కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 2వేల మందికి తక్షణమే జీవనోపాధులు
ఈ ఏడాది అక్టోబర్ లోగా దశలవారీగా నియామకాలు
సచివాలయంలో సంబంధిత అధికారులు, టెక్స్ టైల్ పార్క్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
హైదరాబాద్: సమీప భవిష్యత్తులో వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ లో దాదాపు 20వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలున్నాయని, అందులో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 2వేల మందికి తక్షణమే జీవనోపాధులు లభించనున్నాయని, వీటిని దశల వారీగా ఈ ఏడాది అక్టోబర్ లోగా అందే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన పేషీలో సంబంధిత అధికారులు, టెక్స్ టైల్ పార్క్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి గురువారం సమీక్షించారు.
కొత్తగా వరంగల్ లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్‌టైల్ పార్క్ లో అనేక కంపెనీలు వచ్చాయని, ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఇప్పటికే ఆయా కంపెనీలు ప్రాథమిక స్థాయిలో తమకు అవసరమైన ఉద్యోగులను నియమించుకున్నాయని, మరికొంత మందికి ఉపాధి కల్పించాయని తెలిపారు. అయితే, కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మంచి అవకాశాలున్నాయని తెలిసి, పాలకుర్తి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే రెండు విడతలుగా 1 వెయ్యి మందికి శిక్షణ పూర్తి చేశామని, మరో 2 వేల మందికి శిక్షణ జరుగుతుందని తెలిపారు.
సెప్టెంబర్ కల్లా ఈ శిక్షణ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ నెలకల్లా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళల్లో అర్హులైన వాళ్లకు వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ లో దశల వారీగా ఉద్యోగావకాశాలు లభించే విధంగా చేస్తామన్నారు. ఇదే విషయమై ఆయా కంపెనీల బాధ్యులు, అధికారులతో కలిపి సమీక్షించామని మంత్రి తెలిపారు. కుట్టులో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కంపెనీలు కూడా ముందకు వచ్చాయమని మంత్రి తెలిపారు. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వ పాఠశాలల యూనిఫార్మ్స్
మరోవైపు కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ పరంగా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గురుకుల పాఠశాలలు, హాస్టల్స్ విద్యార్థినీ విద్యార్థులకు యూనిఫామ్స్ వంటి ఆర్డర్లు కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు అప్పగించేందుకు ఆయా ప్రభుత్వ శాఖలకు లేఖలు రాస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
ఈ సమీక్ష సమావేశంలో టిఎస్ ఐఐసీ ఎండి ఈవీ నర్సింహారెడ్డి, టెక్స్ టైల్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ మిహిద్, టెక్స్ టైల్స్ అడిషనల్ డైరెక్టర్ వెంకటేశం, వరంగల్ లోని కీ టెక్స్ కంపెనీ ప్రతినిధి మనోజ్ కుమార్, యంగ్ వన్ కంపెనీ ప్రతినిధి శ్రీకాంత్, తదితరులు హాజరయ్యారు.