ నష్టం’గా పేర్కొన్న వైనం.
NCCPA, All Pensioners & Retired Persons Association, సీనియర్ సిటిజన్స్ ఖండన
Hyderabad: దేశంలో రైలు టిక్కెట్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీలను పునరుద్ధరిస్తారనే ఊహాగానాలకు కేంద్రం తెర దించింది. రాయితీల పునరుద్ధరణ అవకాశాన్ని భారతీయ రైల్వే స్పష్టంగా తోసిపుచ్చింది. ఇది దేశంలోని సీనియర్ సిటిజన్లకు నిరాశను మిగిల్చింది. కోవిడ్‌కు ముందు, 58 ఏండ్లు పైబడిన మహిళా ప్రయాణికులు, 50 శాతం ఛార్జీల తగ్గింపునకు అర్హులు. 60 ఏండ్లు పైబడిన పురుషులు 40 శాతం ఛార్జీల తగ్గింపునకు అర్హులు.
గరీబ్ రథ్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, సువిధ, హమ్‌సఫర్ ట్రైన్‌లు తప్ప మిగతా అన్ని రైళ్లకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. రైలు టిక్కెట్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణపై రైల్వేస్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసుల స్థితిని కోరుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన దరఖాస్తుకు రైల్వే సమాధానమిచ్చింది.
రైల్వే మంత్రిత్వ శాఖ, 2020 మార్చి 19 కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో, సీనియర్ సిటిజన్‌లతో సహా వివిధ వర్గాలకు రైలు టిక్కెట్‌లపై ఇచ్చిన అన్ని రాయితీలను ఉపసంహరించుకుంటూ సర్క్యులర్ జారీ చేసింది. అయితే, కోవిడ్-19 ఆక్షలు సడలించి నెలలు గడిచినప్పటికీ రాయితీని పునరుద్ధరించకపోవటంతో పార్లమెంటులో సభ్యులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు.
2022లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆ సమయంలో ”సీనియర్ సిటిజన్లకు రాయితీలను తిరిగి ప్రారంభించటం ప్రభుత్వానికి సాధ్యం కాదు” అని వెల్లడించటం గమనార్హం. అయితే, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ ఏడాది ఆగస్టు 4న తన నివేదికను సమర్పించిన తర్వాత స్లీపర్, 3ఏసీ ప్రయాణికులకు సీనియర్ సిటిజెన్స్‌కు కేంద్రం రాయితీని పునరుద్ధరిస్తుందన్న ఆశలు పెరిగాయి.
రైల్వేలు సాధారణ స్థితికి చేరుకుంటున్నందున వివిధ వర్గాల ప్రయాణికులకు మంజూరు చేసిన రాయితీలను న్యాయంగా పరిశీలించాలని కమిటీ సిఫారసు చేసింది. అయితే, రాయితీలను పునరుద్ధరించే ఆలోచన లేదని ఆర్టీఐ ప్రశ్నకు రైల్వేశాఖ సమాధానాన్ని వెల్లడించటం గమనార్హం. తమ నిర్ణయాన్ని సమర్థించుకోవటం కోసం రైల్వే రాయితీని ‘ఆదాయ నష్టంగా’ పేర్కొనటం గమనార్హం. రాయితీల నుంచి ప్రయోజనం పొందుతున్న సీనియర్ సిటిజన్లలో మధ్యతరగతి, అట్టడుగు వర్గాలకు చెందిన వారు ఉన్నట్టు రైల్వే డేటా సూచిస్తున్నది.