హైదరాబాద్ : పదవ తరగతి పరీక్ష పత్రం లీక్ అయిన విషయంపై యూత్ కాంగ్రెస్, ఎన్. ఎస్.యు. ఐ అధ్యక్షులు శివసేనారెడ్డి, బలమూరి వెంకట్ ల నేతృత్వంలో సెకండరీ బోర్డ్ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఈ సందర్భంగా ఎస్ఎస్సి బోర్డ్ ను ద్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు ఉన్న చెట్టు కు టిఆర్ఎస్ దిష్టిబొమ్మలను ఉరి వేసి నిరసన వ్యక్తం చేశారు.
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని బర్తరఫ్ చేయాలని, ప్రభుత్వం ఈ విషయంలో విచారన జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్.
తక్షణమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్. తీవ్ర ఉద్రిక్తత కార్యాలయ బోర్డు, గేట్లు ధ్వంసం. కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం. ఎన్ఎస్ యుఐ, యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలింపు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
• రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు పేపర్ లికేజీ కావడం అత్యంత దురదృష్టకరం. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొంది. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోంది. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటు.
• ప్రభుత్వ చేతగానితనం విద్యార్థుల జీవితాలకు శాపంగా మారింది. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ లికేజీతో ప్రభుత్వ, చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
• టెక్నాలజీని పేపర్ లీకేజీ కోసం ఉపయోగించుకుంటున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. పేపర్ లికేజ్ కి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి.
• ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. టెన్త్ పరీక్షలు 90 శాతం సిలబస్ తో ఒకే పేపర్ గా పరీక్ష నిర్వహించడంవల్ల విద్యార్థుల్లో ఇప్పటికే ఒత్తిడి కన్పిస్తొంది. ఈ లికేజ్ ఘటనతో విద్యార్థుల్లో మరింత గంధరగోళం నెలకొంది.
• మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. విద్యార్థులంతా టెన్షన్ కు గురికాకుండా దైర్యంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలి.
• 10వ తరగతి తెలుగు పేపర్ లికేజీ పై న్యాయ నిపుణులతో చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఈ లికేజీ వెనకాల ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దు. బాద్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలి.
వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కావడంతో రాష్ట్రంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. రేపటి ఎగ్జామ్ యథావిథిగా సాగుతుందా..? ఈ రోజు రాసిన ఎగ్జామ్ వ్యాలిడ్ అవుతుందా? అన్న ప్రశ్నలు విద్యార్థులను సతమతమవుతున్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన నిమిషాల్లోనే వాట్సాపుల్లో లీకైన క్వశ్చన్ పేపర్ కేవలం మీడియా గ్రూపుల్లో మాత్రమే షేర్ అయింది.
నిందితుడు బందప్ప పలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినా.. అప్పటికే ఎగ్జామ్ ప్రారంభం కావడంతో ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. ఒకవేళ పరీక్ష ప్రారంభానికి ముందే ఈ ఘటన జరిగితే విద్యార్థులు బయపడినట్టుగానే ఎగ్జామ్ ను రద్దు చేయడం లాంటి ఘటనల్ని ఊహించొచ్చు. కానీ అలాంటివేం జరగలేదు. విద్యార్థులు పరీక్షా హాలులోకి వెళ్లిన తర్వాతే పేపర్ లీకైంది. అంటే క్వశ్చన్ పేపర్ ఏ ఒక్క విద్యార్థికీ చేరలేదు.
పరీక్ష ప్రశ్నా పత్రాన్న్ని వాట్సాప్ గ్రూపుల్లో బందప్ప షేర్ చేసినప్పటికీ.. అవి విద్యార్థులకు చేరనందున రేపటి ఎగ్జామ్ పై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. యథావిథిగానే మిగతా ఎగ్జామ్ ను కండక్ట్ చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ రోజు రాసిన ఎగ్జామ్ కూడా వ్యాలిడ్ అవుతుందని విద్యార్థులు గమనించాలి.
వికారాబాద్ జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన ఘటనపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రశ్నాపత్రాన్ని బయటకు పంపిన ఉపాధ్యాయుడు బందప్ప, మరో ఇన్విజిలేటర్ సమ్మప్ప, చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ గోపాల్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రకటించారు.
కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం తెలుగు పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాల్లోనే ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. తాండూరు లోని ప్రభుత్వ పాఠశాల-1 నుంచి బయటకు వచ్చినట్లు నిర్ధారించామని తెలిపారు. ఆ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు బందెప్ప వాట్సాప్ నుంచి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఆ ప్రశ్నాపత్రాన్ని ఓ ప్రయివేటు పాఠశాలలో పని చేస్తున్న టీచర్‌కు బందెప్ప పంపినట్లు పోలీసులు నిర్ధారించినట్లు పేర్కొన్నారు.
రేపటి పదో తరగతి పరీక్ష వాయిదా పడలేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. రేపట్నుంచి ఈ నెల 13వ తేదీ వరకు అన్ని పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. (ఏజెన్సీలు)