యాదగిరిగుట్ట: ఇల వైకుంఠ పురంగా యాదాద్రి వెలిసిందని, సీఎం కెసిఆర్ గారి కృషి వల్ల భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తిరుమల తిరుపతి ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని, సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని అన్నారు.
ఈ రోజు అమెరికా నుండి హైదరాబాద్ వచ్చిన మంత్రి, ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా, తమ సతీమణి శ్రీమతి ఉషా దయాకర్ రావుతో కలిసి యాదగిరిగుట్ట కి చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ, చరిత్రలో న భూతో న భవిష్యత్తు అన్న చందంగా సీఎం కేసీఆర్ గారు యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించారని చెప్పారు. దేవాలయం మొత్తం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుతంగా ఉందని, నిర్మాణ కౌశలం భక్తి పారవశ్యం పొంగి పొరలే విధంగా జరిగిందని మంత్రి చెప్పారు.
కెసిఆర్ సీఎం గా వచ్చిన తర్వాతే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ గారి కుటుంబం బాగుండాలని, ఆయన తలపెట్టిన కార్యక్రమాలు అన్ని విజయవంతం కావాలని నరసింహ స్వామి ని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు. మంత్రి వెంట వారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.