“ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం”

బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను వెంటనే బహీర్గతం చేయాలి

వర్గీకరణపై షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికనూ బయటపెట్టాలి

కృష్ణ జలాల విషయంలో పోరాటం నిజమే అయితే.. సాగర్ మన ఆధీనంలోకి ఎందుకు రాలేదు ?

కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే రికార్డు స్థాయి వరి ధాన్యం ఉత్పత్తి

పెట్టుబడులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి

హైడ్రాతో హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించడం సరికాదు

గవర్నర్ ప్రసంగంపై శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లేరు కాబట్టి ప్రజల మనోభావాలను అనుగుణంగా ఆయన నిర్ణయాలు ఉండడం లేదని, ముఖ్యమంత్రికి తెలంగాణ ఆత్మ లేదని మండిపడ్డారు. శనివారం నాడు శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొని ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు.

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… రికార్డు స్థాయిలో వరి పండిందని గవర్నర్ తన ప్రసంగంలో అన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే 2.6 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు కేవలం 64 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పండేదని గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో చెప్పడానికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోందని నిలదీశారు. కాళేశ్వరంలోని మేడిగడ్డను బూచిగా చూపించి మొత్తం తెలంగాణ పంటలను ఎండబెట్టడం సబబు కాదని సూచించారు.

రైతులు పంటలను కాలపెట్టుకునే బాధాకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు 7 మీటర్ల మేరా పెరిగాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సాగునీటి కల్పనలో పూర్తిగా విఫలమైందని ఎండగట్టారు. ఇప్పటికీ సంపూర్ణంగా రుణమాఫీ కాక అనేక రైతు కుటుంబాలు బాధ పడుతున్నాయని, రూ 50 వేల కోట్లు ఖర్చు చేస్తేనే రైతులందరికీ రూ 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తవుతుందని, కానీ కేవలం రూ 20 వేల కోట్లతో రుణమాఫీ పూర్తి చేశామని చెప్పించి గవర్నర్ ను కూడా తప్పదోవపట్టించారని విమర్శించారు. సన్న వడ్లకు బోనస్ బోగస్ అయిందని, రాష్ట్రంలో అత్యధిక రైతులకు బోనస్ రాలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు.

Also Read-

కృష్ణా జలాలపై పోరాటం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, అదే నిజమైతే నాగార్జున సాగర్ ఇంకా తెలంగాణ ఆధీనంలోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సాగర్ ఎడమ కాలువ నుంచి ఏపీ జలాలను తరలించుకుపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది ? అని నిలదీశారు.

మహాలక్ష్మీ పథకాన్ని గేమ్ చేంజర్ గా అభివర్ణించడం హాస్యాస్పదమన్నారు. మూడు నాలుగు పథకాల సమూహమైన మహాలక్ష్మీ పథకాన్ని పాక్షికంగా అమలు చేసి పూర్తిగా అమలు చేశామని చెప్పడం అర్థసత్యమేనని స్పష్టం చేశారు. అబద్దం కంటే అర్థసత్యం చాలా ప్రమాదమని చెప్పారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వకుండానే మహాలక్ష్మి పథకం ఎలా పూర్తిగా అమలవుతున్నట్లు ? అని అడిగారు. మహిళలకు గ్యాస్ సబ్సిడీ సరిగ్గా అందడం లేదని, దీనిపై ప్రభుత్వం సమీక్షించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ హయాంలో కూడా ఆరోగ్య శ్రీ మొత్తాన్ని రూ 5 లక్షలకు పెంచడం జరిగిందని, ప్రభుత్వ ఆస్పత్రులను కూడా కేసీఆర్ బలోపేతం చేశారని గుర్తు చేశారు. ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయించారని, ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోవడం లేదని, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూది లేదు.. దూది లేదు.. మందులు అసలే లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికెటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని ప్రశ్నించారు. డెడికేటెడ్ కమిషన్ తో పాటు ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికలను ప్రభుత్వం ఎందుకు అసెంబ్లీలో పెట్టడం లేదు ? అని నిలదీశారు. సర్వే ద్వారా సేకరించిన వివరాల్లో కులాల వారీగా, గ్రామాల వారీ వివరాలను ఎందుకు బహీర్గతం చేయడం లేదు ? అని అడిగారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టే లోపు చట్టసభల్లో ఆ వివరాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికను కూడా అసెంబ్లీలో, మండలిలో పెట్టాలని సూచించారు.

గత 15 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు తెలంగాణ నుంచి తమిళనాడు, గుజరాత్ కు తరలివెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, కాబట్టి ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ పడిపోయి ప్రజల్లో అభద్రత భావం ఏర్పడిందని, ఎల్ఆర్ఎస్ కు ఫీజులు తీసుకోబోమని.. ఇప్పుడు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని విమర్శించారు. హైడ్రాతో హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించడం సరికాదు

ఇక జయజయహే తెలంగాణ గీతానికి ఆంధ్రా వ్యక్తితో సంగీతం ఇప్పించడం సరికాదని, తెలంగాణలో సంగీత దర్శకులు లేరా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యమ కాలంలో పార్టీలకతీతంగా తెలంగాణ తల్లికి నాయకులు దండలు వేశారని, ఇప్పుడు అదే తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడం బాగలేదని తేల్చిచెప్పారు. ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉందని ప్రభుత్వం చెబుతున్నదాన్ని ప్రజలు అంగీకరించడం లేదని తెలిపారు. దాశరథి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఒక కార్యక్రమం కూడా చేయడం లేదని, వెంటనే దాశరథి శతజయంతి సందర్భంగా ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వానికి సూచన చేశారు.

అలాగే, మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం రాజకీయంగా అవకాశాలు ఇవ్వకపోవడం సరికాదని సూచించారు. గంగా జమునా తెహజీబ్ వంటి తెలంగాణలో మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తోందని, మైనారిటీ మంత్రి లేకుండా ఎప్పుడూ మంత్రివర్గం లేదని అన్నారు.

మరోవైపు, ఎమ్మెల్సీ తాతా మధును ఉద్ధేశించి సభలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన “న్యూసెన్స్” అనే వ్యాఖ్యను ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు. ఆ పదాన్ని రికార్డుల్లో నుంచి తొలగించాలని చైర్మన్ కు మండలిలో విజ్ఞప్తి చేశారు. దానికి స్పందించిన చైర్మన్ సుఖేందర్ రెడ్డి.. అది అన్ పార్లమెంటరీ పదమైతే తప్పకుండా తొలగిస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… శాసన మండలిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెబుతున్న పచ్చి అబద్దాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే… న్యూసెన్స్ చేయవద్దని చైర్మన్ సుఖేందర్ రెడ్డి కామెంట్ చేశారని, ఆ వ్యాఖ్యను రికార్డుల్లో నుంచి తొలగించాలన డిమాండ్ చేశారు. గతంలోనూ తమ సభ్యులను ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడారని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు శాసన మండలిలో సముచిత గౌరవం ఇవ్వలేదని, ఇది ప్రభుత్వ కక్షసాధింపులో భాగమేనని ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X