హైదరాబాద్ : నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకున్నది. నెల్లూరు జిల్లాలో ఇదేం కర్మరా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు.. కందుకూరులో రోడ్ షోలో పాల్గొన్నారు. అయితే ఈ రోడ్ షోకు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


చంద్రబాబు ప్రసంగం మొదలైన కొద్దిసేపటికే గందరగోళం నెలకొంది. సభలో తొక్కిసలాట జరగడంతో ఎనిమిది మృతి చెందారు. మరికొందరు పక్కనే ఉన్న కాలువలో పడిపోయారు. ఈ ఊహించని పరిణామంతో చంద్రబాబు రోడ్ షో మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. బాధితులను పరామర్శించారు.


ఈ తోపులాటలో సుమారు పది మంది కార్యకర్తలు ఒక్కసారిగా పెద్ద కాలువలో పడిపోయారు. ఈ క్రమంలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారని చెబుతున్నారు. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారని తెలుస్తోంది. ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు విద్యాసంస్థల్లో చదివిపిస్తామని హామీ ఇచ్చారు. తోపులాట నేపథ్యంలో సభను రద్దు చేసుకున్నారు. బహిరంగ సభను సంతాప సభగా ప్రకటించారు. సంతాపంగా మృతులకు రెండు నిమిషాలు మౌనం ప్రకటించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.

మృతుల్ని గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం చినకొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెంకు చెందిన కాకుమాని రాజాగా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. (Agencies)

