హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన పీ విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచి బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఆయన అసంతృప్తిని అనుకూలంగా మల్చుకోడానికి బీజేపీ ప్రయత్నించినా చివరకు ఆయన గులాబీ గూటికి చేరడానికే సిద్ధమైనట్లు అనుచరులు పేర్కొన్నారు.
కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ఒక రోజులోనే ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో ఆదివారం రాత్రి కలుసుకున్నారు. ఇక లాంఛనంగా పార్టీలో చేరడమే తరువాయి అని ఒకటి రెండు రోజుల్లోనే గులాబి కండువా కప్పుకోనున్నారని గులాబీ వర్గాల సమాచారం.
జూబ్లీహిల్స్‌లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నా నిరాదరణే ఎదురైందని, దీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతున్నా పరిగణనలోకి తీసుకోలేదని, చివరకు క్రికెటర్ అజారుద్దీన్‌కు టికెట్ ఇవ్వడాన్ని విష్ణువర్ధన్ తప్పుపట్టారు. ఈ అసంతృప్తితోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బైటకొచ్చి బీఆర్ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకున్నారు. దానికి కొనసాగింపుగానే కేసీఆర్‌తో భేటీ కావడం చర్చనీయాంశం అయినది. (ఏజెన్సీలు)