హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ విభజన వివాదాలపై కేసీఆర్ ఏ వైపు ఉంటారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిలదీశారు. ఆనాడు పోలవరం పొక్క కొట్టి ఆంధ్రావాళ్లు నీళ్లను తరలించుకు పోతున్నారన్న కేసీఆర్.. ఇప్పుడు జగన్ ను ఎందుకు అడ్డుకోవడంలేదని ప్రశ్నించారు. పోలవరం పై కేసీఆర్ నిర్ణయం ఏమిటో చెప్పాలన్నారు. బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో జరిగిన టీపీసీసీ శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు.
పార్టీ జెండాను ఆవిష్కరించి శిక్షణా తరగతులను ప్రారంభించారు. ధరణి సమస్యలు, హాత్ సే హాత్ జోడో అభియాన్ తో పాటు వివిధ అంశాలపై పార్టీ శ్రేణులకు ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. జాతీయ పార్టీ పేరుతో తెలంగాణపై కేసీఆర్ వైఖరిని రేవంత్ ప్రశ్నించారు. “పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ తెలంగాణా వైపు ఉంటాడా? రాయలసీమ వైపు ఉంటాడా?. గోదావరి, కృష్ణా వివాదాలపై నువ్ ఆ గట్టున ఉంటావా.. ఈ గట్టున ఉంటావా? ఆస్తుల విభజనలో కేసీఆర్ ఎవరివైపు ఉంటాడో చెప్పాలి. 1200 మంది విద్యార్థుల బలిదానాలు చేసింది ఇందుకేనా?
అన్ని త్యాగాలు చేసి కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే.. ఇవాళ ఆ గట్టున చేరి కేసీఆర్ మనల్ని ముంచాలని చూస్తున్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశాడు. డీజీపీ, చీఫ్ సెక్రటరీ లను బీహారీలను నియమించి కేసీఆర్ ఏం సందేశం ఇస్తున్నారో గమనించాలి. ఆంధ్రా పాలకులు కూడా ఇంత దారుణంగా తెలంగాణ ఆత్మ గౌరవంపై కొట్టలేదు” అన్నారు రేవంత్.
దేశం కోసం రాహుల్ గాంధీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యాత్ర చేస్తున్నారన్నారు రేవంత్. దుష్ట శక్తులు ఆశించినట్లు తెలంగాణ సమాజానికి నష్టం చేయబోమని ఈ వేదిక ద్వారా కాంగ్రేస్ శ్రేణులు నిరూపించారని ఆయన తెలిపారు. ఈ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు. కుటుంబానికి పెద్దదిక్కులా పార్టీకి జానారెడ్డి పెద్దదిక్కుగా వ్యవహరించేందుకు అందరం ఆమోదిస్తున్నామని తెలిపారు. పెద్దలు జానారెడ్డి గారి సూచనల ప్రకారం నడుచుకుందామన్నారు రేవంత్. ఇక నుంచి ప్రజలకు నష్టం కలిగేలా వ్యవహరించబోమని ఈ వేదిక ద్వారా సందేశం ఇద్దామన్నారు.
ఎలాంటి త్యాగానికైనా నేను సిద్ధం : రేవంత్
రెండుసార్లు అధికారం ఇచ్చినా అరవయ్యేళ్ల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చలేదన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలనలో దగా పడని వర్గం లేదని… కుటుంబాలపై దౌర్జన్యం చేసిన దుర్మార్గపు పరిస్థితులు తెలంగాణలో దాపురించాయన్నారు. అందుకే కార్యోన్ముఖులమై కదులుదామని, ఉప్పెనలా కేసీఆర్ కుటుంబాన్ని కప్పేద్దామని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ఏం ఆదేశించినా తాను సామాన్య కార్యకర్తలా పనిచేస్తానన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం కట్టుబడి పని చేస్తానని… పార్టీ కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా తాను సిద్ధమని తెలిపారు రేవంత్. అవసరమైతే పదవుల్ని, ప్రాణాల్ని త్యాగం చేయడానికి సిద్ధమని రేవంత్ స్పష్టం చేశారు.