హైదరాబాద్ : ఉన్నత విద్య అభ్యసించడమే లక్ష్యం, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. సంప్రదాయ విద్యను కొనసాగించే అవకాశమూ లేదు. కుటుంబ స్థితిగతుల నేపథ్యములో చిరు ఉద్యోగంలో చేరి ఆ తర్వాత వివాహం, భార్యా, పిల్లలు పోషణతో చదువుకు దూరం. ఇదీ ఓ తండ్రి జీవన గాథ. ఆ ఇల్లాలికి ఉన్నత విద్యపై మక్కువే. చదువుపై ఆసక్తి ఉన్న పిల్లల పెంపకం అడ్డంకిగా మారింది. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. సంప్రదాయ ఉన్నత విద్యకు దూరమైన కుటుంబానికి ‘డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం’ ఆశాదీపంగా మారింది.
సార్వత్రిక విశ్వవిద్యాలయ కుటుంబంలో తల్లిదండ్రులు, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు చేరారు. ఉన్నత విద్య లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తిరుపతికి చెందిన ఎస్. శ్రీధర్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లో చిరు ఉద్యోగి. పిల్లలు, కుటుంబ స్థితిగతులు కొంత మెరుగయ్యాక సార్వత్రిక విద్యాలయంలో డిగ్రీలో చేరారు. భర్త బాటలో అతని సతీమణి ఉమాదేవి పయనించారు. సార్వత్రిక విద్యాలయంలో డిగ్రీలో చేరారు. కుమారుడు కార్తీక్ కూడా సార్వత్రిక విద్యాలయం నుండి ఎం కామ్ పూర్తి చేసి అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు. పెద్ద కుమార్తె ఎస్. విద్య కూడా సార్వత్రిక విద్యాలయం నుండి ఎమ్మెసి సైకాలజీ పూర్తి చేసారు. చిన్న కుమార్తె ఎస్. గాయత్రి కూడా సార్వత్రిక విద్యాలయం నుండి ఎం కామ్ చదివి బంగారు పతకానికి ఎంపికయింది. కుటుంబ సభ్యులందరికీ అంబేద్కర్ సార్వత్రిక విద్యాలయం బాసటగా నిలిచి వారి పురోగతిలో దోహదపడింది.
ఇది కూడ చదవండి-
“లక్ష్య సాధనలో వెనకడుగు వేయొద్దు”
లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత వెనకడుగు వేయొద్దని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ బంగారు పతక గ్రహీత ఎస్. గాయత్రీ పేర్కొన్నారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తిరుపతి అధ్యయన కేంద్రంలో ఎం. కామ్ విద్యను గాయత్రి చదివారు. ఎం. కామ్ లో అత్యధిక మార్కులు సాధించడంతో భారతీయ స్టేట్ బ్యాంకు ప్రయోజిత బంగారు పతకానికి గాయత్రీ ఎంపికైంది. బుధవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే స్నాతకోత్సవంలో గాయత్రికి బంగారు పతాకాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందించనున్నారు.
ఈ సందర్భంగా గాయత్రీ మాట్లాడుతూ తక్కువ ఫీజులతో అత్యుత్తమ విలువలు, నాణ్యతతో విద్యను అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందిస్తోందని అన్నారు. డిస్టింక్షన్ తోపాటు అత్యధిక మార్కులు రావడానికి విశ్వవిద్యాలయం అందించిన కోర్సు మెటీరియల్, అధ్యయన కేంద్రంలో చెప్పిన తరగతులు ఎంతో దోహదపడ్డాయని వెల్లడించారు. పోటీపరీక్షలకు (స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గ్రూప్స్) సిద్ధమవుతూ సార్వత్రిక విద్యావిధానంలో ఎం.కామ్ చదివానని చెప్పారు. సమాజంలో విద్యా, ఉద్యోగం, ఇతర అన్ని రంగాల్లో మహిళలకూ సమన అవకాశాలు ఉన్నాయని, వాటిని ఎంపిక చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సామజిక అసమానతలను అధిగమించాలని పేర్కొన్నారు.
స్థిరమైన లక్ష్యంతో శ్రమిస్తే విజయాలను సాధించవచ్చని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా గమ్యాన్ని చేరాలని అన్నారు. ఉన్నత ఉద్యోగ లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్నాని వెల్లండించారు. గాయత్రీ తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి కూడా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు కావడం విశేషము. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో చిరు ఉద్యోగి అయిన గాయత్రీ తండ్రి శ్రీధర్ తన కుమారుడు, ఇద్దరు కుమార్తెలకు ఉన్నత విద్య చదివేందుకు ప్రోత్సహించారు.
