హైదరాబాద్: ప్రజారవాణాను పటిష్టం చేసేందుకు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. తెలంగాణ కేబినెట్ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు… “రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ, అందులో పని చేసే ఉద్యోగులు, కార్మికుల విషయంలో రవాణామంత్రి, ఆర్థికశాఖ మంత్రి సంస్థతో అనుబంధం ఉన్న వారంతా సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్తపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నది”.
“ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు, సేవలను ఇంకా విస్తృత పరిచేందుకు సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె చేయడం జరిగింది. వారి కోరికను మన్నిస్తూ అదేవిధంగా సామాజిక బాధ్యతగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌గా గుర్తిస్తూ అధికారులతో కూడిన సబ్‌కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 43,373 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నది.”
“సబ్ కమిటీలో అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ, జేఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ స్పెషల్ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. 3వ తేదీన ప్రారంభమయ్యే సమావేశంలోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనున్నది. వెంటనే దానికి సంబంధిన కార్యాచరణ ప్రారంభించాలని రవాణాశాఖ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రికి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది” అని కేటీఆర్ తెలిపారు. (ఏజెన్సీలు)