మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కీలక పత్రాలను బయటపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
డీపీఆర్ లు ఉన్నాయని ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు బయటపెట్టిన ఎమ్మెల్సీ కవిత
సెప్టెంబరు 19న ప్రపంచ బ్యాంకు రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు
ఆ ప్రతిపాదనల్లో డీపీఆర్ ఉందని స్పష్టం చేసిన ప్రభుత్వం
ఇప్పుడు డీపీఆర్ లు లేవని ప్రజలకు, చట్టసభలకు తప్పుడు సమాచారం
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను, హైదరాబాద్ ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడుతున్నారు
హైదరాబాద్: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి సంచలన పత్రాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటపెట్టారు. ప్రభుత్వం దాచిపెడుతున్న కీలక విషయాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు పంపిన ప్రతిపాదనల్లో ఉన్న విషయాలను ఆధారాలతో సహా బయటపెట్టారు.
మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా డీపీఆర్ లు సిద్ధం కాలేదని మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలికి తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే, డీపీఆర్ లు ఉన్నాయని నిర్ధిష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత సభ లోనే తేల్చిచెప్పారు. ఈ మేరకు బుధవారం నాడు శాసన సభ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కవిత విలేకరుల సమావేశంలో ప్రపంచ బ్యాంకు కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను బహీర్గతం చేశారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందని విమర్శించారు. 10 సంవ్సతరాల బీఆర్ఎస్ హయాంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను, హైదరాబాద్ ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకు ముందు రేవంత్ రెడ్డి మోకరిల్లుతున్నారని ధ్వజమెత్తారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని అనుకుంటున్నారని స్పష్టం చేశారు.
“ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్ 19న ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనల్లో స్పష్టంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు అని స్పష్టం రాసుంది. కానీ మంత్రి శ్రీధర్ బాబు మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు మరుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని తప్పుడు విషయం చెప్పారు. రియల్ ఎస్టేట్, ల్యాండ్ పూలింగ్ చేసి పెద్ద పెద్ద భవంతులు కడుతామని ప్రతిపాదనల్లో స్పష్టంగా పేర్కొంది. డీపీఆర్ లు ఉన్నాయని ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. కానీ ప్రభుత్వం మాత్రం శాసన మండలిలో డీపీఆర్ లు లేవని చెప్పింది. డీపీఆర్ తయారు కాలేదని డిసెంబరు 17న చెప్పిన ప్రభుత్వం … డీపీఆర్ ఉందని ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబరు 19న తెలియజేసింది. అంతేకాకుండా, ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపిన తర్వాత అక్టోబరులో డీపీఆర్ తయారీకి కాన్షార్షియంను ప్రభుత్వం నియమించింది.” అని వెల్లడించారు.
ఎందుకోసం అబద్దాలు చెబుతున్నారని, ఎవరి కోసం ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. పారదర్శకత లేకుండా ఎందుకు రాపరికంతో వ్యవహిరిస్తున్నారని అడిగారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చే విషయంలోనూ ప్రభుత్వం రహస్యంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. అయితే, మూసీ ప్రాజెక్టు విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు, అసెంబ్లీకి, పేద ప్రజలకు వేర్వేరు మాటలు చెబుతోందని విమర్శించారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో భయానక పరిస్థితి నెలకొందని, 15 వేల ఇళ్లకు మార్కింగ్ చేయడం వల్ల తమ ఇళ్లను ఎప్పుడు కూల్చుతారో అన్న భయం వారిలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేయబోయే రియల్ ఎస్టేట్ లో నిర్వాసితులకు ఏం వస్తుందో ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను వెల్లడించాలని సూచించారు.