- స్వామి కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఎప్పటికీ ఉండాలని ఆకాంక్ష
- కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ గూడ కేశవ్ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఘనంగా మహా పడిపూజోత్సవం
- 22 ఏళ్లుగా నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కేంద్రమంత్రి
- అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన నారాయణగూడ
- కిషన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు, బీజేపీ ముఖ్యనేతలు
హైదరాబాద్: హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి శరణుఘోషతో ఆదివారం నారాయణగూడ ప్రాంతం మార్మోగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో అయ్యప్పస్వామి మహా పడిపూజోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి దంపతులు అయ్యప్ప విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం పదునెట్టాంబడిపై స్వామి వారికి షోడశోపచారాలు నిర్వహించారు. తర్వాత అయ్యప్ప స్వాములు శరణుఘోషతోపాటు, భజనలు, పాటలతో ఆ ప్రాంతం మార్మోగింది. గురుస్వామి ఆత్రేయాచార్యుల చేతుల మీదుగా జరిగిన పూజా కార్యక్రమంలో గాయకుడు జడల రమేష్ (సిరిసిల్ల భజన బృందం) ఆలపించిన పాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. భజన బృందం, ఆర్కెస్ర్టా, దేవతా మూర్తుల వేషధారణతో కళాకారులు నృత్యాలతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అయ్యప్పస్వామి దీక్ష కారణంగా భక్తుల్లో ఆధ్యాత్మిక జీవనశైలితోపాటు, సేవాగుణం అలవడుతుందన్నారు. కార్తీకమాసంలో లక్షలాదిమంది భక్తులు అయ్యప్ప స్వామి మాలధారణతో తమ జీవితాల్లో సానుకూల మార్పును స్వాగతిస్తారన్నారు. గత 22 ఏళ్లుగా ఘనంగా అయ్యప్పస్వాములతో మహా పడిపూజోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.
అనంతరం, స్వాములకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి దంపతులు అయ్యప్ప స్వాములుకు భోజనం వడ్డించడంతోపాటు తాంబూలాన్ని అందించి వారి ఆశీస్సులు పొందారు. ఈ పడిపూజోత్సవంలో.. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ తోపాటుగా నగరంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్పస్వాములు, భక్తులు పాల్గొన్నారు.
బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, స్థానిక MLA శ్రీ ముఠా గోపాల్, బీజేపీ సీనియర్ నాయకులైన శ్రీ ఇంద్రసేనారెడ్డి, శ్రీ మర్రి శశిధర్ రెడ్డి, శ్రీమతి విజయశాంతి, శ్రీ నందీశ్వర్ గౌడ్, శ్రీ వివేక్ వెంకటస్వామి, కపిలవాయి దిలీప్ కుమార్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.