రైతు సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రజాదరణ పొందుతుంది
నాయకులు, కార్యకర్తలు ప్రతి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండాలి
అభివృద్ధి, సంక్షేమ ప్రథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి
బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయానికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిశానిర్ధేశం
నిర్మల్ : సీయం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా ఆదర్శనీయ పథకాలు, అద్భుత సంస్కరణలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో తొమ్మిదేండ్లలోనే దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలోని ఓ పంక్షన్ హాల్ లో మంగళవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సమ్మేళనంలో ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ….. 75 ఏండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ వచ్చాక, రాకముందు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నికల మ్యానిఫెస్టోతో సంబంధం లేకుండా సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు.
ఆసరా పెన్షన్లను భారీగా పెంచారు. ఎవరూ అడుగని రైతుబంధు,రైతు బీమా నుంచి గీత, చేనేత కార్మికులకు పింఛన్లు, రజక, నాయీబ్రాహ్మణ దుకాణాలకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు సన్న బియ్యం, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి ఇలా ఎన్నో పథకాలు ప్రజలకు అందుతున్నాయి. వృత్తుల వారీగా కూడా ఆర్థిక భరోసా కల్పించేందుకు గొర్రెలు, చేప పిల్లల పంపిణీ వంటి వినూత్న పథకాలు అమలులో ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆయా విభాగాల ద్వారా ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాంతో గతంలో ఎన్నడూ లేనంతటి ఆర్థిక భరోసా ప్రజల్లో కనిపిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పల్లెలు, పట్టణాల్లో ఎంతో మార్పు వచ్చింది. ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాడు తాగునీటికి నానా తంటాలు పడితే, నేడు ఇంటింటికీ సరిపడా తాగునీరు సరఫరా అవుతున్నది. హరితహారంలో భాగంగా ఏ రోడ్డు చూసినా పచ్చని తోరణాల్లా మొక్కలు దర్శనమిస్తున్నాయి.
ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా మారిందని గుర్తు చేశారు. సీయం కేసీఆర్ నేతృత్వంలో 60 లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రజాదరణ పొందుతుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను భారీ మోజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నాయకులు, కార్యకర్తలు ప్రతి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ… సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఈ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ వెళ్లి తెలియజేయాలి.