మానసిక ఆరోగ్యం సమగ్ర ఆరోగ్యంలో అంతర్భాగం! మానసిక ఆరోగ్యం ప్రాధాన్యత దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు తోడు 1948 అక్టోబర్ 10 వ తేదీన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ (డబ్ల్యూ ఎఫ్ ఎం ఎచ్) ఏర్పాటు అయింది. ఇప్పటికి డెబ్బయి అయిదు సంవత్సరాలు. అంటే డబ్ల్యూ ఎఫ్ ఎం ఎచ్ కు ఇది వజ్రోత్సవ సంవత్సరం. అదే 1948 సంవత్సరం డిసెంబర్ 10 న ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశం “యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్” ప్రకటన చేసింది. ఈ రెండు ప్రధాన ఘటనలను పరిగణన లోనికి తీసికొన్న డబ్ల్యూ ఎఫ్ ఎం ఎచ్ 2023 సంవత్సరానికి “మానసిక ఆరోగ్యం విశ్వజనీన మానవ హక్కు” (మెంటల్ హెల్త్ ఈస్ ఎ యూనివర్సల్ హ్యూమన్ రైట్) అనే నినాదాన్ని ఎంపిక చేసింది.
హక్కులను ఆధారం చేసుకొని మన దేశంలో “మానసిక ఆరోగ్య విధానం-2014” రూపకల్పన జరిగింది. అదే స్ఫూర్తితో “మెంటల్ హెల్త్ కేర్ ఆక్ట్ – 2017” మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తుల హక్కులకు, గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది. మానసిక అనారోగ్యం వల్ల పలు విధాల నష్టాలు కలుగుతయి. భారతదేశంలో 2012-2030 సంవత్సరాల మధ్య 1.03 ట్రిలియన్ యూ ఎస్ డాలర్ ల ఆర్థిక నష్టం వాటిల్ల కలదని డబ్ల్యూ ఎచ్ ఓ అంచనా వేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్) చేసిన సర్వే లో దేశంలోని 18 సంవత్సరాలు పైబడిన వయసు వారిలో 10.6 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నరని తేలింది.
ఆరోగ్యం కుటుంబ సంక్షేమపు స్టాండింగ్ కమిటీ “మెంటల్ హెల్త్ కేర్ అండ్ ఇట్స్ మానేజ్మెంట్ ఇన్ కాంటెంపరరీ టైమ్స్” అంశంపై పార్లమెంట్ కు సమర్పించిన 148 వ రిపోర్ట్ లో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నయని పేర్కొన్నది. అరకొర సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరత, చాలి చాలని నిధుల వలన సమస్య తీవ్రమైతున్నదని హెచ్చరించింది. నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం కింద పలు కార్యక్రమాలు చేపడుతున్నరు. జిల్లా వైద్యశాలలలో మానసిక వైద్య నిపుణులను నియమించి 10 పడకలు కూడా కేటాయించిండ్రు. కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్ లో టెలి మెంటల్ హెల్త్ కోసం నిధులు కేటాయించింది. నిపుణులతో 24 గంటలు ఉచిత మానసిక ఆరోగ్య సలహాలు అందించటానికి టెలి మనస్ 144416 నంబర్ అందుబాటు లోనికి వచ్చింది.
నిమ్హాన్స్ దూర విద్యా విధానంలో మెడికల్ ప్రాక్టిషనర్ లు, సైకాలజిస్ట్ లు, నర్స్ లు, సోషియల్ వర్కర్ లకు మానసిక ఆరోగ్యంలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నది. ఫార్మసిస్ట్ లకు మెంటల్ హెల్త్ ఫార్మసీ లో శిక్షణ ఈయవలసి ఉన్నది. మానసిక ఆరోగ్యాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలతో సమ్మిళితం చేసే ప్రయత్నాలు అంతగా ఫలవంతం కావటం లేదు. ఆరోగ్య రంగంలో పని చేస్తున్న వారిలో వ్యక్తిత్వ వికారాలు, మానసిక రుగ్మతలు ఉన్న వారి అనంగీకారము, కుటుంబ సభ్యుల వివక్ష వంటి పలు కారణాల వల్ల మానసిక రోగులకు సరియైన చికిత్స అందించ లేని పరిస్థితులు ఏర్పడుతున్నయి. గృహాలు, విద్యాశాలలు, పని ప్రదేశాలు, సామాజిక, సాంస్కృతిక సన్నివేశాలు వంటి అన్ని చోటులలో చైతన్యం కల్పించటమే పరిష్కార మార్గం.

డాక్టర్ రాపోలు సత్యనారాయణ, ఫోన్: 9440163211
(వ్యాసకర్త హైదరాబాద్ సైకలాజికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు)