ఉస్మానియాలో పోలీసులు అరెస్ట్ చేసిన జీ న్యూస్ జర్నలిస్ట్ ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్
ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛను హరిస్తే సహించేది లేదంటూ ప్రభుత్వానికి హెచ్చరిక
హైదరాబాద్ : రాష్ట్రంలో జర్నలిస్ట్ లపై పోలీసులు వ్యవహారిస్తున్న తీరును భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాపాలనలో జర్నలిస్ట్ లకు కూడా రక్షణ లేదా అని ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా ఓయూ లో డీఎస్సీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనను కవర్ చేస్తున్న జీన్యూస్ రిపోర్టర్, కెమెరామెన్ లను అక్రమంగా అరెస్ట్ చేయటం దారుణమని మండిపడ్డారు. జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా ? డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే తప్పా అని ప్రశ్నించారు.
నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన… ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జీన్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్ట్. ఇందిరమ్మ రాజ్యమంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమేనా అని కేటీఆర్ నిలదీశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read-
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియాలో మళ్లీ ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్లకంచెలు, అడగడుగునా దర్శనమివ్వటం చూస్తుంటే విద్యార్థులు మరో ఉద్యమంతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పటం ఖాయమన్నారు.
పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్ట్, కెమెరా మెన్ లను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే సహించే ప్రసక్తే లేదన్నారు. జర్నలిస్టులపై పోలీసుల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ జర్నలిస్ట్ యూనియన్లు చేసే పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.