హైదరాబాద్ : నగరములోని మాదాపూర్ దుర్గం చెరువులో దూకి ఓ వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము సూపర్ మాక్స్ కంపెనీలో సంపత్ కుమార్ అనే వ్యక్తి గత 25 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. అయితే కంపెనీ జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. కొంతకాలం నుంచి సంపత్ కుమార్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. వందరోజులుగా కంపెనీ ముందు ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మాదాపూర్ దుర్గం చెరువులోకి దూకి సంపత్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
దుర్గం చెరువులో డెడ్ బాడీ కనిపించడంతో స్థానికులు పోలీసులకు తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చెరువు నుంచి డెడ్‌బాడీని బయటకు వెలికి తీయించారు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. గాజులరామారంలో నివాసం ఉంటున్న సంపత్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంపత్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.