రాష్ట్ర ఏర్పాటు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శ్రీ కేసీఆర్ గారి పిలుపుతో జూన్ 12, 13 తేదీలలో భారత జాగృతి సాహిత్య సభలు
ఇకపై ప్రతి యేటా “ప్రొఫెసర్ జయశంకర్ సాహిత్య జాగృతి పురస్కారం”
స్వరాష్ట్రంలో సాహితీ వికాసం పేరుతో 2 రోజుల పాటు విస్తృత సాహితీ సమాలోచనలు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థ భారత జాగృతి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రోద్యమంలో క్రియాశీలకంగా ఉన్న సంస్థ. అలాగే తెలంగాణ అస్థిత్వాన్ని సమున్నతంగా నిలిపే దిశగా భారత జాగృతి అనేక కార్యక్రమాలను చేపట్టిన సంగతి, అనేక ప్రచురణలు వెలికి తెచ్చిన సంగతి మీకు తెలుసు. తెలుగు సాహితీ రంగ విస్తృతికి తోడ్పడాలనే ఉన్నతాశయంతో తెలుగు సాహితీ పక్ష పత్రిక “తంగేడు”ను ప్రచురిస్తున్న విషయం కూడా సాహితి అభిమానులకు తెలుసు.
ఈ క్రమంలో ఉద్యమ నాయకులే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని రంగాలలో దేశంలోనే అగ్రగామిగా నిలవడం మన అమరుల ఆకాంక్షలకు కార్యరూపం ఇవ్వడమే. ఈ నేపథ్యంలో మాన్య ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పిలుపు మేరకు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబురాలకు సాహితీ సింగిడిని అద్దనుంది భారత జాగృతి.
ఈ క్రమంలో భారత జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి నిర్ణయం మేరకు హైదరాబాదులో రెండు రోజులపాటు సాహితీ సభలను నిర్వహిస్తుంది భారత జాగృతి. జూన్ 12, 13 తేదీలలో హైదరాబాదులోని సారస్వత పరిషత్తు ప్రాంగణంలో జరగనున్న ఈ సాహిత్య సభలలొ తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలపై రెండు రోజుల పాటు లోతైన సమాలోచనలు, పత్ర సమర్పణలు ఉంటాయి.
జూన్ 12 ఉదయం “స్వరాష్ట్రంలో సాహితీ వికాసం” పేరుతో జరిగే ప్రారంభ సామావేశంతో తెలంగాణ సాహిత్య సభలు మొదలవుతాయి. ఆరు సెషన్లలో అంశాలవారీగా జరిగే ఈ సభలలో వివిధ రంగాలపై సాధికార అవగాహన కలిగిన, అధ్యయనం, పరిశోధన చేసిన సాహితీ మూర్తుల ప్రసంగాలు ఉంటాయి. 13వ తేదీ సాయంత్రం ముగింపు సమావేశంతో సాహిత్య సభలు ముగుస్తాయి.
ఇకపై ప్రతి యేటా “ప్రొఫెసర్ జయశంకర్ సాహిత్య జాగృతి పురస్కారం”
ఈ సాహితీ సభలలో భాగంగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసే రచనలు చేసిన ఒక సాహితీ మూర్తికి “ప్రొఫెసర్ జయశంకర్ సాహిత్య జాగృతి పురస్కారం” అందజేయనుంది భారత జాగృతి. విస్తృత రచనలు, వివిధ ప్రక్రియలు, లోతైన అధ్యయనం, జన హితం ప్రాతిపదికలుగా ప్రతి సంవత్సరం ఒకరిని ఎంపిక చేసి ఈ అవార్డును ఇవ్వనున్నట్టు సంస్థ అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు తెలిపారు.