హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను విచారించేందుకు సీబీఐ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ నెల 6న అంటే మంగళవారం విచారిస్తామని సీబీఐ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సీబీఐకి MLC కవిత లేఖ రాశారు. లేఖ లో కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీని, దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని తనకు అందజేయాలంటూ సీబీఐ అధికారి అలోక్‌కుమార్ షాహిని కోరారు. నివాసంలో విచారణకు హాజరవుతానని చెప్పిన కవిత సీబీఐకి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు విచారణ కోసం మరో తేదీ ఫిక్స్ చేయాలని కోరింది.
ఈ రోజు సీబీఐకి కవిత మెయిల్ పంపారు. రేపు విచారణకు అందుబాటులో ఉండలేనని సీబీఐకి స్పష్టం చేశారు. అలాగే 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానని సీబీఐకి తెపారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, తాను చెప్పిన తేదీల్లో ఎప్పుడైనా సీబీఐ రావొచ్చని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని కవిత తెలిపారు. 7న జగిత్యాలలో సీఎం సభ ఏర్పాట్ల కోసం.. రేపు జగిత్యాల జిల్లాకు వెళ్లనున్నారు.
6న విచారణ తేదీని ఫిక్స్ చేసిన నేపథ్యంలో సీబీఐ రిప్లైపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు సీబీఐ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్‌లో కవిత పాత్రపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంస్థలు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమెను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద దర్యాప్తు అధికారి అలోక్ కుమార్ షాహి కవితకు నోటీసులు జారీ చేశారు. 6వ తేదీన విచారిస్తామని అందులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి సోమవారం సాయంత్రం నలుగురు అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. దింతో తెలంగాణలో టెన్షన్ నెలకొంది. (Agencies)