హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (CSTD) ఆధ్వర్యంలో అకడమిక్ కౌన్సెలర్ల కోసం ఒక రోజు ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అయన మాట్లాడుతూ బోధనా రంగాల్లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అకడమిక్ కౌన్సెలర్లు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) లో ప్రావీణ్యం పొందడం, బోధనపై పూర్తి అవగాహన కలిగి ఉండటం, విద్యార్ధులకు అవసరమైన సరికొత్త పద్ధతులు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ మాజీ రెక్టార్ ఆచార్య వి. వెంకయ్య హాజరై ప్రసంగించారు. ఆన్లైన్ లో బోధనా పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆన్లైన్ బోధనలో నిడివి చాలా తక్కువగా ఉండేలా చూడాలని, అవసరమైన స్లైడ్స్ ను తయారు చేసుకోవడం వల్ల విద్యార్ధులను ఆకట్టుకోవచ్చని వివరించారు.
కార్యక్రమానికి సి.ఎస్.టి.డి డైరెక్టర్ ప్రొ. ఐ. ఆనంద్ పవార్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో సీ.ఎస్.టి.డి ఆధ్వర్యంలో అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి వివిధ అంశాలపై మరిన్ని శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శిక్షణా కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఆచార్యులు, అధ్యాపకులు రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ కళాశాలల అకడమిక్ కౌన్సెలర్లు పాల్గొన్నారు.