న్యూఢిల్లీ/హైదరాబాద్: జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇందుకు గానూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఆయా రాష్ట్రాలు కులగణన పేరుతో వారికి అనుకూలంగా సర్వేలు చేపట్టి ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్న సందర్భంలో.. ప్రజాభిప్రాయం మేరకు, సామాజిక సమరసతను దృష్టిలో ఉంచుకుని జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయించడం మంచి పరిణామం.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుల గణన పేరుతో స్వార్థపూరిత రాజకీయాలకు తెరలేపాయి. దీన్నో రాజకీయ అస్త్రంగా వాడుకుని.. ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేందుకు ప్రయత్నించాయి. కానీ, ప్రజాప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. తాజా నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు మరొక తాజా ఉదాహరణ. గతంలో మోదీ సర్కారు.. అగ్రవర్ణ పేదలకోసం 10% EWS రిజర్వేషన్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
1881 నుంచి 1931 కులగణన జరిగేది.. కానీ స్వాతంత్ర్యానంతరం కులగణన జరగకూడదని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం 1951 నుంచి నేటివరకు ఏనాడూ కులగణన జరగలేదు. 1951లో జరిగిన కులగణనలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన గణాంకాలను మాత్రమే లెక్కించారు. ఈ రెండు కులాలు అత్యంత వెనుకబడి ఉన్న కారణంగా వీరి పురోగతి కోసం కులగణన అవసరమని నిర్ణయించారు. మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకంగానే ఉంది. నెహ్రూ, మౌలానా ఆజాద్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కులగణన పట్ల బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారు.
Also Read-
2010లో నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.. పార్లమెంటులో మాట్లాడుతూ కులగణనపై కేబినెట్లో చర్చిస్తామని చెప్పారు. అనంతరం దీనిపై చర్చించేందుకు మంత్రుల బృందం ఏర్పాటైంది. చాలా పార్టీలు కులగణనకు మద్దతిచ్చాయి. బీజేపీ మొదట్నుంచీ ఈ విషయానికి సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తోంది.
2011లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో.. సోషియో ఎకనమిక్ క్యాస్ట్ సెన్సెస్ (SECC) నిర్వహించారు. దాదాపు రూ.5వేల కోట్లు వెచ్చించి చేసిన సర్వేకు కనీస ప్లానింగ్ లేని కారణంగా.. మొత్తం తప్పుల తడకగా తయారైంది. ఈ సర్వే పూర్తి వివరాలను కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే వెల్లడించలేదు. కానీ సంక్షిప్తంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో 46 లక్షల కులాలున్నాయని తప్పుగా పేర్కొన్నారు. అయితే, ఈ సర్వేలో ఇలాంటి 8.19 కోట్ల తప్పులున్నాయని ఆ తర్వాత తెలిసింది. ఆ తర్వాత కూడా.. నాటి హోంమంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ.. తాము కులగణను జనగణనతో కాకుండా ప్రత్యేకంగా చేపడతామని పేర్కొన్నారు.
Also Read-
స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ప్రజలను మతం పేరుతో విడదీయడం అలవాటైన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కులం పేరుతో భారతీయ సమాజాన్ని విడదీసేలా కుట్రలు పన్నింది. కులగణను రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవాలని చూస్తోంది. కానీ బీజేపీ సామాజిక న్యాయం, పరిపాలనా సౌలభ్యం కోసం జనగణనతోపాటుగా కులగణన జరగాలని కోరుకుంది. ఇది ఇవాళ కేంద్రప్రభుత్వం సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు. 18 సెప్టెంబర్ 2024 నాడు.. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు మాట్లాడుతూ.. కులగణనపై సరైన సమయంలో అందరికీ తెలియజేస్తామని చెప్పారు. తదనుగుణంగానే.. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వెల్లడించింది.
