హైదరాబాద్ : సమాజాన్ని కులమతాల పేరుతో విభజించడం భావ్యం కాదని, పాత్రికేయులుగా గొప్ప విలువలతో నార్ల జీవించారని సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్ పేర్కొన్నారు. నార్ల జయంతిని పురస్కరించుకొని డా. బి. ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన స్మారకోపన్యాసం చేశారు.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టంకశాల అశోక్ “మార్గదర్శి నార్ల వెంకటేశ్వర రావు” అనే అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ నార్ల పట్టుదల, విలువలతో కూడిన పాత్రికేయులుగా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచారు అని పేర్కొన్నారు. మూడు పదుల వయస్సులోనే నార్ల అంతర్జాతీయ పరిణామాలపైన వ్యాసాలు, పుస్తకాలు రాశారని గుర్తు చేశారు. నార్ల ఏ అంశం గురించి అయినా వ్యాసం రాయాలి అన్నా, పుస్తకం ప్రచురించాలి అన్నా చాలా పరిశోధన చేసేవారు అని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువ జర్నలిస్ట్ లలో విషయ పరిజ్ఞానం కోసం, లోతుగా అధ్యయనం చేయడం లోపిస్తుందని ఇది సమాజానికి మంచి చేయదు అన్నారు. ఒక మంచి జర్నలిస్ట్ గా గుర్తింపు రావాలి అంటే సమాజంలో ఉన్న సమస్యలను పారద్రోలడానికి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె సీతా రామారావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో నార్ల లాంటి పాత్రికేయులు సమాజానికి చాలా అవసరం అన్నారు. విలువలతో కూడిన పాత్రికేయం ఆదర్శంగా నిలుస్తుందని, నార్ల కుటుంబ సభ్యులు ఆయన రాసిన, సేకరించిన పుస్తకాలను అంబేద్కర్ విశ్వవిద్యాలయ లైబ్రరీకి అందించడం గర్వకారణంగా పేర్కొన్నారు. నార్ల లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలను త్వరలోనే డిజిటలైజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి కార్యక్రమ ఆవశ్యకత గురించి, ప్రధాన వక్త టంకశాల అశోక్ గురించి సభకు పరిచయం చేశారు. రిజిస్ట్రార్ డా. ఎ. వి. ఎన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని నార్లగారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో జి. ఆర్. సీ. ఆర్ & డీ డైరెక్టర్, ప్రొ. ఇ. సుధా రాణి; ఈ. ఎం. ఆర్ & ఆర్. సీ డైరెక్టర్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సి.ఎస్.టి.డి డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్; పుస్తకాల ప్రచురణల విభాగ డైరెక్టర్ ప్రొ. గుంటి రవి, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి డా. పరాంకుశం వెంకట రమణ, ఉద్యోగ సంఘాల నాయకులు, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు.