హైదరాబాద్ : తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ జాతీయ రహదారి తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న క్రమంలో వెనకవైపు నుంచి వేగంగా వస్తున్న లారీ, కాలేజీ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందుస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన నర్సింగ్ విద్యార్థులను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. నర్సింగ్ స్టూడెంట్స్ నల్లగొండ లో ఎగ్జామ్ రాసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాలేజీ బస్సు బోల్తా పడింది
ప్రమాద సమయంలో కాలేజీ బస్సులో సుమారు 46 మంది విద్యార్థులు ఉన్నారని తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. క్షతగాత్రులు సూర్యాపేట అపర్ణ నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులుగా చెబుతున్నారు. గాయపడ్డవారిని సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
ఈ బస్సు ప్రమాద ఘటనపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 13 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి హరీష్ రావుకు వైద్యాధికారులు వివరించారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. (Agencies)