హైదరాబాద్ : జార్జిరెడ్డి సోదరి జాయ్ లావణ్య సోమవారం సాయత్రం అనారోగ్యంతో మైసూర్ లో కన్నుమూశారు. కుటుంబ కలహాలు, ఆర్ధిక సమస్యలతో ఆమె తన చదువు మధ్యలోనే మానేస్తే జార్జిరెడ్డి పట్టుబట్టి మరీ చదివించారు. ఫలితంగా మైసూర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో పరిశోధన చేసింది. బోధించింది.
ఆమె పేద మధ్యతరగతి విద్యార్థులను, ముఖ్యంగా దళితులను ఆదరించింది. మైసూర్ లోని తన ఇంటిలో అనేక మంది విద్యార్థులు అక్కడే తిని చదువుకునేవారు. జార్జిరెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో జార్జి విషయాలను ప్రస్తావించారు ప్రసంగించారు.
విప్లవ జోహార్లు
జార్జిరెడ్డి చివరి సోదరిగా మిగిలి ఉన్న జాయ్ మరణించడం బాధాకరం. ఆమెకు PDSU గ్రేటర్ హైదరాబాద్ తరుపున విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం.
జార్జిరెడ్డి
జార్జిరెడ్డి 1947 జనవరి 15 న పాల్ఘాట్, కేరళలో చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథరెడ్డి, ట్రావెన్కూరు ప్రాంతానికి చెందిన లీలా వర్గీస్ దంపతులకు జన్మించాడు. ఈయన తల్లితండ్రులు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో కలుసుకున్నారు. రఘునాథరెడ్డి బి.ఏ హానర్స్ చేయగా, లీలా వర్గీన్ రసాయనశాస్త్రంకీ డిగ్రీ పూర్తిచేసి, ఎం.ఏ చదివింది. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. పెద్దవాడైన డాన్ రెడ్డి బి. ఈడీ పూర్తిచేసి, ఒరిస్సాలో స్థిరపడ్డాడు. రెండవ కొడుకు కార్ల్ రెడ్డి ఐఏఎస్ అధికారి అయ్యాడు. కుమార్తె జాయ్ రెడ్డి, భాషాశాస్త్రంలో ఎంఏ చేసి మైసూరులోని భారతీయ భాషా అధ్యయన కేంద్రంలో పనిచేసింది. నాలుగవ సంతానం జార్జ్ రెడ్డి, చివరి వాడు సిరిల్ రెడ్డి.
జార్జి తొలుత కాంగ్రేస్ పార్టీలోని యంగ్ టర్క్‌లను అనుసరించాడు. 1969-70ల నుంచి సోవియట్ యూనియన్ అండతో కాంగ్రేస్ పార్టీ పెట్టుబడిదారీ సంస్కరణ పంథావైపు నడిపించే ప్రయత్నం జరిగింది. అందుకోసం యంగ్ టర్క్‌లు కాంగ్రేస్ పార్టీలో యువబృందంగా అవతరించింది. ఫ్యూడల్ భూస్వాముల వ్యతిరేకంగా యంగ్‌టర్కుల తీవ్రవాద నినాదాలు జార్జిని ఆకర్షించాయి. వారు ‘సోషలిస్టు స్టడీ ఫోరం’ గా ఏర్పడి సాగించిన ప్రచారాన్ని చిత్తశుద్ధిగా నమ్మాడు. తన స్నేహితుడు కె శ్రీనాథ్ రెడ్డి యొక్క తండ్రి, కేంద్ర మంత్రి కెవి రఘునాథరెడ్డి ప్రోద్భలంతో కాంగ్రేస్ పార్టీ యొక్క విద్యార్థిసంఘమైన యూత్ కాంగ్రేసులో చేరాడు. కానీ అవి కూడా పెట్టుబడిదారీ వ్యవస్థను కొత్తముసుగుతో పరిరక్షించే ఎత్తుగడగా త్వరలో అర్ధం చేసుకొని, దానిపై భ్రమలు వీడి విప్లవ పంథాను స్వీకరించాడు.
మరణం
1972 ఏప్రిల్ 14 సాయంత్రం ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న జార్జిపై 30 మందికి పైగా దుండగలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మెట్లపై దాడిచేసి కత్తిపోట్లతో చంపేశారు. ఈయన జీవితం ఆధారంగా 2019 నవంబరు 22న జార్జ్ రెడ్డి సినిమా వచ్చింది. (Agencies)