హైదరాబాద్: మెట్రో రెండో దశ కింద మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో లైన్ ఏర్పాటు కానుంది.ఈ నేపథ్యంలో కేంద్రం సహకరించకున్నా మెట్రో ఆగొద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రోను రూ. 6,250 కోట్లతో నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వచ్చే మూడేళ్లలో ఎయిర్‌పోర్ట్ మెట్రో పూర్తవుతుందని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.
27.5 కి.మీ ఎలివేటెడ్ కారిడార్‌లో, మెట్రో బయో డైవర్సిటీపై రెండు ఫ్లైఓవర్‌ల మీదుగా వెళుతుంది. విమానాశ్రయానికి సమీపంలో 2.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం భూగర్భంలోకి వెళ్లనుంది. మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇది గరిష్టంగా 120 కి.మీ వేగంతో నడుస్తుందని తెలిపారు. 31 కిలోమీటర్ల దూరాన్ని 26 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు.
రద్దీ సమయాల్లో ప్రతి 8 నిమిషాలకు మరియు రద్దీ లేని సమయంలో ప్రతి 20 నిమిషాలకు ఒక రైలు విమానాశ్రయానికి నడుస్తుంది. భవిష్యత్తులో, ప్రతి 2.5 నిమిషాల నుండి 5 నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది. రాయదుర్గం స్టేషన్‌లోనే చెక్‌ఇన్, లగేజీ చెక్‌ఇన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు 31.50 కోట్ల మంది మెట్రోలో ప్రయాణించారని తెలిపారు. మెట్రో ద్వారా 9.2 కోట్ల లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అయింది. మెట్రో రెండో దశ డీపీఆర్‌ను కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే బీహెచ్‌ఈఎల్-లడ్కీపూల్ మెట్రో పనులు ప్రారంభిస్తామన్నారు.