ఆరోగ్య సంరక్షణ రంగంలో ఔషధాల పాత్ర అందరు ఎరిగినదే! అట్టి ఔషధాల నిపుణులు ఫార్మసిస్ట్ లు. ప్రాణ రక్షకాలైన ఔషధాలను అందించే ఫార్మసిస్ట్ లను ఆరోగ్య రంగం పూచికపుల్ల వలె చులకనగా చూస్తున్నది. ఫార్మసిస్ట్ కావాలంటె ఫార్మసి కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు కలిగిన కాలెజ్ లో డిప్లొమా ఇన్ ఫార్మసి, బాచెలర్ ఆఫ్ ఫార్మసి లేదా డాక్టర్ ఆఫ్ ఫార్మసి పట్టా పొంది రాష్ట్ర ఫార్మసి కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకొన వలసి ఉంటది. ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలు దాటుకొని, కాలాన్ని వెచ్చించి, మేధస్సును మధించి, ప్రతిభతో పట్టాలు పొందిన ఫార్మసిస్ట్ లు నిరుద్యోగంతో బాధ పడుతున్నరు. ఉద్యోగం వచ్చినా వ్యవస్థాపరమైన అణచివేతకు గురై, ఆదరణకు నోచుకొనక క్రుంగి పోతున్నరు. ఔషధ ప్రయోక్తలైన ఫార్మసిస్ట్ ల ప్రాధాన్యత అందరు గుర్తించ వలసి ఉన్నది. ముఖ్యంగ రాజకీయ గుర్తింపు చాలా అవసరం.
మెడికల్ ప్రాక్టీషనర్ లు ఔషధాలు సూచిస్తే ఫార్మసిస్ట్ ల అవసరం లేకుండానే ఎబిసిడి లు వచ్చిన ఎవరైనా వాటిని ఈయ వచ్చునన్న తప్పుడు అభిప్రాయం నెలకొని ఉన్నది. కాని, ఫార్మసిస్ట్ ల పర్యవేక్షణ లేకుండా ఔషధ సూచన, వితరణ, వినియోగంలో జరిగే అవకతవకల వలన ప్రజలకు తీవ్రనష్టం జరుగుతున్నది. ఒక్కొక్కసారి ప్రాణహాని కూడా సంభవిస్తున్నది.
కనుక, ఫార్మసిస్ట్ లకు స్వయం ఉపాధిగా మెడికల్ స్టోర్స్ ప్రారంభించు కొనటానికి ఋణసౌకర్యం కల్పించి ప్రోత్సహించాలె. జీవన్ ధార, జన ఔషధి స్టోర్స్ కేటాయింపులలో ఫార్మసిస్ట్ లను మాత్రమే ఎంపిక చేయాలె. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను విస్తరించి ఫార్మసిస్ట్ లకు అందరికి అందించాలె. ఫార్మసిస్ట్ లను ప్రాథమిక చికిత్సకులుగ గుర్తించాలె. ఫార్మసిస్ట్ లకు సామాజిక భద్రత పథకాలలో చోటు కల్పించాలె. ప్రభుత్వ వైద్యరంగం సత్ఫలితాలు ఈయవలెనంటె వైద్యశాలలలో ఫార్మసిస్ట్ ల సంఖ్య పెంచి వారికి సముచిత స్థానం కల్పించాలె. అన్ని బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలలో ఫార్మసిస్ట్ లను నియమించాలె. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఫార్మసిస్ట్ లు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగ వారి సంఖ్యను పెంచాలె.
ఇది కూడా చదవండి
అన్ని వైద్యశాలలలో హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసి విభాగాలను ఏర్పరచి వాటికి అనుబంధంగ వార్డ్ ఫార్మసిస్ట్, ఐసియు ఫార్మసిస్ట్, డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్ లను నియమించాలె. అన్ని ఔషధశాలలు, వాక్సిన్ స్టోర్స్, రేడియో ఫార్మస్యూటికల్ స్టోర్స్, వెటరినరి స్టోర్స్ లో ఫార్మసిస్ట్ లను నియమించాలె. అన్ని ఆరోగ్య పథకాలలో ఫార్మసిస్ట్ లను నియమించి భాగస్వాములను చేయాలె. ఫార్మసిస్ట్ లకు సముచిత వేతనాలు, ప్రమోషన్ లు, ఇన్ సర్విస్ ఎడ్యుకేషన్ కల్పించాలె. బి ఫార్మ్ ప్రాక్టిస్ కోర్స్ ను వెంటనే ప్రారంభించి డిప్లొమా ఫార్మసిస్ట్ లను దశల వారీగ ఆ కోర్స్ కు పంపాలె. పబ్లిక్ హెల్త్ మానేజ్మెంట్ పిజి డిప్లొమాకు కూడా ఫార్మసిస్ట్ లను పంపాలె. ఆసక్తి గల ఫార్మసిస్ట్ లను మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, హెల్త్ ఎడ్యుకేటర్స్, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్స్, హెల్త్ ప్రోగ్రాం మానిటర్స్ గ తీసి కోవాలె. ఐసిడిఎస్, వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, సాంకేతిక విద్యాశాలలు, పోలిస్ శిక్షణా సంస్థలు, వివిధ శాఖల డిస్పెన్సరీలలో ఆరోగ్య పర్యవేక్షణ, ప్రాథమిక చికిత్స కోసం ఫార్మసిస్ట్ లను నియమించాలె.
ఉద్యోగాలు, ఉన్నత విద్యా రంగాలలో డి ఫార్మ్, బి ఫార్మ్, ఫార్మ్ డి అన్ని అర్హతలను చేర్చాలె. డ్రగ్ కంట్రోల్ శాఖలో ఇతర అధికారుల జోక్యం ఉండ కూడదు. అధికారులకు అంగరక్షకులను సమకూర్చాలె. బోధన, పరిశోధన రంగంలోని ఫార్మసిస్ట్ లకు విశ్వవిద్యాలయాలు, ఉన్నత సంస్థలలో సముచిత స్థానాలు కల్పించాలె. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ‘ఫార్మా సిటీ’ ప్రశంసనీయం. కాని, ప్రైవేట్ యాజమాన్యాలను, విదేశీ ఎగుమతులను దృష్టిలో ఉంచుకొని దాని రూపకల్పన జరిగింది. అందులో ఒక ప్రభుత్వ రంగ ఔషధ పరిశ్రమ నెలకొల్పితేనే దానికి సార్థకత. అదే విధంగ ఔత్సాహిక ఫార్మసిస్ట్ లకు స్టార్ట్ అప్ ప్రోత్సాహకాలు అందించాలె.
ప్రభుత్వం ఆరోగ్య రంగంలో విధాన నిర్ణయాలు తీసికొనటానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ను సంప్రతిస్తున్నట్లుగానే, ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ ను ఆహ్వానించి సూచనలను పరిగణన లోనికి తీసికోవాలె. ప్రభుత్వాలు ఫార్మసిస్ట్ లకు ఎప్పటికప్పుడు ఇస్తున్న హామీలు, ముఖ్యంగా 2018 జనవరిలో ఫార్మ్ డి విద్యార్థులకు ఇచ్చిన హామి అమలుకు నోచుకొనలేదు. అందుకే ఎన్నికల మానిఫెస్టోలలో ఫార్మసిస్ట్ ల అంశం చేర్చాలని ఫార్మసిస్ట్ లు అందరు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నరు. రాజకీయ పక్షాలు తమ అనుబంధ వైద్య విభాగాల పదవులలో ఫార్మసిస్ట్ లు ఉండే విధంగ శ్రద్ధ తీసి కోవాలని కోరుతున్నరు.
~ డాక్టర్ రాపోలు సత్యనారాయణ (9440163211)
(కో ఆర్డినేటర్, వర్కింగ్ గ్రూప్ ఆన్ ప్రొఫెషనల్ డిగ్నిటీ ఆఫ్ ఫార్మసిస్ట్స్)