Hyderabad: రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేగింది. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని రాగన్నగుడాలో నివసిస్తున్న వైశాలి అనే యువతి డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తుంది. ఇదే క్రమంలో వైశాలి ఇంటికి మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి వచ్చి దౌర్జన్యం చేశారు. దాదాపు 100 మందితో కలిసి వచ్చి నానా హంగామా సృష్టించారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ విరగ్గొట్టారు. యువతి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం వైశాలిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అడ్డువచ్చిన యువతి తల్లిదండ్రులనే కాకుండా పక్కింటి వారిని కూడా తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో యువతీ తల్లిదండ్రులతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ల దౌర్జన్యంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న వెంటనే ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర రావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన ప్రాంతాన్నిపరిశీలించారు. వైశాలిని కిడ్నాప్ చేసిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన దగ్గర నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ గొడవకు, కిడ్నాప్‌నకు పెళ్లి విషయమే కారణమని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

గతంలోనే నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అయినప్పటికీ యువతిని కొంతకాలంగా నవీన్ రెడ్డి వేధిస్తున్నాడని చెబుతున్నారు. పోలీసుల సపోర్ట్ తోనే నవీన్ రెడ్డి మనుషులు రెచ్చిపోయారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నవీన్ రెడ్డి కొంతమంది మనుషులతో తమ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న సమయంలో పోలీసులకు, 100కు కాల్ చేసినా స్పందించలేదని ఆరోపిస్తున్నారు.

మిస్టర్ టీ ఫౌండర్ నవీన్ రెడ్డికి వైశాలి కుటుంబంతో ముందు నుంచే పరిచయటం ఉంది. అయితే వైశాలికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో తెలిసిన వారి వల్ల నవీన్ రెడ్డి పరిచయమయ్యారు. ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా కొంత కాలం స్నేహంగా ఉన్నారు. అయితే పెళ్లి విషయంలో మాత్రం విభేదాలు తలెత్తాయి. దీంతో పెళ్లికి వైశాలితో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడా నిరాకరించారు. ఈ కారణంగా నవీన్ రెడ్డి పలుమార్లు అమ్మాయిని బెదిరించే ప్రయత్నం చేసినట్టు బాధితురాలి తల్లి తెలిపింది. నవీన్ రెడ్డి వెనక చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులున్నారని పెళ్లి చేసుకోవాలని తమ కూతురిని బలవంతం కూడా చేసినట్టు ఆరోపించారు. ఎంతకు ఒప్పుకోకపోయే సరికి ఇలా 100 మందిని తీసుకొచ్చి కిడ్నాప్ చేశారని కన్నీరు మున్నీరయ్యారు.

తమ కూతురుని నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి వచ్చిదాడి చేసి, తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాదాపు 100 మందికిపైగా యువకులతో నవీన్ రెడ్డి.. తమ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులపై దాడిచేసి తమ కూతురిని బలవంతంగా తీసుకెళ్లాడని చెబుతున్నారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, ఇతర సామాగ్రిని నవీన్ తో వచ్చిన మనుషులు ధ్వంసం చేశారని చెబుతున్నారు. అడ్డువచ్చిన తల్లిదండ్రులు, స్థానికులపై దాడి చేసి యువతిని తీసుకోని పారిపోయినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇవాళ యువతిని చూసుకునేందుకు పెళ్లివారు వస్తున్నారన్న విషయం నవీన్ రెడ్డికి తెలిసింది. దీంతో ఈ పెళ్లి సంబంధం చెడగొట్టాలనే అక్కసుతో ఏకంగా 100 మంది యువకులను నవీన్ రెడ్డి వెంటేసుకుని వచ్చాడు. యువతి ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లారు. మరోవైపు యువతి కుటుంబ సభ్యులు, బంధువులు సాగర్ హైవేపై ధర్నాకు దిగారు. దీంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదిభట్ల సీఐ నరేందర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సాగర్ రోడ్ పై ధర్నా చేపట్టారు. తమ బిడ్డ ఆచూకీ తెలపాలని డిమాండ్ చేశారు. (Agencies)