హైదరాబాద్ : ఐదవ విడత కవియాత్ర నిర్వహణా ప్రణాళిక కమిటీ సమావేశం హైదరాబాద్ లోని తెలుగు యునివర్సిటీలో జరిగింది. సమావేశంలో కవి యాత్ర విధి విధానాలు మరియు రూట్ మ్యాప్ పై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు యునివర్సిటీ ఉప సంచాలకులు అయినంపూడి శ్రీలక్ష్మి, కవి యాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్, తెలంగాణ రచయితల సంఘ జంటనగరాల శాఖ అధ్యక్షుడు కందుకూరి శ్రీరాములు, జర్నలిస్ట్, రచయిత, తెలంగాణ సమాచార్ (పోర్టల్) కే. రాజన్న, ప్రముఖ కవి బొందిడి పురుషోత్తమ్ రావు, యువ కళాకారుడు, కవి పోలీస్ భీమేశ్ పాల్గొన్నారు.
జనవరి నెలలో హైదరాబాద్ లో జరగబోయే కవియాత్రకు తెలుగు విశ్వవిద్యాలయం ఉప సంచాలకులు శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారు కవి యాత్ర కు సూచనలు అందించారు. ప్రస్తుతం సమాజ స్థితిగతులను గమనిస్తూ దిశా నిర్దేశనం చేయగలవారు కవులేనని కవులు కేవలం ప్రచ్ఛన్న శాసనకర్తలే కాదని ప్రజా పక్షపాతులు కూడానని అన్నారు.
ఈ సమావేశంలో అక్షర యాన్ తెలుగు వుమెన్ రైటర్స్ ఫౌండేషన్స్, తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల శాఖ , అభ్యుదయ రచయితల సంఘం, సాహితీ రస స్రవంతి, వికాస వేదిక, ధర్మకేతనం సాహిత్య కళాపీఠం తదితర సంఘాలు పాల్గొని కవియాత్రకు తమ సంఘీభావాన్ని తెలిపాయి. అలాగే తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ జూలూరి గౌరీ శంకర్, మరియు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ కవియాత్రకి వినూత్నమైన మరియు మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందనలు తెలిపారు.