హైదరాబాద్: ‘సర్వేజన సుఖినోభవంతు’ అనే లోకహితంతో ప్రతి జిల్లాలో 45 రోజుల పాటు ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన శ్రీరామ్ విజయోత్సవ యాత్రకు ఈ నెల 7వ తేదీన పాలకుర్తిలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రావాలని ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ నెస్) ప్రతినిధులు నేడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని హైదరాబాద్, మంత్రి నివాసంలో కలిసి ఆహ్వానించారు.
ఈ నెల 4వ తేదీన ఈ యాత్ర ప్రారంభోత్సవానికి శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి గారు శంషాబాద్ వద్ద హారతి ఇస్తారని, రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ హరీష్ రావుగారు యాత్రను హైదరాబాద్ లోని హైదర్ నగర్ నుంచి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. పాలకుర్తికి ఈ యాత్ర 7వ తేదీన చేరుతుందని, 8వ తేదీ వరకు యాత్ర కార్యక్రమాలుంటాయని, ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుగారు ముఖ్య అతిధిగా వ్యవహరించాలని కోరారు.
ఇస్కాన్ వారి శ్రీరామ్ విజయోత్సవ యాత్ర రోజు కచ్చితంగా పాలకుర్తిలో ఉండి, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటానని, పాలకుర్తి ప్రజల శ్రేయస్సు కోసం జరిపే కార్యక్రమాలలో తన వంతు పాత్ర పోషిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తెలిపారు.