కేంద్ర బడ్జెట్ 2023పై BRS నాయకుల స్పందన

హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ 2023పై BRS నాయకులు ఘాటుగా స్పందంచారు.

పేదలు, కార్మిక, కూలీ వ్యతిరేక ప్రభుత్వం… ఈ బిజెపి ప్రభుత్వం

ఉపాధి హామీకి నిధులు తగ్గించి పేదల పొట్ట గొడుతుంది

బడ్జెట్ లో తెలంగాణకు కోత పెట్టీ మరోసారి తెలంగాణ వ్యతిరేకత చాటుకుంది

పేదల వ్యతిరేక బీజేపీకి త్వరలోనే ప్రజలు సమాధి కడుతారు

కేంద్ర బడ్జెట్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపాటు

బిజెపి పార్టీ నడుపుతున్న కేంద్రంలోని ప్రభుత్వం అడుగడుగునా పేదలు, ఉపాధి కూలీలు, కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని.. పేదల పొట్టగొడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ వ్యతిరేక, పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్ గా ఉందని అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులను కేటాయించకుండా, రాష్ట్రం చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా.. బడ్జెట్లో కోతలు విధించడం ద్వారా మరోసారి తన తెలంగాణ వ్యతిరేకతను బట్టబయలు చేసిందని తెలిపారు.

ఉపాధి హామీ పథకాన్ని నిర్విర్యం చేసే కుట్రతో ప్రతి ఏటా నిధుల కేటాయింపుల్లో కోతలు పెడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు పెద్ద పీట వేస్తూ… గ్రామీణ ప్రాంత కూలీలు, కార్మికుల పట్ల వివక్ష చూపుతోందన్నారు.

ఉపాధి హామీ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి రావలసిన దాదాపు 800 కోట్ల రూపాయలను ఇవ్వకుండా రకరకాల కొర్రీలు వేస్తూ… తాజాగా ఉపాధి హామీ పథకం కింద ఏకంగా 30 వేల కోట్ల రూపాయలను తగ్గించడం గ్రామీణ వ్యతిరేక బిజెపి ప్రభుత్వానికి నిదర్శనం అన్నారు

పల్లెల్లోని ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా, ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకానికి ఏటేటా నిధులు తగ్గిస్తూ నిరుగారుస్తోంది అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి కేవలం రూ.60వేల కోట్లను మాత్రమే కేటాయించిందన్నారు.

2022-23 గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీకి రూ.89వేల కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరానికి 2023-24లో 30వేల కోట్ల రూపాయలకు పైగా కోత విధించడం దురదృష్టకరం అన్నారు. అదే విధంగా గ్రామీణ సడక్ యోజన పథకానికి మూడేళ్లుగా బడ్జెట్ లో 19వేల కోట్ల రూపాయలనే కేటాయిస్తూ.. ఒక్క రూపాయి పెంచకపోవడం బట్టి గ్రామీణ భారత వ్యతిరేఖ ప్రభుత్వంగా చరిత్రలో బిజెపి ప్రభుత్వం నిలిచిపోతుంది అని ఎద్దేవా చేశారు.

పేదలు, కార్మికులు, కూలీల పొట్టగొట్టి, రైతు వ్యతిరేఖ, గ్రామాల అభివృద్ది నిరోధక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి ప్రజలంతా కలిసి రానున్న ఎన్నికల్లో సమాధి కడతారని అన్నారు.

కేంద్రానిది రైతు వ్యతిరేక బడ్జెట్‌ : హరీశ్‌రావు

కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా రైతులకు, పేదలకు వ్యతిరేకంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి, పేదల ఆహార భద్రత కార్యక్రమానికి నిధుల్లో దాదాపు 30 శాతం కోత విధించడాన్ని మంత్రి తప్పుబట్టారు. ఎరువుల సబ్సిడీని తగ్గించి రైతులపై అదనపు భారం మోపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణపై ఎప్పటిమాదిరిగానే నిర్లక్ష్యం చూపారన్నారు.

పేదలకు మాత్రం అన్యాయం చేస్తూ, కార్పొరేట్లకు మాత్రం అనుకూలంగా బడ్జెట్‌ను రూపొందించారని చెప్పారు. బీజేపీ హయాంలో ఇప్పటికే రికార్డు స్థాయి అప్పులు చేశారని, ఈ ఏడాది దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూడడం దురదృష్టకరమన్నారు. విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు కేంద్రం పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. విభజన హామీల గురించి కనీస ప్రస్తావన కూడా లేదని వాపోయారు. రాష్ట్రానికి ప్రోత్సాహకాలు అడిగితే ఇవ్వలేదన్నారు. ఏ ఒక్క రంగానికి కూడా సంపూర్ణ న్యాయం చేయలేదని, ఇదొక భ్రమల బడ్జెట్‌ అని మంత్రి విమర్శించారు.

యూనియన్ బడ్జెట్ 2023పై MLC కవిత స్పందన

తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు బడ్జెట్ లో ఏమీ ఇవ్వలేదని చెప్పారు. సబ్ కా సాత్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 119 నర్సింగ్ కాలేజీలను బడ్జెట్ లో ప్రకటించారని, వాటిని కేవలం మంజూరైన మెడికల్ కాలేజీ వద్దనే ఏర్పాటు చేస్తారని, ఈ క్రమంలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయనప్పుడు ఒక్క నర్సింగ్ కాలేజీ కూడా తెలంగాణకు రాదని స్పష్టం చేశారు.

గుజరాత్ లోని గిఫ్ట్ సిటీకి 2025 వరకు పన్ను మినహాంపును పొడిగించినప్పుడు మరి తెలంగాణ నిమ్జ్, ఇతర సెజ్ ల పరిస్థితి ఏమిటని నిలదీశారు. కొన్ని రాష్ట్రాల వైపే ఎందుకు చూస్తున్నారని అడిగారు. ఇది జాతీయ బడ్జెటా లేదా కొన్ని రాష్ట్రాల బడ్జెట్ మాత్రమేనా అని నిలదీశారు. కర్నాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5300 కోట్లు కేటాయించినందుకు సంతోషమే కానీ తెలంగాణకు చెందిన కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు కేటాయింపులేవని ప్రశ్నించారు.

నీతీ ఆయోగ్ సిఫారసు చేసిననప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్ లో భవిష్యత్తుపై నిర్ధిష్టమైన ప్రణాళిక ఏమీ లేదని విమర్శించారు. కొత్త పథకాలు ప్రకటించకపోవడం, పాత పథకాలను విస్మరించడం వంటివి చూస్తుంటే ఏడాది తర్వాత ఈ ప్రభుత్వం వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోందని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వృద్ధిని నిర్ధేశించని బడ్జెట్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. బడ్జెట్ ను మోదీ అంకెల గారడిగా అభివర్ణించారు.కరోనా సమయంలో ఎంఎస్ఎంఈలకు రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఒక లక్ష కోట్లు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. తెలంగాణకు సంబంధించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎయిర్పోర్టుల వంటి ప్రాజెక్టుకు ప్రకటించినా అవన్నీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు, బీజేపీ పాలిత రాష్ట్రాలకే మంజూరు చేస్తారని తెలిపారు. నిజామాబాద్, వరంగల్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉందని, గత 9 ఏళ్లుగా కోరుతున్నా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. ఏయే రాష్ట్రాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తరో జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలకు రూ. 10 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించిన కేంద్రం… వాటిని ఏ సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. కేవలం వారి కార్పొరేట్ మిత్రులకే వెళ్తాయా ఈ నిధులు అని అడిగారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కామెంట్స్

కేంద్ర బడ్జెట్ ఆచరణ సాధ్యం కావాలంటే.. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తూ ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం. అలాంటప్పుడు బడ్జెట్ సత్ ఫలితాలు ఎలా వస్తాయి.

దేశంలో అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా లేవు. కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ఒకే రకమైన స్కీం ను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తోంది. ఇది ఆచరణ యోగ్యం కాని ప్రయోగం.

ఒకే దేశం, ఒకే చట్టం అని, డబుల్ ఇంజన్ సర్కార్ అని కేంద్ర ప్రభుత్వం ఏవేవో ఆలోచనలు చేస్తోంది. రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తోంది. కేంద్ర బడ్జెట్ లో కొత్త స్కీమ్స్ లేనే లేవుఏ రంగాన్ని కూడా మేలు చేయని ఘోరమైన కేంద్ర బడ్జెట్ ఇది.

కేంద్ర జనరల్ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను కలపడంతో అంతా గందరగోళం నెలకొంది. కేంద్ర బడ్జెట్ లో అన్ని పద్దుల్లో రైల్వే పద్దు ఒకటిగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే… తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు

ఇప్పుడేమో నర్సింగ్ కాలేజీలు ఇస్తామని కేంద్ర బడ్జెట్ లో చెప్తున్నారు. నర్సింగ్ కాలేజీలలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయమే జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఈ మెడికల్ కాలేజీలకు కేంద్రం ఒక్కో దానికి రూ. 400 కోట్లు ఇవ్వాలి.

రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నా దాని ఊసే లేకుండా పోయింది. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు. చాతకాని తనంపై బిజెపి ఎం.పీ. లు ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో అడుగు పెట్టే నైతిక హక్కు బిజెపి రాష్ట్ర నలుగురు ఎం.పీ.లు కోల్పోయారు.

ఎన్నికల సందర్భంగా మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీకి నిధుల మంజూరు, శంకుస్థాపన గుర్తుకు వస్తాయి. ఇలా గుజరాత్ ఒక్క రాష్ట్రానికే ఒక లక్షా 35 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నరేంద్ర మోడీ శంకుస్థాపనలు చేశారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో 5,300 కోట్ల రూపాయల నిధులను నరేంద్ర మోడీ మంజూరు చేశారు.

దేశంలోని బ్యాంకులను ముంచిన బడా బాబులను విదేశాల నుంచి రప్పిస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ… వారు విదేశాల్లో జల్సాలు చేస్తున్నా పట్టించుకోకుండా దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది ఒక్కటి కూడా నిజం కాలేదు.

కేంద్ర బడ్జెట్ పై రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కామెంట్స్

రాష్ట్రాలను బలహీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ రంగానికి కూడా మంచి చేసేదిగా లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదానిచ్చి నిధులు కేటాయించాలనే తెలంగాణ ప్రజల డిమాండ్ ను ఏ మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం

కేంద్రం గతంలో 157 వైద్య కళాశాలలు మంజూరు చేస్తే,అందులో ఒకటంటే ఒకటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు ఇప్పుడేమో నర్సింగ్ కాలేజీలు ఇస్తామని బడ్జెట్ లో పేర్కొన్నారు,అయితే వీటిలో కూడా తెలంగాణకు కేంద్రం అన్యాయమే చేసేటట్టు కనిపిస్తున్నది

తెలంగాణకు ఐఐఎం మంజూరు చేయకపోవడం, గిరిజన విశ్వవిద్యాలయానికి ఆశించి…

రైతులను,పేదలను దగా చేసి అదానీ,అంబానీలను ఆదుకునే బడ్జెట్

ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనుకోవడం సిగ్గు చేటు

మోడీ ప్రభుత్వ చివరి బడ్జెట్ లో కూడా పసుపుబోర్డు కు మొండిచేయి

కర్ణాటక అప్పర్ భద్ర కు ఇచ్చారు సరే…తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం,పాలమూరు-రంగారెడ్డిసాగునీటి ప్రాజెక్టులు ఎందుకు మరిచారు..?

తెలంగాణ జాతీయ రహదారులకు ఇప్పటి వరకు లక్ష 25 వేల కోట్లు కేటాయించి ఎనిమిది ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 18వేల కోట్లే

మెడికల్ కాలేజీలు ఏవి, నర్సింగ్ కాలేజీలు ఏవి,నవోదయ స్కూల్స్ ఏవి,రైల్వే లైన్లు ఏవి..?

తెలంగాణకు వచ్చి మోడీ అండ్ కో బ్యాచ్ ప్రసంగాల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పడం తప్పా…చేతల్లో ఒరిగింది శూన్యం

ఈ బడ్జెట్ తో తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరి మరోసారి తేటతెల్లం అయ్యింది

కేంద్ర బడ్జెట్ పై మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు

హైదరాబాద్: బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను,పేదలను దగా చేసి అదానీ,అంబానీలను ఆదుకునే బడ్జెట్లా ఉన్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది రైతులను,పేదలను పూర్తిగా వంచించే బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పథకానికి గత బడ్జెట్ కంటే 30వేల కోట్లు తగ్గించి పథకాన్ని నిర్వీర్యం చేయాలనుకోవడం సిగ్గు చేటన్నారు. మోడీ ప్రభుత్వ చివరి బడ్జెట్ లో కూడా పసుపుబోర్డు కు మొండిచేయి చూపారన్నారు.

నిజామాబాద్ ఎంపి ఎన్నికల హామీని నెరవేర్చక పసుపు రైతులను వంచనకు గురి చేశాడని మండిపడ్డారు. కర్ణాటక అప్పర్ భద్రకు జాతీయహోదా ఇచ్చి ప్రత్యేక నిధులు కేటాయించారు సరే…తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం,పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు మరిచారని ప్రశ్నించారు. ఇంత పెద్ద సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో రూపాయి కేటాయించక పోవడం ముమ్మాటికీ తెలంగాణపై బీజేపీ కేంద్ర ప్రభుత్వ వివక్షే అన్నారు. తెలంగాణ జాతీయ రహదారులకు ఇప్పటి వరకు లక్ష 25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించిన కేంద్రం ఈ ఎనిమిది ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 18వేల కోట్లే అని తెలిపారు. తెలంగాణకు జాతీయ రహదారులు భారీగా ఇచ్చాం అని గొప్పలకు పోతున్న వారు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. జాతీయ రహదారుల కోసం కేటాయించిన బడ్జెట్ ఈ లెక్కన చూస్తే ఎన్ని సంవత్సరాలకు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు.

బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ లేదు, నర్సింగ్ కాలేజీ లేదు,నవోదయ స్కూల్స్ ఊసే లేదు,రైల్వే లైన్లు లేవు అన్నింటా తెలంగాణపై బీజేపీ మోడీ ప్రభుత్వం వివక్ష ప్రదర్శించిందని మండిపడ్డారు. మోదీ అండ్ కో బ్యాచ్ తెలంగాణకు వచ్చి ప్రసంగాల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పడం తప్పా..చేతల్లో చూపించింది శూన్యం అన్నారు. ఈ బడ్జెట్ కేటాయింపులతో తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరి మరోసారి తేటతెల్లం అయ్యిందన్నారు. ఇకనైనా తెలంగాణ బీజేపీ నేతలు జబ్బలు చరుచుకోడం మానేసి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్ హాస్య స్పదంగా ఉన్నది – సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్.

39 లక్షల 45వేల కోట్ల బడ్జెట్ లో ఎస్సి లకు 15 వేలు, ఎస్టీ లకు 15వేలు, బీసీలకు కేవలం 1400 కోట్లు మాత్రమే కేటాయించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 38 వేల కోట్లు ఎస్సీల అభ్యున్నతి కి ఖర్చు చేస్తుంటే, కేంద్రం దేశ వ్యాప్తంగా కేవలం 15 వేల కోట్లు కేటాయించడం సిగ్గు చేటు.

కేంద్ర బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ, బిసి లకు మొండి చేయి చూపించారు

దేశ వ్యాప్తంగా అనగారిన వర్గాలను కేంద్ర ప్రభుత్వం అవమాన పరిచింది..

మోడీ పాలనలో అన్యాయం, వివక్ష కొనసాగుతున్నదనడానికి కేంద్ర బడ్జెట్ నిదర్శనం.

*రైతు, ఉద్యోగులు, ఉపాధి హామీ కూలీలకు ఈ బడ్జెట్ వ్యతిరేకంగా ఉన్నది.

*కార్పోరేట్ల కు కొమ్ము కాసే విధంగా బడ్జెట్‌ ఉన్నది.

*కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వ్యవసాయంతో పాటు ఇతర రంగాలను పట్టించు కోనేలేదు.

*దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసే విధంగా బడ్జెట్‌ వుంది.

*రాష్ట్రాలను కేంద్ర బడ్జెట్ ఆర్థికంగా దెబ్బతీసింది.

*విద్య, వైద్య రంగాలను పట్టించుకోలేదు.

*ముఖ్యంగా తెలంగాణకు మొండిచేయి చూపించింది

*విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు.

*ఎన్నికలున్న కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్లు కేటాయించారు.

*పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని విస్మరించారు.

*మాటలు కోటలు తప్ప.. నిధుల కేటాయింపులో ప్రాధాన్యత చూపించలేదు.

*తొమ్మిదేళ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గురించి మాటలేదు.

గ్రామీణ ఉపాధి హామి నిధుల్లో కోత పెట్టారు, ఆహార సబ్సిడీలు తగ్గించారు.

ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా ఏమీ లేదు.

జీఎస్టీ రూపంలో దేశ ఉత్పత్తి, సేవా పన్నుల రూపంలో ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నామని కేంద్రం చెబుతున్నా, ఈ విధానాలు కేవలం కార్పోరేట్, సంపన్న వర్గాలకు మాత్రమే మేలు చేకూర్చే విధంగా ఉన్నయే తప్ప, సంపద సృష్టిస్తున్న బడుగు జీవులకు ఒరిగిందదేమి లేదన్నారు

దేశంలో కులవృత్తులనే నమ్ముకుని జీవనం కోనసాగిస్తున్న వారి పరిస్థితులు రోజు రోజుకు దయనీయంగా మారుతున్నాయి.

వంట నూనెలు, పెట్రోల్, డిజిల్ తో పాటు ఇతర నిత్యావసర ధరలు ఈ బడ్జెట్లో పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాల ఆశలు గల్లంతయ్యాయి. కేంద్ర బడ్జెట్ ను పున: సమీక్షించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X