యాత్ర ఫర్ ఛేంజ్: కవిత నోటీసులకు తెలంగాణ సమాజానికి సంబంధమేంటి? రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : “పంపకాల్లో తేడా వచ్చి కల్వకుంట్లకు కవితకు నోటిసులు ఇస్తే దానికి తెలంగాణ సమాజానికి ఏం సంబంధం. మీ కుటుంబంలోని నలుగురికి సంబంధం ” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా శుక్రవారం జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని చల్గల్ గ్రామం నుంచి జగిత్యాల వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం జగిత్యాల కొత్తబస్టాండ్ చౌరస్తాలో నిర్వహించిన జన సభలో ఆయన ప్రసంగించారు. ఈ నెల 6న సమ్మక్క-సారలమ్మల ఆశ్వీరాదంతో మొదలైన పాదయాత్ర మహబూబాబాద్, వరంగల్ పార్లమెంటు స్థానం పరిధి తర్వాత కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి వచ్చింది. తెలంగాణను ఇస్తామని సోనియా గాంధీ గారు ప్రకటించిన కరీంనగర్ గడ్డ మీద నిన్న నిర్వహించిన కృతజ్ఞత సభతో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో యాత్ర ముగిసింది. ఈ రోజు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాలకు చేరింది.

గల్లీలో అయ్య లిక్కర్ దందా చేస్తే.. ఢీల్లీలో బిడ్డ లిక్కర్ స్కాం చేసింది. మీ కుటుంబం అక్రమాలకు పాల్పడ్డారని కేంద్ర ప్రభుత్వ సంస్థ చెబుతోంది. తెలంగాణ సమాజం కేసీఆర్ ను నమ్మి ఓటేస్తే…. గంపగుత్తగా వెళ్లి మోదీకి మద్దతు తెలిపారు. మోదీ సీబీఐ, ఈడీ తో ప్రభుత్వాలను పడగొడుతుండని గొంతు చించుకొని చెప్పినా వినలేదు. సోనియాను అవమానించడానికి ఈడీ ఆఫీసుకు పిలిచినపుడు కేసీఆర్ మాట్లాడలేదు. ఆనాడు మోదీతో జోడీ కట్టిన మీకు ఇవాళ మేము ఎందుకు మద్దతు ఇస్తాం. మీ నలుగురు కుటుంబ సభ్యుల దోపీడీ చేసి దొరికితే .. మా తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? అధికారం ఉందని ఆనాడు విమలక్క, మందకృష్ణ మాదిగ, తీన్మార్ మల్లన్న, రవి ప్రకాష్ లను అరెస్టులు చేశావు కదా.. 2018 లో నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి నన్ను జైల్లో పెట్టి ఎన్నికల్లో నన్ను ఓడించావు కదా..కోదండరాం ను ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఈడ్చుకెళ్లారు కదా..కేసీఆర్.. నువు ఏది ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది. కేసీఆర్, బీజేపీ వేరు వేరు కాదు..బీఆరెస్, బీజేపీ అవిభక్త కవలలు.

జీవన్ అన్న జీవితం తెరిచిన పుస్తకం. రాజకీయాల్లోకి రావాలనుకునేవారు జీవన్ అన్న ను ఆదర్శంగా తీసుకోవాలి. 42ఏళ్లుగా ప్రజల కోసం జీవితం అంకితం చేస్తున్న ఏకైక నాయకుడు జీవన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని జగిత్యాల గడ్డపై 50వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించాలి. జీవన్ అన్నకు ఢిల్లీ అయినా.. గల్లీ అయినా జగిత్యాలనే బీఆరెస్ నేతలు గ్రామాల్లో రైతుల భూములను గుంజుకుని వారి జీవితాలతో చెలగాటం ఆడుతారా? ఇక్కడి ఎమ్మెల్యేకు బుద్ది ఉందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇక్కడి రిక్రియేషన్ జోన్ లను రద్దు చేస్తాం. తొమ్మిదేళ్లలో కేసీఆర్ కు 23లక్షల కోట్లు వస్తే… నియోజకవర్గానికి 23 వేల కోట్లు రావాల్సి ఉంది. 23లక్షల కోట్లు బొక్కింది కేసీఆర్ కుటుంబమేనా? నిజామాబాద్ పార్లమెంట్ లో మధుయాష్కీ ని గెలిపిస్తే తెలంగాణ తీసుకొచ్చారు. కవితను గెలిపిస్తే 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెస్తా అని హామీ ఇచ్చి గాలికొదిలేశారు. అందుకే ఆమెకు ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు. పసుపు బోర్డు తెస్తా అని చెప్పిన అరవింద్… ఐదేళ్లయినా పసుపు బోర్డు తేలేదు.

2024, జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ. 5లక్షలు సాయం అందిస్తుంది. రైతులు బ్యాంకు లకు రుణాలు చెల్లించకండి.. కాంగ్రెస్ వస్తుంది.. రూ. 2లక్షల రుణమాఫీ చేస్తుంది. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. పేదవారికి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంతంలో చెరుకు రైతులను ఆదుకుంటాం. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తాం.

100 రోజుల్లో ధరణి సమస్యలకు పరిష్కారం : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ధరణి సమస్యలను పరిష్కరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ధరణి సమస్యలపై పెద్దపల్లి జిల్లా సుల్తాన్ పూర్లో నిర్వహించిన ధరణి అదాలత్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో 9 లక్షల మంది ధరణితో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ధరణి విధానంలో లోపాలను సరి చేసి పేదలను ఆదుకోవాలి. లేకపోతే పేదల ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బరాబర్ ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జరిగిన పోరాటాలకు మూలం భూమి. భూమి పేదవాడి ఆత్మగౌరవం, జీవనవిధానం. కాంగ్రెస్ హయాంలో సరళీకృత విధానాలు తెచ్చి పేదలకు పంపిణీ చేసింది. గతంలో భూములను సేకరించి 22లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ పేదలకు పంచింది. 2006లో అటవీ హక్కుల చట్టం తెచ్చి ఆదివాసీ, గిరిజనులకు 10లక్షల ఎకరాలు కాంగ్రెస్ పంపిణీ చేసింది. 2013 భూసేకరణ చట్టం తెచ్చి పేదలను ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్, మోదీ కలిసి భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారు. గతంలో ప్రతీ గ్రామానికి 20 సమస్యలు ఉంటే…కేసీఆర్ తెచ్చిన ధరణితో గ్రామాల్లో 200 సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ధనవంతుల కోసమే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. ధరణితో పేదల నుంచి వేలాది కోట్లు దోచుకుంటున్నారు. ధరణి పోర్టల్ తో వేల కోట్లు కేసీఆర్ బంధువుల చేతుల్లోకి వెళ్లాయి. వీళ్లను బేడీలు వేసి జైల్లో పెట్టాలి. పేదలకు భూములు పంచి వారి ఆత్మగౌరవం నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు వారి భూములను వారికి అందేలా చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సుల్తాన్ పూర్ కు చెందిన ధరణి బాధితులకు సమస్యలు తెలుసుకుని వారికి గ్యారంటీ కార్డులు అందజేశారు.

రెండేళ్లలో భూ సర్వే చేయిస్తాం: జైరాం రమేష్

తెలంగాణలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ..వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తాన్ పూర్ గ్రామంలో జరిగిన ధరణి అదాలత్ లో కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో మీ భూమి..మీ హక్కు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ధరణిలో 60 లక్షల మంది పేర్లు ఉంటే దాదాపు 20 లక్షల ఖాతాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపారు. ధరణి పోర్టల్ ఉద్దేశం ఒకరి ఫోటో ఒకరికి పెట్టడం కాదు..ఎవరి భూములకు వారి హక్కులు కల్పించాలని జైరాం రమేష్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేళ్లలో భూముల సర్వే చేయిస్తామని జైరాం రమేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో భూములకు సంబంధించి 125 చట్టాలు..30 వేల జీఓలు ఉన్నాయి..కానీ మేము ఒకే చట్టం తీసుకొస్తామన్నారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం భూయజమాని అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితిలో సేకరించవద్దని చట్టం తీసుకొచ్చామని గుర్తు చేశారు. బలవంతంగా భూసేకరణ పూర్తిగా నిషేధిండమే కాకుండా చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు.

జలపతి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి

ఈ ఇటీవ ల తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు జలపతిరెడ్డి కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. జలపతి రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన ఆయన జలపతి రెడ్డి కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. నర్సింగపూర్ గ్రామాన్ని రిక్రియేషన్ జోన్ నుంచి తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జలపతి రెడ్డి ఆత్మహత్యకు కారణమైన న్యాయవాది బెయిల్ రద్దు చేసి.. అతన్ని అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

బండి, కిషన్ పేపర్ పులుల్లా రంకెలేయొద్దు : రేవంత్ రెడ్డి

లిక్కర్ స్కాం వ్యవహారం పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలు. లిక్కర్ స్కాం కేసులో ఏం జరుగుతుందో ఈడీ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా పట్ల వ్యవహరించనట్లు.. లిక్కర్ కేసులో కవిత పట్ల ఎందుకు వ్యవహరించడంలేదు? ఇదంతా ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చిన రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్.. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ ఇష్యూపై మౌనంగా ఉంటున్న కేసీఆర్ బండి సంజయ్ కి కనిపించడం లేదా? బండి సంజయ్, కిషన్ రెడ్డి పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలేయొద్దు. కేసీఆర్ అవినీతిపై నేను పిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేపట్టలేదు? కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని, కేంద్ర మంత్రులు చెప్పారు. అయినా కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేపట్టలేదు. మీకున్న కుమ్మక్కు రాజకీయాలు ఏమిటి? బండి సంజయ్ వ్యవహారం గురవిందగింజ చందంగా ఉంది. బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ పై పోటీ చేస్తారో లేదో చెప్పాలి. గతంలో పోటీ చేసిన సంజయ్.. ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోతే…బండి సంజయ్ కి, బీఆరెస్ మధ్య చీకటి ఒప్పందం ఏమిటో ప్రజలు గుర్తిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X