డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సటీలో ఆళ్వారుస్వామి స్మారకోపన్యాసం
హైదరాబాద్ : తెలంగాణ ప్రజాసాహిత్యకులు, గ్రంథాలయోద్యమ నాయకుడు, రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, కమ్యూనిస్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, ప్రచారకుడు వట్టికోట ఆళ్వారుస్వామి వర్ధంతిని పురస్కరించుకుని డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సటీ లో స్మారకోపాన్యాసం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్ట్, వీక్షణం సంపాదకులు శ్రీ .ఎన్. వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని “వట్టికోట ఆళ్వార్ స్వామి – గ్రంథాలయోద్యమం” అనే అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయోద్యమాన్ని నడిపించి ప్రజలను తన అక్షరానికి పదును పెట్టడం ద్వారా చైతన్య పరిచారని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ మట్టిగడ్డపై పోరు విత్తనాలు జల్లి ఉద్యమ సుమాలను పూయించిన సాహిత్య ఉద్యమ రైతు వట్టి కోట అని అన్నారు. నవ తెలంగాణ నిర్మాణానికి సాంస్కృతిక పునాదులు వేసిన కవి, కార్మిక వైతాళికుడు, వలసవాదం, భూస్వామ్యం కింద నలుగుతున్న తెలంగాణను విముక్తి చేయడం సామాజిక బాధ్యతగా గుర్తించిన నవయుగ వైతాళికుడుగా ఆయన గుర్తింపు పొందారన్నారు. విజ్ఞానానికి విలువ కట్టని సమాజం వృద్ధిచెందదని భావించి హైదరాబాదులో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించారని పేర్కొన్నారు. తెలంగాణ భాషకు యాసకు పెద్ద పీట వేసిన సాహిత్య మేరు నగధీరుడు అన్నారు. తన రచనల ద్వారా ప్రసరించిన అభ్యుదయ కిరణాలు నేటి నవతెలంగాణ నిర్మాణానికి దిశానిర్దేశం చేయగల దివిటీలని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదని పేర్కొన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె సీతా రామారావు మాట్లాడుతూ … తెలంగాణ సాహితీ సరస్వతి కన్న మరో అక్షరం వట్టి కోట ఆళ్వారుస్వామి అని అభిప్రాయపడ్డారు . తెలంగాణ ప్రజల జీవితాన్ని పోరాట తత్వాన్ని, సంస్కృతిని నరనరాన జీర్ణించుకుని గ్రంథ పఠనం ద్వారా లోకజ్ఞానం కలుగుతుందని సమాజాన్ని అర్థం చేసుకొని చైతన్య పరచవచ్చని ఊరూరా గ్రంథాలయ ఉద్యమాన్ని నిర్వహించి ప్రజా చైతన్యానికి బాటలు వేసిన ప్రముఖ సాహిత్య దిగ్గజం వట్టి కోట అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిలుగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ.ఎ.వి.ఆర్.ఎన్. రెడ్డి; సామాజిక శాస్త్రాల డీన్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయ లైబ్రరీ ఇంచార్జ్ డా. ఎన్.రజని కార్యక్రమ ఆవశ్యకతలను, ప్రధాన వక్త ఎన్. వేణు గోపాల్ ను సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.