దేశ రాజకీయాల్లో పాలనలో గుణాత్మక మార్పు కోసం.. బీఆర్ఎస్ ఆవిర్భావం..
జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్న బి అర్ ఎస్ అధినేత సీఎం కేసిఆర్..
పాల్గొననున్న జాతీయ నేతలు మేధావులు రైతు సంఘాల నాయకులు..
దేశ రాజధాని హస్తినలో గులాబీ జెండా రెప రెపలు..
దేశానికి దిక్సూచిగా నిలువనున్న..తెలంగాణ అస్మిత..
దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి, దేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నేడు దేశమంతటా బీఆర్ఎస్ పార్టీ పైనే చర్చ జరుగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి, స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీగా మార్చాల్సిన అనివార్య చారిత్రక సందర్భంలో భారత రాజకీయ యవనికపై కేసీఆర్ మార్కు రాజకీయాలను చూడబోతున్నాం.
భారత రాజ్యాంగ నిర్మాతలు మన దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా నిర్వచించారు. రాష్ట్రాలకు, కేంద్రానికి శాసన పరిపాలనా ఆర్థిక అధికారాలు ఉండేలా చట్టాలను రూపకల్పన చేశారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడడం, కరెన్సీ, విదేశీ వ్యవహారాల వంటి అంశాలు కేంద్రం పరిధిలోనివిగా గుర్తించారు. అధికారాలకు సంబంధించి, కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాను రూపొందించారు. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల మీద అంతిమ నిర్ణయాధికారం కేంద్రానిదే. రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ వంటి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే. అత్యవసర పరిస్థితి వంటి విచాక్షణాదికారం కేంద్రానిదే. అయితే, కొన్ని అత్యవసర బాధ్యతలను తనవద్ద ఉంచుకొని, మిగతా అంశాలను రాష్ట్రాలకు అప్పగించాల్సిన కేంద్రం.. అన్నింటినీ తనవద్దే ఉంచుకొని రాష్ట్రాల హక్కులను హరిస్తూ, పెత్తనం చెలాయిస్తున్నది.
భారత దేశాన్ని 75 సంవత్సరాల్లో 70 ఏళ్లు కాంగ్రెస్, బిజెపి పార్టీలే పాలించాయి. ఈ రెండు పార్టీలు సమాఖ్య స్ఫూర్తిని కాపాడడంలోనూ, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడంలోనూ దారుణంగా విఫలమయ్యాయి. యూనియన్ ఆఫ్ స్టేట్స్ ను యూనిటరీ స్టేట్ గా మార్చాయి. దీంతో రాష్ట్రాలు వాటి స్వయం ప్రతిపత్తిని కోల్పోయి కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ రెండు పార్టీలు కూడా ‘‘బలహీన మైన రాష్ట్రాలు – బలమైన కేంద్రం’’ అనే ఎజెండానే అమలు చేశాయి. ఫలితంగా దేశంలోని వివిధ ప్రాంతాలు తమ అస్తిత్వ రక్షణ కోసం ప్రాంతీయ రాజకీయ శక్తులను ఆశ్రయిస్తున్నాయి. దీంతో దేశంలో చాలాచోట్ల ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి. దేశ రాజకీయాల్లో ఇక సంకీర్ణ శకం ప్రారంభం కానుంది.
దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల 70 ఏండ్ల పాలన ఫలితంగా నేడు ప్రజలు కనీస వసతులలేమితో కటకటలాడుతున్నారు. ఈరోజుకూ దేశంలో విద్యుదీకరణకు నోచుకోని గ్రామాలెన్నో ఉన్నాయి. మంచినీరు, రహదారులు, విద్యుత్ లాంటి సౌకర్యాలు లేని గ్రామాలు, ఆవాస ప్రాంతాలు వేల సంఖ్యలో ఉన్నాయి. భారతదేశంతోపాటు, ఆ తర్వాత స్వతంత్రం పొందిన అనేక దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతుండగా, భారతదేశంలో ఇంకా పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, సామాజిక రుగ్మతలు కొనసాగుతున్నాయి.
దేశంలో 70 వేల టి.ఎం.సి.ల నీటి లభ్యత ఉంది. ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా భారతదేశంలో సాగుభూమి విస్తీర్ణం 41 కోట్ల ఎకరాలు మాత్రమే ఉంది. ప్రతి ఎకరానికి కావలసినంత నీరు ఉన్నప్పటికీ, కేంద్రం ప్రణాళికా లోపంతో సాగునీరందడం లేదు. సరిపడా జల సంపద ఉన్నా దేశ ప్రజలు మాత్రం తాగునీటి కోసం, సాగు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. దేశంలో నీటి యుద్ధాలు చెలరేగే పరిస్థితి ఉత్పన్నం కావడానికి కాంగ్రెస్, బిజెపిల అసమర్థ పరిపాలనే కారణం. దేశాన్నేలిన ఈ రెండు పార్టీలూ ఆఖరికి దేశంలో ఉత్తర, దక్షిణ వివాదాలు, విభేదాలు చోటు చేసుకునే స్థాయికి పరిస్థితిని దిగజార్చాయి. మరోవైపు మన దేశంతోపాటే ప్రయాణం ప్రారంభించిన చైనా.. అభివృద్ధి విషయంలో మనం మరో 50 ఏళ్లకు కూడా అందుకోలేనంత ఎత్తుకు చేరుకున్నది. ఎన్నో దేశాలు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మనం మాత్రం ఇంకా కుల, మత ఘర్షణలతో కాలం వెల్లదీస్తున్నాం.
విదేశీ సంస్థలన్నీ భారత్‌కే రావాలి.. మా దేశంలో వ్యాపారం అంటే ఇక్కడే తయారు చేయాలి.. చైనా ఉత్పత్తులను తగ్గించుకుందాం.. మేక్ ఇన్ ఇండియా, స్వావలంబన భారతమే లక్ష్యమంటూ ఊదరగొట్టే మోదీ సర్కారు.. చేతల్లో మాత్రం ఆ లక్ష్యశుద్ధిని చూపడం లేదు. ‘మేక్ ఇన్ ఇండియా’కు తూట్లు పొడుస్తూ దిగుమతుల్ని పెంచుకుంటూపోతున్నది. మోదీ హయాంలోనే చైనాతో భారత్ వాణిజ్యం భారీగా పెరుగుతున్నది. ఇప్పటికీ చైనా దిగుమతులపైనే మనం ఆధారపడే దుస్థితి ఉంది. చెప్పుల నుంచి మొదలుకొని.. ఇనుము-ఉక్కు వస్తువులు, రాగి, న్యూక్లియర్ రియాక్టర్స్, జంతు కొవ్వులు-వెజిటబుల్ కొవ్వులు, మినరల్ ఇంధనాలు, ఎలక్ట్రికల్, మెకానికల్ మెషినరీ, పారిశ్రామిక రసాయనాలు, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఆటో కంపోనెంట్స్ దాకా మనం చైనాపై ఆధారపడే దుస్థితి.
2021లో భారత్-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం రూ.10,42,480 కోట్లు (125 బిలియన్ డాలర్లు) ఉన్న విషయాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది. గత ఐదేండ్లలో చైనా నుంచి భారత్‌కు దిగుమతులు 30 శాతం పెరిగినట్టు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. కేంద్రం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాలు, అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరే దీనికి కారణమంటూ ఆర్థిక నిపుణులు అంటున్నారు. విదేశాలపై ఆధారపడే దుస్థితి మారాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ గారు భావిస్తున్నారు.
భారతదేశానికి ఉన్న అద్భుతమైన జల వనరులు, సాగు భూమి, సమ శీతోష్ణ వాతావరణం ఈ ప్రపంచంలో మరే దేశానికీ లేదు. మనకున్న వసతులకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ చైన్ దేశంగా ఇండియా మారాల్సి ఉండె. మన దేశంలోని మానవ వనరులను వాడుకోలేక పోతున్నం. అద్భుతమైన యువ సంపత్తి నిర్వీర్యమై పోతున్నది. యువతను మతోన్మాదులుగా మార్చే కుట్రలు జరుగుతున్నయి. దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. దేశంలో భావజాల వ్యాప్తిని, దేశ ప్రజలను చైతన్యం చేయాల్సి ఉంది. 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉండి, 70 వేల టీఎంసీల నీటి వనరులుండి, రైతుల ధర్నాలు ఇంకెంత కాలం? ఆకలి ఇండెక్సులో మనం ఎందుకు ముందు వరుసలో ఉన్నాం? ఎన్నో ఉద్యమాలు వచ్చినా ఈ దేశంలో పరిస్థితి ఎందుకు మారడం లేదు? ’’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గారు ఎంతగానో ఆవేదన చెందుతున్నారు. సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురై వెనుకబడిన తెలంగాణ ప్రాంతాన్నే, కేవలం 8 ఏండ్ల స్వల్పకాలంలోనే ఎంతో గొప్పగా మనం అభివృద్ధి చేసుకొని, దేశానికే మోడల్ గా నిలుస్తున్నపుడు.. రత్నగర్భ అయిన భారతదేశాన్ని ఇంకెంతో గొప్పగా అభివృద్ధి చేసుకోగలం.. అని కేసీఆర్ గారు భావిస్తున్నారు.
ఇన్నాళ్ళు పాలించిన కేంద్ర పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ, ఈ దేశ సమగ్రాభివృద్ధికి, అనేక రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించడం కోసం జాతీయ విధానాలు రూపొందించాల్సిన అవసరముంది. వ్యవసాయాధారిత భారతదేశంలో వ్యవసాయరంగం రోజురోజుకీ నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ దేశానికి నూతన వ్యవసాయ విధానం (New Agriculture Policy) అవసరమున్నది.
అదనపు నీటి వనరులున్నా నీటి కోసం యుద్ధాలను, కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు, కర్నాటక వంటి సహచర రాష్ట్రాలు చేస్తున్న యుద్ధాలను చక్కదిద్దాల్సి ఉన్నది. ట్రిబ్యునల్స్ పేరుతో వీటిని కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి బాగు చేయాల్సి ఉన్నది. ఇందుకోసం ఈ దేశానికి నూతన జలవనరుల పాలసీ (New Water Policy) కావాలి.
ఈ దేశంలో లక్షలాది మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునే ప్రకృతి వనరులున్నయి. అయినా పల్లె పల్లెకూ విద్యుత్ అందించుకోలేక పోవడాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. అందుకు నూతన విద్యుత్ పాలసీ (New Power Policy) కావాలి.
ఆర్థికంగా ఉజ్వలమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నా విదేశీ మారక నిల్వలు ఎందుకు తరిగిపోతున్నాయి. డాలర్ ముందు మన రూపాయి విలువ ఎందుకు వెలవెలబోతున్నది. అందుకోసం నూతన ఆర్ధిక విధానం (New Economic Policy) కావాలి.
ఈ దేశంలో అద్భుతమైన ప్రకృతి సంపద ఉన్నా.. పచ్చదనానికి కొరత ఎందుకున్నది. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో నూతన పర్యావరణ పాలసీ (New Environmental policy) తేవాల్సి ఉన్నది.
ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో సమన్యాయం, సామాజిక న్యాయం ఇంకా జరగడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలకు అభివృద్ధి ఫలాలను ఈ దేశ పాలకులు అందించలేకపోతున్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం తెలంగాణ అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తితో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నూతన విధానం (weaker section upliftment policy) తేవాల్సిన అవసరం ఉన్నది.
దేశ జనాభాలో 50శాతం ఉన్న మహిళలను అనేకరకాలుగా వివక్షకు గురిచేస్తూ, దేశ అభివృద్ధిని కుంటుపడేలా చేస్తున్న విధానాలను సమీక్షించుకోవాల్సి ఉన్నది. దేశ ప్రగతిలో మహిళలను మరింత భాగస్వాములను చేసే దిశగా మహిళా సాధికారత విధానం (women empowerment policy) తేవాల్సి ఉంది. అంతే కాకుండా, విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధి పరచడానికి ప్రగతికాముక విధానాలను రూపొందించాల్సి ఉంది.. అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
‘‘ఈ దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి. సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లాలి. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలి. రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండానే వాటి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలను కేంద్రం ఏకపక్షంగా తీసుకుని రుద్దడం వల్ల ఆయా రాష్ట్రాల్లో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి విఘాతం కలుగుతున్నది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలలో కేంద్రానికి మితిమీరిన ఆజమాయిషీ ఎందుకుండాలి? అని మనం వేస్తున్న ప్రశ్నల మీదే ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
ఆయా రాష్ట్రాల భౌగోళిక భిన్నత్వం, సాంస్కృతిక ప్రత్యేకతలు, స్థానిక అవసరాలు, సామాజిక కూర్పు ఆధారంగా రాష్ట్రాలు తీసుకోవాల్సిన నిర్ణయాలను, రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రమే తీసుకోవడం వల్ల రాష్ట్రాల నిర్దిష్ట అవసరాలకు, ప్రయోజనాలకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు మధ్య పొంతన లేకుండా పోతోంది. దీంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. దేశ విశాల ప్రయోజనాల కోసం కాకుండా కేంద్ర ప్రభుత్వాలు తమ చిల్లర మల్లర ప్రయోజనాలకోసం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆయా రాష్ట్రాల అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారుతున్నాయి అందుకే ఈ దేశ రాజకీయ ప్రక్రియలో ఒక గుణాత్మక మార్పు అనివార్యం.’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు భావించారు.
దీనికోసం ఒక జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందడుగు వేశారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్నది కేవలం శుష్కమైన రాజకీయ కూటమిని కాదు. ఒక ప్రత్యామ్నాయ సిద్దాంతాన్ని. దేశవ్యాప్త ఉద్యమాన్ని వారు ప్రతిపాదిస్తున్నారు. కలిసివచ్చే శక్తులన్నిటినీ కలుపుకొని ప్రజాస్వామ్యయుతంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనుభవం ఉంది. ఆ అనుభవం పునాదిగా దేశంలో గుణాత్మక మార్పును సాధించడానికే నేడు సీఎం కేసీఆర్ నడుంకట్టారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ పార్టీని ఏర్పాటు చేశారు.
తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం 14 ఏండ్ల పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి, విజయం సాధించిన కేసీఆర్.. ముఖ్యమంత్రిగా కూడా విజయవంతమయ్యారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అన్నిరంగాల సర్వతోముఖాభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతున్నది. అటు ఉద్యమం చేయడంలోనూ, ఇటు పరిపాలన చేయడంలోనూ విజయవంతమైన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా తప్పక ఫలిస్తాయని పలు రాష్ట్రాలకు చెందిన నాయకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, జర్నలిస్టులు అభిప్రాయపడుతూ పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. పలువురు జాతీయ నాయకులు కూడా సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు, కేసీఆర్ ప్రయత్నాలకు తమ సహకారం ఉంటుందన్నారు.
జాతీయ రాజకీయాల్లోకి రావాలనే సీఎం కేసీఆర్ ఆలోచన ఈనాటిది కాదు. నాలుగున్నరేళ్ల క్రితమే 2018 మార్చి 3న హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరాన్ని చెప్పారు. అవసరమైతే తానే ఈ మార్పు కోసం ప్రయత్నిస్తానని, జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానని ఆనాడే ప్రకటించారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, దేశవ్యాప్తంగా మద్దతు కూడగడతానని ప్రకటించారు. ప్రజలను ఏకం చేస్తానని చెప్పారు. తదనుగుణంగానే 2022 అక్టోబర్ 5న సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీని ఏర్పాటు చేశారు.
జాతీయ రాజకీయాల్లో పాల్గొనాలనే కేసీఆర్ నిర్ణయాన్ని టిఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. రాష్ట్ర ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ కు మద్దతుగా నిలిచారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాలని, ఆ మార్పు తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలవుతుందని కేసీఆర్ జాతీయపార్టీ ఏర్పాటు సందర్భంగా ప్రకటించారు.
‘‘ప్రజలను గెలిపిస్తం, ప్రగతిని సాధిస్తం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం.. ఇక దేశాన్ని బాగుచేసుకుందాం. గెలవాల్సింది ప్రజలు.. రాజకీయ పార్టీలు కాదు. జాతీయ పార్టీపై ఆషామాషీగా నిర్ణయం తీసుకోలేదు. ఎందరో నాయకులు, అన్ని వర్గాలవారు కలిసి వస్తున్నారు. దళిత, రైతు, గిరిజన ఉద్యమాలే ప్రధాన ఎజెండా. సామాజిక రుగ్మతలపై తీవ్రంగా పోరాడుతాం. ఇదే కారు గుర్తు.. ఇదే గులాబీ జెండా ఉంటది. తెలంగాణ కార్యక్షేత్రంగా భారత్ అభివృద్ధి చెందుతుంది’’ అని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం కూడా చేశారు. ఈ తీర్మానాన్ని ఢిల్లీలోని ఎన్నికల సంఘానికి కూడా పంపించగా, డిసెంబర్ 8న "తెలంగాణ రాష్ట్ర సమితి" పార్టీ పేరును "భారత్ రాష్ట్ర సమితి" పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించడంతో బీఆర్ఎస్ కు రాజముద్ర పడినట్లయింది.
“భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం
2022 డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమాన్ని బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ భవన్లో అట్టహాసంగా నిర్వహించారు. జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీసిన బిఆర్ఎస్ పార్టీ గుణాత్మక జాతీయ విధానాలు, పలువురు రాజకీయ వేత్తలను, మేథావులను ఆకర్షిస్తున్నవి. ఇవాళ పరిసర రాష్ట్రాలన్నీ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వైపే చూస్తున్నాయి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని దేశవ్యాప్తం చేయాలన్నా, కేంద్రంలోని బీజేపీ విద్వేష, విభజన రాజకీయాలపై పోరాటం చేయాలన్నా.. బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే నమ్మకం సర్వత్రా నెలకొంటున్నది.
రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ కార్యాలయాలను ఏర్పాటు
ఈ క్రమంలో ఈనెల 14న బుధవారం ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. అనంతరం దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ‘‘కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ కా నేత కేసీఆర్.. దేశ్ కిసాన్ కీ భరోసా కేసీఆర్, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’’ అనే నినాదాలతో ఢిల్లీలో హోర్డింగులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
జమ్మి చెట్టు సాక్షిగా… జయకేతనం !!
ఈ దేశం లో గెలువాల్సింది రాజకీయాలు కాదు రైతు ప్రయోజనాలు …నాయకులు కాదు నాగలి పట్టే రైతన్నలు.. అని నినదిస్తూ..దసరా నాడు జమ్మి చెట్టు మించి ఆయుధాలు దించిన BRS పార్టీ అధినేత CM కేసిఆర్ … అబ్కీ బార్ కిసాన్ సర్కార్..అని పిడికిలి బిగించి జాతీయ పార్టీ గా అవతరించిన గులాబీ జెండాను ఎర్రకోట మీద ఎగరేసేందుకు ఢిల్లీ చేరుకున్నారు.
ఉజ్వల చారిత్రక ఘట్టం
బుధవారం నాడు ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్ లోని రోడ్ నంబర్ 5లో ప్రారంభించ బోతున్న BRS పార్టీ ఆఫీస్ లో.. విజయ సంకల్ప దిశగా యజ్ఞ క్రతువు ను నిర్వహించి సమర శంఖం పూరించనున్నారు. రేపటి BRS విజయానికి భరోసాగా, సంకల్పానికి దన్నుగా, అక్కడే నిలిచిన జమ్మి చెట్టు సీఎం కేసిఆర్ ఆశయాలకు ఊతంగా నిలిచింది. జమ్మి కింది పూజ జయము జయము అంటూ సకల జనులు ప్రగాఢంగా విశ్వసిస్తున్న, భారత రాజకీయ యవనికపై వో ఉజ్వల చారిత్రక ఘట్టం..రేపు ఆవిష్కృతం కానుంది.