భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ : కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026లో మాట్లాడుతూ, బొగ్గు గ్యాసిఫికేషన్ భారతదేశ శక్తి భద్రతను బలోపేతం చేయడంలో, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంలో మరియు పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ప్రముఖ పరిశ్రమల నాయకులు, నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, పరిశోధకులు, విద్యార్థులు మరియు విధాన రూపకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. వికసిత భారత్ లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది. దేశంలో పరిశ్రమలు వేగంగా విస్తరించడంతో తయారీ రంగం బలపడుతోంది. జాతీయ రహదారులు, రైల్వే, పోర్టులు, డిజిటల్ కనెక్టివిటీ మరింత మెరుగయ్యాయి.

అంతర్జాతీయ సప్లయ్ చైన్లో భారత్ స్థానం మరింత బలపడుతోంది. దేశంలో పెరుగుతున్న ఎనర్జీ డిమాండ్ ను తీర్చడంలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ లో దాదాపు 400 బిలియన్ టన్నుల మేర బొగ్గు నిల్వలు ఉన్నాయి. దేశంలో 74 శాతం విద్యుత్ బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతోంది. 2024-25లో 1 బిలియన్ టన్నుల బొగ్గు డిమాండ్ ఉండగా, 2047 నాటికి ఇది 1.7 బిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉంది.
Also Read-
మరోవైపు, దేశంలో పర్యావరణ రక్షణ, సుస్థిరాభివృద్ధికి కూడా కట్టుబడి పనిచేస్తున్నాం. 2070 నాటికి సున్నా ఉద్గారాలు సాధించే లక్ష్యంతో, పునరుత్పాదక శక్తి ఉత్పత్తి విస్తరణపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. కోల్ గ్యాసిఫికేషన్ సాంకేతికత ద్వారా సిన్ గ్యాస్ తయారు చేసి, స్వచ్ఛమైన ఇంధనం, ఎరువులు, హైడ్రోజన్ తయారు చేసేందుకు ముందడుగు వేస్తున్నాం.

ప్రస్తుతం ముడి చమురులో దాదాపు 83%, సహజ వాయువులో 50%, అలాగే మిథనాల్, ఎరువుల్లో 90 శాతానికి పైగా దిగుమతులపై మన భారత్ ఆధారపడి ఉంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, సరఫరాలో అంతరాయాలు, ధరల్లో మార్పుల కారణంగా ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అయితే కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టి, దేశంలో ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తుంది.
2030 నాటికి 100 మిలియన్ టన్నుల మేర కోల్ గ్యాసిఫికేషన్ పూర్తి చేయాలనే సంకల్పంతో నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ ను ప్రారంభించాం. రూ.8,500 కోట్ల విలువై ఇన్సెంటివ్ పథకాన్ని అమల్లోకి తెచ్చాం. అంతేకాకుండా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. భూమి లోతుల్లో ఉన్న బొగ్గును వాడకంలోకి తీసుకొచ్చేందుకు వీలుగా అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ వంటి ఆధునిక సాంకేతికను కూడా వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
