హైదరాబాద్ : సంచలనం నాంపల్లి బజార్ ఘాట్ అగ్ని ప్రమాద ఘటనలో భవన యజమానిని నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ జైశ్వాల్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.
నవంబర్ 13వ తేదీన నాంపల్లి బజార్ ఘాట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటం వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 10 మంది చనిపోయారు.
నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాద ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. క్రైమ్ నెంబర్ 347/23 us 304పార్ట్ ఐపీసీ సెక్షన్లు 285, 286 (పేలుడు పదార్థాలతో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం) ప్రకారం. అలాగే ఇండియన్ ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ సెక్షన్ 9 క్లాజ్ బి ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఏడాది కాలంలో సిటీలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 37 మంది మరణించారు.