Analytical Article: పార్టీల ప్రభావమా? వ్యక్తుల ప్రభావమా? రాజకీయాల్లో ఫైనల్ విన్నింగ్ ఎవరిది?

రాజకీయాలు, రాజకీయ నాయకుల వ్యాఖ్యలను పరిశీలించి చూస్తే, ఒక్కోసారి ఆశ్చర్యంగా, మరోసారి ఆసక్తికరంగా అనిపిస్తుంది. వాళ్లు మాట్లాడే మాటలు, వారి వ్యవహార తీరు బద్ధ విరుద్ధంగా కనిపిస్తుంది. ఎన్నికల్లో పార్టీల ప్రభావం ఎక్కువా? వ్యక్తుల ప్రభావం ఎక్కువా? అనే ప్రశ్న వచ్చినప్పుడు వచ్చే సమాధానం కాస్త విచిత్రంగానే ఉంటుంది. మాజీ మంత్రి, ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రాజీనామా సందర్భంగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఓసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో వ్యక్తులా? లేక పార్టీలా? అనే దానిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తులు కాదు.. పార్టీలే ముఖ్యం అని ఘంటాపథంగా చెప్పారు.

ఆశ్చర్యకర విషయం ఏంటంటే? హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీ కంటే, వ్యక్తి ప్రభావమే ఎక్కువ అని నిరూపితం అయ్యింది. టీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఉన్నా, ఈటెల వ్యక్తిత్వం ముందు పార్టీ ఓడిపోయింది. తాజాగా ఏపీ రాజకీయాలపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీల కంటే వ్యక్తుల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. చంద్రబాబు, జగన్, పవన్ వ్యక్తిత్వాలు చూసి మాత్రమే ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉందన్నారు. అయితే, పార్టీలోకి పాతవారినే తీసుకోవడం వల్ల వారిలో మంచివారెవరో? చెడ్డవారు ఎవరో? తేల్చుకోవడం కష్టమవుతోందన్నారు.

ఇక్కడ గమనించాల్సిన కీలక విషయం ఏంటంటే? వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అనే మాట హాస్యాస్పదంగా అనిపించడం. కొంత మంది ప్రభావం చూపించే వ్యక్తులు కలిస్తేనే పార్టీ అవుతుంది. వ్యక్తులు క్రెడిబులిటీ ఉన్న వాళ్లు అయితేనే పార్టీ బలంగా ఉంటుంది. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం అని చెప్పిన కేటీఆర్ కూడా కేసీఆర్ మాట వినకతప్పదు. అంటే ఎవరు గొప్ప అన్నట్లు? వ్యక్తులు ముఖ్యం కాదని కుండబద్దలుకొట్టినప్పుడు, ఇతర పార్టీల నాయకులను ఎందుకు పార్టీలోకి తీసుకుంటున్నట్లు? సాధారణ కార్యకర్తలను పార్టీ పేరు చెప్పి బలమైన నాయకులుగా మార్చుకోవచ్చు కదా? అంటే పార్టీల ప్రభావం కంటే వ్యక్తుల ప్రభావమే ఎక్కువ అని భావించవచ్చు. ఏ పార్టీకైనా ఎంతో కొంత ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. కానీ, పూర్తి స్థాయిలో పార్టీ పేరుతోనే అభ్యర్థులు విజయం సాధిస్తారనే మాట చాలా వరకు తప్పనే చెప్పుకోవచ్చు.

ఇటీవల కాలంలో పార్టీకి జైకొడుతున్నామనే భ్రమలో, ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి నాయకులు కూడా వ్యక్తి పూజకే ప్రియారిటీ ఇస్తున్నారు. తాము చేసేది మంచా? చెడా? అనే విషయాన్ని ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉన్నా, వారంతా వ్యక్తిగత లబ్ది చేకూరితే చాలు అనే స్థితిలోకి పడిపోయారు. రెండు, మూడు సార్లు విజయం సాధించి ప్రజల్లో మంచి క్రెడిబులిటీ ఉన్న వ్యక్తులు కూడా ఈ భజన మూలంగా ప్రజల్లో పలుచబడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించలేకపోవడం ఇక్కడ అసలు సమస్య … మొదటిసారి పోటీ చేసే సమయంలో పార్టీ, ఆ పార్టీ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొంతమేర కలిసి వస్తాయి.అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. కానీ, రెండోసారి, మూడోసారి విజయం సదురు వ్యక్తులు విజయం సాధిస్తున్నారు అంటే కచ్చితంగా వారి వ్యక్తిగత ఇమేజ్, ప్రజలను రిసీవ్ చేసుకునే పద్దతి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధానం తప్పని సరిగా ప్రభావ చూపిస్తుంది.

వాస్తవానికి తెలంగాణలో బీఎస్పీ అనే పార్టీ అంత బలంగా లేదు. కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ పార్టీ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప లాంటి నాయకులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అంటే, అక్కడ పార్టీల బలం కంటే వ్యక్తుల బలమే ఎక్కువగా పని చేసినందని చెప్పుకోవచ్చు. అటు రామగుండం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సోమారపు సత్యనారాయణ మీద టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి కోరుకంటి చందర్ విజయం సాధించారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కంటే కోరుకంటి చందర్ ప్రభావమే ఎక్కువ అని నిరూపితం అయ్యింది. ఎక్కడైనా సేమ్ ఫార్ములా, ఎక్కడో ఒకచోట పార్టీ పేరు చెప్పుకొని ఒకటి లేదంటే రెండు సార్లు నేతలు గెలుస్తారు. మూడు, అంతకంటే ఎక్కువ సార్లు విజయం సాధిస్తున్నారు అంటే చాలా వరకు వారి వ్యక్తిగత ఇమేజ్ ద్వారానే సాధ్యం అవుతుందని గుర్తించక తప్పదు.

ఓటర్లలోనూ చాలా వరకు మార్పు వచ్చింది. గతంలో ఎవరో ఒకరు చెప్పిన మాటలు విని ఆయా పార్టీల నాయకులకు ఓట్లు వేసేవారు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియా విస్తరించిన నేపథ్యంలో ఏ నాయకులు ఎలాంటి వారు? వారికి ఓటు వేయాలా? వద్దా? అని ఈజీగా తెలుసుకోగలుగుతున్నారు. పార్టీల ప్రభావం ఉన్నప్పటికీ వ్యక్తుల గుణగణాలను సైతం అంచనా వేసే విజయాన్ని కట్టబెడుతున్నారు. ప్రస్తుతం ప్రజలు ప్రతి అంశాన్ని కీలకంగా చూస్తున్నారు. ఏ నాయకుడు నాలుక మడతేసినా, సోషల్ మీడియా గోలపై రెండు నాల్కల ధోరణిని దులిపి ఆరేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు. ముందుగా పెద్ది సుదర్శన్ రెడ్డి మొగతాన్ని ప్రశ్నించిన రాజశేఖరుడి బిడ్డ, ఆ తర్వాత ఆయన మొగతనంతో మాకేం పని అంటూ మాటమార్పించింది.

సోషల్ మీడియా ఊరికే ఊరుకోదుగా, రెండు వీడియోలు పక్కపక్కన పెట్టే సరికి షర్మిల నీళ్లు నమిలే పరిస్థితి వచ్చింది. అందుకే రాజకీయ నాయకులు మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి. ప్రజా ప్రతినిధులు అనే వాళ్లు చుట్టూ ఉన్న భజన పరుల ముసుగును కాసేపు పక్కన పెట్టి అసలు విషయాలను గ్రహించాలి. లేదంటే, రాజు గుర్రం పిత్తు మాదిరిగా ఉంటుంది పరిస్థితి. అందుకే నాయకులు ప్రజలతో వ్యవహరించే తీరు, ప్రజా సమస్యలను పరిష్కారానికి వాళ్లు చేసే కృషి, పలుకుబడి, డబ్బు అన్నీ ముఖ్యమే. అన్నింటి కంటే ప్రజల మౌత్ టాక్ అనేది చాలా కీలకం. అది మంచైనా, చెడైనా. అందుకే వాపును చూసి బలుపు అని భావించకూడదు.

ఇంకో కఠిన వాస్తవం ఏంటేంటే? ప్రాంతీయ పార్టీలు అంటేనే వ్యక్తులు, లేదంటే కుటుంబాల చెప్పుచేతుల్లో కొనసాగుతాయి. వారు చెప్పిందే వేదం, వారు చేసిందే శాసనం అనే మాదిరిగా కొనసాగుతాయి. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు జాతీయ పార్టీల పరిస్థితి కూడా అలాగే ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ నుంచి మొదలుకొని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మొత్తంగా గాంధీమయంగా కుటుంబం గుప్పిట్లోనే ఉంది. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే ఎన్నికైనా, సోనియా చెప్పిందే ఫైనల్.

ఇక బీజేపీ పరిస్థితి మోడీకి ముందు, మోడీ తర్వాత అనేలా మారింది. గతంలో వాజ్ పేయి, అద్వానీ, ప్రమోద్ మహాజన్, రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్, జార్జ్ ఫెర్నాండేజ్, అరుణ్ జైట్లీ, యశ్వంత్ సిన్హా లాంటి నాయకలు ఉండేవారు. వారంతా స్వతగాహాగా పార్టీ పేరుతో ఎదిగారు. కానీ, మోడీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన మాటే శాసనంలా తయారైంది. జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నా, మోడీ, షా చెప్పిందే ఫైనల్ అనేలా పరిస్థితి తయారైంది. అంటే పార్టీలు ఏవైనా కానీ, ఫైనల్ గా వ్యక్తుల ప్రభావమే కీలకంగా మారుతుంది. అది టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, బీఎస్పీ అయినా, పార్టీలు ఏవైనా ఫైనల్ గా వ్యక్తుల నిర్ణయాలే కీలకం. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయినా మరోసారి గుర్తు చేయడమే నా ప్రయత్నం.

– రచయిత శేఖర్ కంభంపాటి (98854 15533)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X