ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి స్వామి వారికి తలంబ్రాలు సమర్పించారు.
హైదరాబాద్ : భద్రాద్రి శ్రీసీతారామ చంద్ర స్వామి వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా భద్రాచలం పట్టణంలో పలుచోట్ల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయడంతో పాటు స్వామి వారి ఆలయం, మిథిలా స్టేడియం, దాని పరిసరాలను వివిధ రకాల పూలు, మామిడి ఆకు తోరణాలు, కాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.వేలాది మంది భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య ఘనంగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాన్ని టీవీలు, సామాజిక మాధ్యమాలలో లక్షల మంది తిలకించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలు సీతారాముల వారికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతమ్మ వారికి సిరిసిల్ల నేత కార్మికులు ప్రత్యేకంగా నేసిన పట్టు చీరను ఈ సందర్భంగా అందజేయడం విశేషం.
ఈ కళ్యాణ బ్రహ్మోత్సవానికి హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం,లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, శ్రీత్రిదండి చినజీయర్ స్వామి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణా మండలి ఛైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, ఎమ్మెల్యేలు పోడెం వీరయ్య,కందాళ ఉపేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, ప్రముఖ వ్యాపారవేత్తలు వద్దిరాజు నిఖిల్ బాబు, వద్దిరాజు నాగరాజు బాబు,ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అధికార, అనధికార ప్రముఖులు సీతారాముల కళ్యాణానికి హాజరయ్యారు.
కళ్యాణం అనంతరం వేద పండితులు ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ పుణ్య దంపతులకు తలంబ్రాలు అందజేశారు.ఎంపీ వద్దిరాజు,ఆయన కుమారుడు నిఖిల్ బాబు సీతారామ చంద్రస్వామి వారి పల్లకీ మోశారు.