సిద్ధిపేట : భూమిత్ర అంటే భూమికి మిత్రులుగా మారాలి. భూమి, ఆరోగ్యం మనిషి ఆరోగ్యానికి భూమికి అవినాభావ సంబంధం ఉంటుంది. భూమి బాగుంటే మనిషి బాగుంటాడు. రసాయనికి ఎరువులు వాడితే సమాజంలో క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుంది. క్యాన్సర్ వస్తే ఆర్థికంగా, శారీరకంగా పూర్తిగా దెబ్బతింటారు. భూమి సారాన్ని కాపాడుకుంటేనే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పత్తి మార్కెట్ ఆవరణలో భూమిత్ర మన తడిచెత్త- మన సేంద్రీయ ఎరువు- మన నేల సిద్ధిపేట బ్రాండ్ తో జీవ సంపన్న సేంద్రీయ ఎరువులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కాలం మారిందని, ఎనకట రెండు పూటలా అన్నం తినడం ఉండేదని, ఈ రోజుల్లో పేదలు రెండు పూటలా అన్నం తింటుంటే, డబ్బున్న వాళ్లు గంజి, గట్కా, రొట్టెలు తింటున్నారని, కానీ రసాయనిక ఎరువులతో తిన్న ఆహారంతో బీపీ, షుగర్ లతో పరిస్థితి రివర్స్ అయిపోయి తిరోగమనం వైపు మనిషి పయనిస్తున్నాడని మంత్రి చెప్పుకొచ్చారు.
భూమిత్ర సిద్ధిపేట మున్సిపాలిటీ పట్టణ ప్రజలైన 41 వేల 322 మంది విజయమని, ఇదంతా పట్టణ ప్రజలు నిత్యం తడి, పొడి, హానికరమైన చెత్త వేర్వేరుగా ఇవ్వడంతో సాధ్యమైందని మంత్రి వెల్లడించారు.
సిద్దిపేటలో 34 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్నదని, ఇందులో తడి చెత్త 27 లక్షల మెట్రిక్ టన్నులు, 4 మెట్రిక్ టన్నుల పొడి చెత్త, మిగతాది హానికరమైన చెత్త వస్తుందని మంత్రి వివరించారు.
తడి చెత్తను ఎరువుగా, పొడి చెత్తను రీ సైక్లింగ్ కు, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సిమెంట్ కర్మాగారం కు విక్రయిస్తున్నట్లు, చెత్తను వెల్త్ ఆఫ్ వేస్ట్ గా మార్చుకోవడం సిద్దిపేట మున్సిపాలిటీ గొప్పతనంగా అభివర్ణించారు.
ప్రతి నెల 4500 కిలోల గ్యాస్ తయారు చేస్తున్నామని, అలాగే ప్రతి నెల 100 మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తి అవుతున్నదని, గ్యాస్ ద్వారా 3 లక్షలు, ఎరువుల ద్వారా 7.3 లక్షల ఆదాయం, పొడిచెత్త ద్వారా 11.30 లక్షల ఆదాయం మొత్తం 21 లక్షల పైగా ఆదాయం సిద్దిపేట మున్సిపల్ కు సమకూరుతుందని మంత్రి చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కాపాడుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఆయిల్ ఫామ్ ఒక్కో మొక్కకు రెండున్నర కిలోల సేంద్రీయ ఎరువులు వాడకం మంచిదని చెప్పుకొచ్చారు.
వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్ పంపిణీ
మార్కెట్ యార్డు ఆవరణలో వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్లను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. వ్యవసాయ పరికరాలు చిన్న, సన్న కారు రైతులకు అందుబాటులో తేవడానికి, తక్కువ రేటుకు అద్దెకు ఇవ్వడానికి మండల సమాఖ్య ఆధ్వర్యంలో కస్టమ్ హెరింగ్ సెంటర్స్-వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 21 మండల సమాఖ్యలు – రాయపోల్, సిద్ధిపేట అర్బన్ మినహా సీహెచ్ సీలను రూ.3.05 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 75 శాతం, ఏం.ఎస్. సొంత నిధులు రూ.2.09 కోట్లు మరియు 25 శాతం ఎస్.ఆర్.ఎల్.ఎం రూ.96 లక్షలు వెచ్చించినట్లు వివరించారు.
CHCలో ప్రధాన పరికరాలు: ట్రాక్టర్, ప్యాడి బేలర్, రోటో వేటర్, కల్టీ వేటర్, తైవాన్ స్ప్రేయర్స్, ప్యాడి క్లినర్లు కం.లిప్టర్, పవర్ వీడర్, మల్టీ కాటస్ షెడ్డర్, 3 హెచ్ పీ ఇంజన్ మౌంటెడ్ స్ప్రేయర్, ట్రాలీ, డోజర్, టార్పెలిన్ మొదలగు పరికరాలు. జిల్లాలోని 4 మండలాల్లో డ్రోన్ స్ప్రేయర్లు ఏర్పాటుకు కోహెడ, నారాయణరావుపేట, బెజ్జంకి, గజ్వేల్ ప్రణాళిక చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు కోహెడ మండల సమాఖ్యకు రూ.9.63 లక్షలు అందించారు.
అగ్రికల్చర్ డ్రోన్ వల్ల కలిగే ప్రయోజనాలు:
రైతులు మందు పిచికారి చేస్తున్నప్పుడు ఎకరాకు 120 లీటర్ల వరకూ నీరు వాడుతున్నారు. దీనితో మందు శాతం తగ్గిపోతుంది. పిచికారి చేస్తున్నప్పుడు శరీరం పై పడటం, వాసన పీల్చడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిత్యం 3 నుంచి 4 ఎకరాల కంటే ఎక్కువగా పిచికారి చేయలేకపోవడం లేబర్ సమస్య. ఒక ఎకరాకు లీటరు ఆపైన మందు కొట్టడం ఆర్థిక భారం పెరుగుతున్నది. అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయర్స్ వలన పంట పై భాగంలో కొట్టడం వలన పిచికారి చేసిన మందు పూర్తి శాతం పంటపై పడుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలకు తావులేదు. గంటకు 10 ఎకరాల వరకూ పిచికారి చేసే అవకాశం ఉంది. ఒక ఎకరాకు లీటరుకు బదులుగా 700 గ్రాముల మందు పిచికారి చేయడానికి సరిపడుతుంది.
మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత-వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.