“తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పా, ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నా”

హైదరాబాద్ : “తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పా. పదవుల కోసం కాదు ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నా. తెలంగాణ ఇవ్వడమే మేము చేసిన ద్రోహామా. ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించరు. 140 కోట్ల మంది ప్రజల ముందు ఈవాళ తెలంగాణ సమాజం దోషిగా నిలబడింది. 1200 యువకుల బలిదానాలకు చలించి ఏ అమ్మకు కడుపు కోత ఉండకూడదని సోనియాగాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. రాజకీయంగా నష్టపోయిన సోనియా గాంధీ గారు తెలంగాణకు కలను సాకారం చేశారు. అంతగొప్ప త్యాగం చేసే సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద లేదా అని ప్రశ్నిస్తున్నా.” అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా 11వరోజు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 12 కిలోమీటర్ల మేర రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం స్టేషన్ ఘన్పూర్లో నిర్వహించిన జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

ఈ నెల 6న సమ్మక్క-సారలమ్మల ఆశ్వీరాదంతో మొదలైన పాదయాత్ర మహబూబాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో 100 కిలోమీటర్లు పూర్తి చేసుకొని వరంగల్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చింది. ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ కు చేరింది. ఈ రోజు జాఫర్ గడ్ కూనురు గ్రామం నుంచి స్టేషన్ ఘన్ పూర్ వరకు సాగిన పాదయాత్రను కాంగ్రెస్ కార్యకర్తలు విజయవంతం చేశారు. ఈ గడ్డకు గాలికి, నీరుకు గొప్ప చరిత్ర ఉంది. మహాకవి బమ్మెర పోతన, తెలంగాణ సాయుధ పోరాటంలో నిప్పు రవ్వ చాకలి ఐలమ్మ, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి తెలంగాణ గడ్డపై దళిత, బహుజన, మైనార్టీలతో కలిసి ప్రజారాజ్యాన్ని నిర్మించిన సర్వాయి పాపన్న ఇదే జిల్లాకు చెందిన వారే.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్టేషన్ ఘన్పూర్లో అభివృద్ధి జరిగింది. స్టేషన్ ఘన్ పూర్ అంటే కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య గుర్తుకు వస్తారు. లెక్చరర్ గా పనిచేసి విద్య విలువ తెలిసిన కడియం శ్రీహరి… స్టేషన్ ఘనపూర్ కు డిగ్రీ కాలేజీ తేలేకపోయారు. గతంలో కడియం కొంచెం పరువుగా బతికారు. రాజయ్య పంచెకట్టు కాంగ్రెస్ లో చెల్లింది కానీ… దొర గడీలో చెల్లలేదు. ఉపముఖ్యమంత్రిగా రాజయ్య బర్తరఫ్ తెలంగాణ చరిత్రలో ఒక మాయని మచ్చ. దళితులంటే చిన్నచూపు ఉన్న కేసీఆర్… అవినీతి ఆరోపణల పేరుతో ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. రాజయ్య నిజంగా అవినీతి చేసి ఉంటే ఎందుకు బయటపెట్టలేదు? దొరగడీలో చేరాక చచ్చిన పాము కంటే హీనంగా బానిసగా బతుకుతున్నారు.

రాజయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్. గాడిదకంటే హీనంగా దొరగారి దొడ్లో ఆయనకు అవమానం జరిగింది. గతంలో వరంగల్ కు వైద్య విధాన పరిషత్ తెస్తా అని ప్రకటించిన రాజయ్య… సొంత నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి తేలేకపోయాడు. కడియం తో పోలిస్తే కోవర్టు దయాకరరావు కు ఓనమాలు కూడా రావు. ఒకప్పుడు ఆత్మగౌరవంతో బతికిన కడియం శ్రీహరికి ఇంత అవమానం అవసరమా? మాదిగబిడ్డల పౌరుషం కడియంలో చచ్చిపోయిందా? పదవుల కోసం తాకట్టు పెట్టారా? ఒక్క మాదిగ సోదరుడిని కూడా కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోలేదు.

రాజకీయంగా నష్టపోయినా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ కుబుంబం కోసమా తెలంగాణ వచ్చిందా. మోసపూరిత హామీలతో కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. రబ్బరు చెప్పులు వేసుకొని తిరిగినోళ్లు, ఎమ్మెల్యేలు కోట్లకు అధిపతులయ్యారు. ఇవాళ ఆరూరి రమేష్ కు భూమిలేని ఊరు ఉందా. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా అంతా టీఆర్ఎస్ నాయకులే. అఖరికి రేపు కేసుల్లో కూడా వాళ్లే ఉంటున్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తు కూర్చుందామా. దొరల గడీలు బద్దలు కొట్టాల్సిన రోజుకు మళ్లీ వచ్చాయి. ఎంఏ బీఈడీ చేసిన ఆడబిడ్డ చెప్పులు అమ్ముకునే దుర్భర పరిస్థితి రాష్ట్రంలో ఉంది. నోటిఫికేషన్లు లేక ఉద్యోగం రాక నిరుద్యోగుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 2024, జనవరి1న కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ధరణి రద్దు చేసే జీవో ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ. 5లక్షల ఆర్థిక సాయం చేస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి వారిని ఆదుకుంటాం. పేదలకు వైద్యం అందించేందుకు 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ మార్జిన్ ను 5లక్షలకు పెంచుతాం. రైతులకు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించే బాధ్యత మాది. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది. కాంగ్రెస్ గెలిస్తేనే పేదల బతుకులు బాగుపడతాయి. ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఇన్నీ మంచి పనులు చేయాలంటే తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయండి.

ఈ హామీలు అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ, రైతులకు రుణమాఫీ, జలయజ్ఞంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు కట్టింది, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవన్నీ చేయడం తప్పా. అందుకే కాంగ్రెస్ పార్టీని ఓడించారా. తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పా.

2014 నుంచి కేసీఆర్ 17 లక్షల కోట్లవిలువైన తొమ్మిది బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 5 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆ లెక్కన ప్రతి నియోజకవర్గానికి రూ. 20 వేల కోట్లు రావాలి. మరీ స్టేషన్ ఘన్ పూర్ కు ఆ మేరకు నిధులు వచ్చాయా లేదో మీరే ఆలోచించండి. బీజేపీ అంటే ఆదానీ, అంబానీ పార్టీ. టీఆర్ఎస్ దొరలు, కంట్రాక్టర్ల పార్టీ. కాంగ్రెస్ అంటే పేదోళ్ల పార్టీ. పేదోళ్ల కష్టాలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. తెలంగాణలో పేదోళ్ల రాజ్యం తెచ్చుకుందాం.

మహా శివరాత్రి శుభాకాంక్షలు...

తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అత్యంత పవిత్రమైన మహా శివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు… టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి..

శివరాత్రి పండుగ సందర్భంగా శైవ భక్తులు భక్తి శ్రద్ధలతో మహా శివుణ్ణి దర్శించుకోవాలని, ప్రశాంత వాతావరణం లో పూజలు నిర్వహించుకోవాలి… రేవంత్ రెడ్డి.

రాజయ్యపై చార్జిషీట్ విడుదల చేసిన కాంగ్రెస్

పామునూర్ లంచ్ పాయింట్ వద్ద కాంగ్రెస్ నేతలు జంగా రాఘవరెడ్డి, మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, సింగపురం ఇందిర మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై చార్జీషీటును విడుదల చేశారు.

అభివృద్ధి శూన్యం : జంగా రాఘవరెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజయ్య, శ్రీహరి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా చేసిన అభివృద్ధి శూన్యం. కడియం, రాజయ్య ఇద్దరూ తొడుదొంగలే. నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ఎందుకు తీసుకురాలేదు. 100 పడకల ఆసుపత్రిని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగానే చెన్నూరు రిజర్వాయర్ తీసుకొచ్చింది. రాజయ్య బాగోతం అందరికీ తెలిసిందే. దళితబంధు రాకముందే బీఆరెస్ నేతలు 3 లక్షలు లంచాలు వసూలు చేస్తున్నారు. దళితులపై బీఆరెస్ నేతలకు చిత్తశుద్ధి లేదు. ఎర్రబెల్లీ.. నీ అవినీతిని నిరూపించడానికి రేవంత్ దాకా అవసరం లేదు. జనగామ జిల్లాలో ఎక్కడ కూర్చుందామో చెప్పు. నీ అవినీతిని ఆధారాలతో సహా నేను నిరూపిస్తా. ఏ వ్యాపారం చేసి దయాకర్ రావు ఇన్ని వందల కోట్లు ఎలా సంపాదించారు?

ఎమ్మెల్యే అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ చార్జిషీట్ : సింగపురం ఇందిర

ఎమ్మెల్యే అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకె కాంగ్రెస్ ఈ చార్జి షీట్ ను విడుదల చేసాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్య చేసిన అభివృద్ధి శూన్యం. వైద్య శాఖ మంత్రిగా పనిచేసి… నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి తీసుకురాలేకపోయారు. మహిళలు అంటే ఎమ్మెల్యేకు అసలు గౌరవం లేదు. రాజయ్యతో ఫోటో దిగలన్నా మహిళలు భయపడుతున్నారు.

ఇద్దరూ అసమర్ధులే : సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎంపీ

విద్యావంతుడు శ్రీహరికి విద్యాశాఖ ఇచ్చినా… వైద్య వృత్తిలో అనుభవం ఉన్న ఎమ్మెల్యే రాజయ్యకు వైద్య శాఖ అప్పగించినా… ఇద్దరూ అసమర్థులని నిరూపించుకున్నారు. ఏడేళ్ల క్రితం మంజూరు చేసిన ఘనపూర్ ఫ్లైఓవర్ ను ఎందుకు మొదలు పెట్టలేదు? అవినీతి, చిల్లర వ్యవహారాలకు పరాకాష్ట ఎమ్మెల్యే రాజయ్య.

రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం : మల్లు రవి, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్

కేసీఆర్ రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని నిర్వీర్యం చేశారు. సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సర్పంచులకు రావాల్సిన నిధులను వారికి తెలియకుండానే ప్రభుత్వం తీసుకుంటోంది. సమస్యలు పరిష్కారం చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికే ఉంది. అందుకే రేవంత్ రెడ్డి యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రకు కూడా విశేష స్పందన లభిస్తోంది. అద్భుతంతగా ఉండే కట్టడాల వల్ల ప్రజలకు మేలు జరగదు. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయి. శివరాత్రి సందర్భంగా రేపు, ఎల్లుండి యాత్రకు విరామం ఉంటుంది. అనంతరం మళ్లీ వరంగల్ పార్లమెంట్ పరిధిలో రేవంత్ యాత్ర కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X